Page Loader
SIP inflow:మ్యూచువల్ ఫండ్ నెలవారీ SIP ఇన్‌ఫ్లో సరికొత్త రికార్డ్‌.. మొదటిసారిగా రూ. 25,000 కోట్లు  
మ్యూచువల్ ఫండ్ నెలవారీ SIP ఇన్‌ఫ్లో సరికొత్త రికార్డ్‌.. మొదటిసారిగా రూ. 25,000 కోట్లు

SIP inflow:మ్యూచువల్ ఫండ్ నెలవారీ SIP ఇన్‌ఫ్లో సరికొత్త రికార్డ్‌.. మొదటిసారిగా రూ. 25,000 కోట్లు  

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 11, 2024
05:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో క్రమానుగత పెట్టుబడుల ప్రణాళిక (SIP)పెట్టుబడులు నూతన రికార్డు సృష్టించాయి. ఈ విధానంలో మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు తొలిసారి రూ.25వేల కోట్ల మార్కును దాటాయి. అక్టోబర్‌ నెలలో మొత్తంగా రూ.25,323 కోట్లు ఇన్వెస్టర్స్ పెట్టుబడిగా పెట్టారు. సెప్టెంబర్‌ నెలలో ఈ మొత్తం రూ.24,509 కోట్లుగా ఉంది. అంతకముందు సంవత్సరం ఇదే సమయంలో ఈ మొత్తం రూ.16,928 కోట్లుగా ఉన్నట్లు మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల సంఘం (AMFI) వెల్లడించింది. కొత్త సిప్‌ రిజిస్ట్రేషన్ల సంఖ్య 63.7 లక్షలుగా నమోదైంది. దీంతో మొత్తం సిప్ అకౌంట్ల సంఖ్య 10.12 కోట్లకు పెరిగింది. సిప్‌ కింద నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ ఏయూఎం 13.30 లక్షల కోట్లకు చేరింది.

వివరాలు 

11 రకాల ఈక్విటీ కేటగిరీలలోనూ పెట్టుబడుల ప్రవాహం

ఈక్విటీ మార్కెట్లు, సెన్సెక్స్‌, నిఫ్టీ అక్టోబర్‌ నెలలో 5-6 శాతం తగ్గినా, సిప్‌ పెట్టుబడులు పెరిగిన విషయం గమనార్హం. అక్టోబర్‌ నెలలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో నికరంగా రూ.41,887 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. 11 రకాల ఈక్విటీ కేటగిరీలలోనూ పెట్టుబడుల ప్రవాహం కొనసాగింది. లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌లో రూ.3,542 కోట్లు, మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌లో రూ.4,683 కోట్లు, స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌లో రూ.3,773 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. హైబ్రిడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో అత్యధికంగా రూ.16,863.3 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. సెక్టోరల్‌, థీమాటిక్‌ ఫండ్స్‌ కలిపి రూ.12,278 కోట్లు, ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్స్‌లో రూ.5,180 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి.

వివరాలు 

మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.66.98 లక్షల కోట్లు 

ఫోకస్డ్‌ ఫండ్స్‌, ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌ కేటగిరీలో గడిచిన ఆరు నెలలుగా నిధులు వెనక్కి వచ్చినా, అక్టోబర్‌ నెలలో మాత్రం నిధుల ప్రవాహం కొనసాగింది. ఫోకస్డ్‌ కేటగిరీలో రూ.693 కోట్లు, ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌లో రూ.383 కోట్లు చొప్పున నిధులు వచ్చాయి. అక్టోబర్‌ నాటికి మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ (AUM) ఆల్‌టైమ్‌ గరిష్ఠమైన రూ.66.98 లక్షల కోట్లకు చేరింది.