IRFC: ఐఆర్‌ఎఫ్‌సీ OFSలో సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి పరిమిత స్పందన
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభుత్వ రంగ సంస్థ అయిన Indian Railway Finance Corporation (ఐఆర్‌ఎఫ్‌సీ)లో కేంద్ర ప్రభుత్వం విక్రయానికి తీసుకొచ్చిన 2 శాతం వాటాకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఈ ఆఫర్‌లో భాగంగా సంస్థాగత పెట్టుబడిదారుల కోసం రిజర్వ్ చేసిన 23.52 కోట్ల షేర్లను అమ్మకానికి ఉంచగా, వాటిలో 22.34 కోట్ల షేర్లకే బిడ్లు నమోదయ్యాయి. దీనితో మొత్తం 94.98 శాతం మేర సబ్‌స్క్రిప్షన్ నమోదైనట్టు స్పష్టమైంది. సంస్థాగత ఇన్వెస్టర్లు ఒక్కో షేరుకు రూ. 104.12 సూచిక ధర వద్ద బిడ్లు సమర్పించారు. ఈ బిడ్ల మొత్తం విలువ సుమారు రూ. 2,326 కోట్లుగా ఉంది. ఇక రిటైల్ పెట్టుబడిదారుల కోసం గురువారం నుంచి కొనుగోలు విండో అందుబాటులోకి రానుంది.
వివరాలు
2 శాతం వాటాకు సమానంగా 26.13 కోట్ల షేర్ల విక్రయానికి సిద్ధం
ఇదిలా ఉండగా, ప్రభుత్వం మొత్తం 2 శాతం వాటాకు సమానంగా 26.13 కోట్ల షేర్లను విక్రయించేందుకు సిద్ధమైంది. ఈ ఆఫర్‌కు అధిక డిమాండ్ వ్యక్తమైతే, అదనంగా మరో 2 శాతం వాటాను గ్రీన్‌షూ ఆప్షన్ కింద అమ్మే అవకాశాన్ని కూడా ప్రభుత్వం ఉంచింది. ఈ ఆఫర్‌కు సంబంధించి ఒక్కో షేరుకు రూ. 104ను ఫ్లోర్ ధరగా నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐఆర్‌ఎఫ్‌సీ కంపెనీలో కేంద్ర ప్రభుత్వానికి 86.36 శాతం వాటా కొనసాగుతోంది.