Loading...
Tata Sons: టాటా సన్స్‌కు చంద్రశేఖరన్ గుడ్‌బై..
టాటా సన్స్‌కు చంద్రశేఖరన్ గుడ్‌బై..

Tata Sons: టాటా సన్స్‌కు చంద్రశేఖరన్ గుడ్‌బై..

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 12, 2026
12:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాటా గ్రూప్‌లో కీలక నాయకత్వ మార్పునకు రంగం సిద్ధమైంది. టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్. చంద్రశేఖరన్‌ తన పదవికి రాజీనామా చేశారు. అయితే వెంటనే బాధ్యతల నుంచి తప్పుకోకుండా ప్రస్తుత పదవీకాలం ముగిసే వరకు చైర్మన్‌గా కొనసాగనున్నారు. 2027 ఫిబ్రవరి 20తో ఆయన ప్రస్తుత టర్మ్‌ ముగియనుంది. ఆ తర్వాత మరోసారి చైర్మన్‌గా నియమించుకునేందుకు తాను ప్రయత్నించబోనని చంద్రశేఖరన్‌ స్పష్టం చేశారు. ఆగస్టు 12న ఆయన రాజీనామా సమర్పించినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. చంద్రశేఖరన్‌ గతంలో టాటా సన్స్‌లో తన తదుపరి పదవీకాలంపై కొనసాగిన అనిశ్చితి నేపథ్యంలో సన్నిహితులతో పదవి నుంచి తప్పుకునే అంశంపై చర్చించినట్లు ఆగస్టు 12న ఎకనామిక్‌ టైమ్స్‌ కూడా రిపోర్ట్‌ చేసింది.

వివరాలు 

రీ-అపాయింట్‌మెంట్‌పై అనిశ్చితి

ఆగస్టు 18న టాటా సన్స్‌ వార్షిక సాధారణ సమావేశం జరగాల్సి ఉంది.ఇందులో చంద్రశేఖరన్‌ను బోర్డు డైరెక్టర్‌గా మళ్లీ నియమించే అంశం కీలకంగా మారింది.

ఆయన చైర్మన్‌గా కొనసాగడం కూడా బోర్డులో డైరెక్టర్‌గా కొనసాగడంపైనే ఆధారపడి ఉంది.

చంద్రశేఖరన్‌కు మరోసారి చైర్మన్‌ పదవీకాలం ఇవ్వడంపై టాటా సన్స్‌ బోర్డు ఫిబ్రవరిలో తీసుకోవాల్సిన నిర్ణయం వాయిదా పడింది.

టాటా గ్రూప్‌ ఛారిటీ విభాగమైన టాటా ట్రస్ట్స్‌ చైర్మన్‌ నోయెల్‌ టాటా ఆయన రీ-అపాయింట్‌మెంట్‌ను వ్యతిరేకించినట్లు గతంలో రాయిటర్స్‌ కథనాలు పేర్కొన్నాయి.

టాటా సన్స్‌ అప్పులను మరింత తగ్గించడం, కంపెనీని పబ్లిక్‌గా లిస్ట్‌ చేయకుండా ఉండటం, మైనారిటీ షేర్‌హోల్డర్‌ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌తో ఉన్న సమస్యలను పరిష్కరించడం వంటి అంశాలపై నోయెల్‌ టాటా హామీలు కోరినట్లు సమాచారం.

వివరాలు 

ఆగస్టు 18న ఏం జరగనుంది?

టాటా ట్రస్ట్స్‌తో ఏకాభిప్రాయం కొనసాగించేందుకు తన రీ-అపాయింట్‌మెంట్‌పై నిర్ణయాన్ని వాయిదా వేయాలని చంద్రశేఖరన్‌ సూచించినట్లు బ్లూమ్‌బర్గ్‌ న్యూస్‌ గతంలో నివేదించింది.

టాటా సన్స్‌ వార్షిక సాధారణ సమావేశం నేపథ్యంలో చంద్రశేఖరన్‌ పదవిపై ఉత్కంఠ నెలకొంది.

అయితే సర్‌ రతన్‌ టాటా ట్రస్ట్‌ (SRTT)కు సంబంధించిన పరిణామాలు కూడా ఈ సమావేశంపై ప్రభావం చూపే పరిస్థితి ఏర్పడింది.

మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్‌ SRTT బోర్డు సమావేశాలపై ఆంక్షలు విధించడంతో, ఆగస్టు 18న జరిగే టాటా సన్స్‌ AGMలో ట్రస్ట్‌ తరఫున ఓటింగ్‌ హక్కుల వినియోగంపై ప్రశ్నలు తలెత్తాయి.

ఇదే సమయంలో టాటా ట్రస్ట్స్‌ వైస్‌ చైర్మన్‌ విజయ్‌ సింగ్‌ కూడా సర్‌ రతన్‌ టాటా ట్రస్ట్‌ ట్రస్టీ పదవి నుంచి తప్పుకున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

టాటా గ్రూప్‌ షేర్లపై ప్రభావం

ఆగస్టు 14తో తన ప్రస్తుత పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో మరోసారి తనను పరిగణనలోకి తీసుకోవద్దని ఆయన స్పష్టం చేశారు.

అయితే సర్‌ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌ ట్రస్టీగా మాత్రం ఆయన కొనసాగనున్నారు.

చంద్రశేఖరన్‌ రాజీనామా వార్తలు స్టాక్‌ మార్కెట్‌లోనూ ప్రభావం చూపాయి.

ఆగస్టు 12న టాటా గ్రూప్‌కు చెందిన పలు కంపెనీల షేర్లు నిఫ్టీలో ఎక్కువగా నష్టపోయిన వాటిలో కనిపించాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) షేరు దాదాపు 4 శాతం పడిపోయింది.

ఒక దశలో ఇది 5 శాతం వరకు క్షీణించింది. టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ షేరు 2.55 శాతం, టాటా కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌ షేరు 1.61 శాతం తగ్గాయి.

ADVERTISEMENT

వివరాలు 

చంద్రశేఖరన్‌ ప్రయాణం

చంద్రశేఖరన్‌ 1987లో టాటా గ్రూప్‌లో చేరారు. 2009లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(TCS)సీఈఓగా బాధ్యతలు చేపట్టారు.

అనంతరం 2017లో టాటా సన్స్‌ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.

టాటా గ్రూప్‌ వ్యవస్థాపక కుటుంబానికి చెందకుండా ఇంతటి కీలక స్థానానికి చేరుకున్న తొలి వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు.

దివంగత రతన్‌ టాటానే చంద్రశేఖరన్‌ను టాటా సన్స్‌ చైర్మన్‌గా ఎంపిక చేశారు.చంద్రశేఖరన్‌ను సాధారణంగా 'చంద్ర' అని పిలుస్తారు.

దాదాపు దశాబ్దం పాటు టాటా గ్రూప్‌ నాయకత్వంలో కీలక పాత్ర పోషించిన ఆయన కాలంలో సంస్థ కొత్త రంగాల్లోకి విస్తరించింది.

ప్రస్తుతం టాటా గ్రూప్‌ సెమీకండక్టర్‌ చిప్‌ల తయారీ,ఎలక్ట్రానిక్స్‌, బ్యాటరీలు,డిజిటల్‌ వ్యాపారాలు వంటి భారీ పెట్టుబడులు అవసరమైన రంగాల్లోకి అడుగుపెడుతోంది.

భవిష్యత్‌ వృద్ధికి ఈ ప్రాజెక్టులు కీలకంగా మారనున్నాయి.

వివరాలు 

టాటా గ్రూప్‌కు వరుస సవాళ్లు

గత ఏడాది కాలంలో టాటా గ్రూప్‌ పలు సవాళ్లను ఎదుర్కొంది. ఘోర విమాన ప్రమాదం తర్వాత ఎయిర్‌ ఇండియాపై నియంత్రణ సంస్థల పరిశీలన పెరిగింది.

టీసీఎస్‌ వ్యాపారంలో ధరలపై ఒత్తిడి కనిపించింది. మరోవైపు జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌పై జరిగిన సైబర్‌ దాడి ఉత్పత్తి కార్యకలాపాలకు అంతరాయం కలిగించింది.

ఈ పరిణామం బ్రిటన్‌ ఆర్థిక ఉత్పత్తిపైనా ప్రభావం చూపింది.

వివరాలు 

టాటా సన్స్‌ భవిష్యత్తుపై ఆసక్తి

టాటా ట్రస్ట్స్‌, టాటా సన్స్‌ మధ్య బోర్డు ప్రాతినిధ్యం, సంస్థ వ్యూహాలు, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ నుంచి వైదొలగే ప్రణాళిక వంటి అంశాలపై విభేదాలు కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో చంద్రశేఖరన్‌ పదవి నుంచి తప్పుకోవడం టాటా సన్స్‌ భవిష్యత్‌ నాయకత్వంపై కొత్త ప్రశ్నలను తెరపైకి తెచ్చింది.

ప్రస్తుతానికి చంద్రశేఖరన్‌ 2027 ఫిబ్రవరి 20 వరకు టాటా సన్స్‌ చైర్మన్‌గా కొనసాగనున్నారు.

ఆ తర్వాత టాటా గ్రూప్‌కు ఎవరు నాయకత్వం వహిస్తారన్నది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.

కొత్త నాయకత్వం ఎంపికతో పాటు గ్రూప్‌ భవిష్యత్‌ వ్యూహాలు, భారీ పెట్టుబడులు, కొత్త వ్యాపారాల విస్తరణ, కీలక నిర్ణయాలపై కూడా ప్రభావం ఉండే అవకాశం ఉంది.

ADVERTISEMENT