Loading...
N Chandrasekaran: టాటా సన్స్‌ ఛైర్మన్‌గా చంద్రశేఖరన్‌ కొనసాగింపు.. మరో ఐదేళ్లకు బోర్డు ఆమోదం
టాటా సన్స్‌ ఛైర్మన్‌గా చంద్రశేఖరన్‌ కొనసాగింపు.. మరో ఐదేళ్లకు బోర్డు ఆమోదం

N Chandrasekaran: టాటా సన్స్‌ ఛైర్మన్‌గా చంద్రశేఖరన్‌ కొనసాగింపు.. మరో ఐదేళ్లకు బోర్డు ఆమోదం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 17, 2026
05:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాటా గ్రూప్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టాటా సన్స్‌ ఛైర్మన్‌గా ఎన్‌. చంద్రశేఖరన్‌ మరో ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు. ఆయనను మూడోసారి ఛైర్మన్‌గా నియమించేందుకు టాటా సన్స్‌ బోర్డు ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ నిర్ణయంపై టాటా సన్స్‌ లేదా టాటా ట్రస్ట్స్‌ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. తనను మరోసారి ఛైర్మన్‌గా నియమించుకోవాలనే ఉద్దేశం లేదని చంద్రశేఖరన్‌ బోర్డు డైరెక్టర్లకు స్పష్టం చేసిన కొద్ది వారాలకే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. వాస్తవానికి ఆయన ప్రస్తుత పదవీకాలం 2027 ఫిబ్రవరి 20తో ముగియనుంది. ఇదే సమయంలో టాటా సన్స్‌ను స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ చేసే ప్రక్రియకు కూడా బోర్డు ఆమోదం తెలిపినట్లు సమాచారం.

వివరాలు 

లిస్టింగ్‌ నేపథ్యంలో నాయకత్వ మార్పు వద్దన్న బోర్డు

అప్పర్‌లేయర్‌ ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్స్‌ను సరెండర్‌ చేసేందుకు టాటా సన్స్‌ చేసిన దరఖాస్తును ఆర్‌బీఐ ఇటీవల తిరస్కరించిన విషయం తెలిసిందే.

దీంతో టాటా సన్స్‌ స్టాక్‌ మార్కెట్‌లో లిస్టింగ్‌ చేయడం తప్పనిసరి కానుంది.

ఈ నేపథ్యంలో సంస్థ నాయకత్వంలో మార్పు చేయడం సరైన నిర్ణయం కాదని బోర్డు సభ్యులు అభిప్రాయపడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

చంద్రశేఖరన్‌ కొనసాగితే పెట్టుబడిదారుల్లో స్థిరత్వంపై నమ్మకం ఏర్పడుతుందని బోర్డు భావించినట్లు సమాచారం.

దీంతో తన నిర్ణయంపై మరోసారి ఆలోచించాలని నామినేషన్‌ అండ్‌ రెమ్యునరేషన్‌ కమిటీ ఆయనను కోరింది.

బోర్డు చేసిన అభ్యర్థనను చంద్రశేఖరన్‌ అంగీకరించినట్లు తెలుస్తోంది. తాజా నిర్ణయంతో టాటా సన్స్‌ తదుపరి ఛైర్మన్‌ ఎంపిక ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోనుంది.

వివరాలు 

టాటా ట్రస్ట్స్‌ నుంచి వ్యతిరేకత

మరోవైపు, బోర్డు సమావేశంలో టాటా ట్రస్ట్స్‌ ఛైర్మన్‌ నోయెల్‌ టాటా.. చంద్రశేఖరన్‌ పునర్నియామకం, టాటా సన్స్‌ లిస్టింగ్‌ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఓటు వేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

అయితే, మెజారిటీ బోర్డు సభ్యులు పునర్నియామకానికి మద్దతు ఇవ్వడంతో తీర్మానం ఆమోదం పొందినట్లు సమాచారం.

టాటా సన్స్‌ లిస్టింగ్‌ను నోయెల్‌ టాటా మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

చంద్రశేఖరన్‌ పునర్నియామకానికి సంబంధించి ఆయన గతంలో కొన్ని షరతులు విధించిన విషయం కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది.

ADVERTISEMENT

వివరాలు 

టాటా ట్రస్ట్స్‌ నుంచి వ్యతిరేకత

ఛైర్మన్‌ నియామకం, లిస్టింగ్‌ నిర్ణయాలు చట్ట విరుద్ధమని టాటా ట్రస్ట్స్‌ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఆర్టికల్స్‌ ఆఫ్‌ అసోసియేషన్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారమే సెలక్షన్‌ కమిటీ ప్రక్రియ జరగాలని, ప్రస్తుత నియామకం చెల్లదని ట్రస్ట్స్‌ వాదిస్తున్నట్లు తెలుస్తోంది.

లిస్టింగ్‌ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఓటు వేయాలని సర్‌ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌ కోరినప్పటికీ.. నామినీ డైరెక్టర్‌ వేణు శ్రీనివాసన్‌ అందుకు నిరాకరించినట్లు సమాచారం.

అయితే, చంద్రశేఖరన్‌ పునర్నియామకం, టాటా సన్స్‌ లిస్టింగ్‌ నిర్ణయాలు అమల్లోకి రావాలంటే సంస్థ వార్షిక సాధారణ సమావేశంలో (AGM) వాటాదారుల ఆమోదం పొందాల్సి ఉంటుంది.

ADVERTISEMENT

వివరాలు 

టాటా గ్రూప్‌ షేర్లకు ఊతం

చంద్రశేఖరన్‌ను టాటా సన్స్‌ ఛైర్మన్‌గా మరోసారి నియమించేందుకు బోర్డు ఆమోదం తెలిపిన వార్తలతో టాటా గ్రూప్‌కు చెందిన పలు కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి.

బీఎస్‌ఈలో టాటా కెమికల్స్‌ షేరు ఇంట్రాడేలో 14 శాతం వరకు పెరిగింది.

టాటా సన్స్‌ ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్స్‌ సరెండర్‌ దరఖాస్తును ఆర్‌బీఐ తిరస్కరించిన తర్వాత ఈ షేరు దాదాపు 36 శాతం లాభపడటం గమనార్హం.

అదేవిధంగా టాటా ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌ షేరు 6 శాతం, టీసీఎస్‌ షేరు 3 శాతం మేర రాణించాయి.

టాటా మోటార్స్‌, టాటా ఎలెక్సీ, టాటా టెక్నాలజీస్‌, టాటా స్టీల్‌ షేర్లు కూడా లాభాలను నమోదు చేశాయి.

ADVERTISEMENT