Mutual funds: AI ఎఫెక్ట్‌తో ఐటీ రంగానికి షాక్.. తగ్గిన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
మ్యూచువల్ ఫండ్స్ టెక్నాలజీ రంగంలో పెట్టుబడులను భారీగా తగ్గించాయి. 2026 ఏప్రిల్ నాటికి టెక్ సెక్టార్‌లో వాటి పెట్టుబడి వాటా 8 ఏళ్ల కనిష్టమైన 6.7 శాతానికి పడిపోయిందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదిక వెల్లడించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం, ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఖర్చులు తగ్గడం, కంపెనీల లాభాలపై స్పష్టత లేకపోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోల్లో టెక్ రంగం వాటా నెల వ్యవధిలో 60 బేసిస్ పాయింట్లు, ఏడాది వ్యవధిలో 180 బేసిస్ పాయింట్లు తగ్గింది.
వివరాలు
ఫైనాన్షియల్స్, తయారీ, డిఫెన్స్ రంగాలవైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్న ఇన్వెస్టర్లు
గత ఏడాదిలో నిఫ్టీ ఐటీ సూచీ మార్కెట్‌తో పోలిస్తే వెనుకబడింది. దీంతో భారతీయ ఐటీ కంపెనీలు AI అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఆలస్యం చేస్తున్నాయనే ఆందోళనలు పెరిగాయి. ఫైనాన్షియల్ రేడియన్స్ వ్యవస్థాపకుడు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రాజేష్ మినోచా మాట్లాడుతూ.. గ్లోబల్ ఐటీ ఖర్చులు తగ్గడం, కొత్త డీల్స్ ఆలస్యం కావడం, లాభాల వృద్ధి మందగించడం వల్లే మ్యూచువల్ ఫండ్స్ టెక్ రంగంపై జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఇన్వెస్టర్లు ఫైనాన్షియల్స్, తయారీ, డిఫెన్స్ రంగాలవైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. అరిహంత్ క్యాపిటల్ మార్కెట్స్ రీసెర్చ్ హెడ్ అభిషేక్ జైన్ మాట్లాడుతూ.. అమెరికా, యూరప్ వంటి కీలక మార్కెట్లలో రికవరీపై ఇంకా స్పష్టత లేకపోవడం కూడా ప్రభావం చూపుతోందన్నారు.
వివరాలు
సంప్రదాయ అవుట్‌సోర్సింగ్ వ్యాపార మోడళ్లపై AI ప్రభావం
AI కారణంగా ఐటీ రంగంలో పెద్ద మార్పులు వస్తున్నాయని, దీంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా సంప్రదాయ అవుట్‌సోర్సింగ్ వ్యాపార మోడళ్లపై AI ప్రభావం పడే అవకాశం ఉందని వివరించారు. ఇక ఫైనాన్షియల్స్, క్యాపిటల్ గూడ్స్, డిఫెన్స్ రంగాల్లో సమీప భవిష్యత్తులో మంచి లాభాల అవకాశాలు కనిపించడంతో పెట్టుబడులు అక్కడికి మళ్లాయని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇది టెక్ రంగానికి శాశ్వత సమస్య కాదని, ప్రస్తుతం మార్పుల దశలో ఉందని అభిప్రాయపడుతున్నారు. AI ప్రభావానికి అనుగుణంగా ఐటీ కంపెనీలు తమ వ్యాపారాలను మార్చుకుంటున్నాయని తెలిపారు.
వివరాలు
AI కారణంగా సంప్రదాయ ఐటీ సేవల్లో కొన్ని ఉద్యోగాలపై ప్రభావం
ఇదిలా ఉంటే ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీలు మాత్రం AIపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది 190 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని భావిస్తోంది. ఆల్ఫాబెట్, మెటా సంస్థలు కూడా తమ క్యాపెక్స్ అంచనాలను పెంచాయి. అమెజాన్ మాత్రం 200 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళికను కొనసాగిస్తోంది. AI కారణంగా సంప్రదాయ ఐటీ సేవల్లో కొన్ని ఉద్యోగాలపై ప్రభావం పడొచ్చని నిపుణులు అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా రొటీన్ కోడింగ్, సపోర్ట్ సర్వీసులపై ఆటోమేషన్ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని చెబుతున్నారు. అయినప్పటికీ పెద్ద ఐటీ సంస్థలు ఇప్పటికే AI, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, ఆటోమేషన్ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టి భవిష్యత్తుకు సిద్ధమవుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.