Air India Express: క్రిస్మస్ రోజున ప్రారంభమైన నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం
ఈ వార్తాకథనం ఏంటి
నవీ ముంబైలో తాజాగా నిర్మించిన నవి ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (NMIA) క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఇవాళ అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ కొత్త విమానాశ్రయం నుంచి సేవలు మొదలుపెట్టిన తొలి సంస్థలలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఒకటిగా నిలిచింది. ఈ సంస్థ నవీ ముంబై నుంచి బెంగళూరు, ఢిల్లీ నగరాలకు నేరుగా విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. నవీ ముంబై ఎయిర్‌పోర్ట్ నుంచి తొలిసారిగా బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం విజయవంతంగా బెంగళూరుకు చేరుకుంది. అనంతరం ఢిల్లీకి వెళ్లే మరో విమానం మధ్యాహ్నం 2:05 గంటలకు నవీ ముంబై నుంచి బయలుదేరి, సాయంత్రం 4:20 గంటలకు దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంటుందని సంస్థ వెల్లడించింది.
వివరాలు
మొదట 12 గంటల పాటు పనిచేయనున్న విమానాశ్రయం
ఈ సందర్భంగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ మేనేజింగ్ డైరెక్టర్ ఆలోక్ సింగ్ మాట్లాడుతూ, నవీ ముంబై నుంచి విమాన సేవలు ప్రారంభించడం తమ సంస్థకు ఒక ముఖ్యమైన ఘట్టమని చెప్పారు. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతానికి మరింత మెరుగైన కనెక్టివిటీ అందించడంలో భాగస్వాములుగా ఉండటం ఆనందంగా ఉందని తెలిపారు. తమ డ్యూయల్ ఎయిర్‌పోర్ట్ వ్యూహంలో నవీ ముంబై విమానాశ్రయం కీలక పాత్ర పోషిస్తుందని, రాబోయే రోజుల్లో సేవలను మరింత విస్తరిస్తామని ఆయన స్పష్టం చేశారు. భారత్‌లో ఇటీవల నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల్లో నవి ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రారంభ నెలలో ఈ విమానాశ్రయం రోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే పనిచేయనుంది.
వివరాలు
పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం
ఈ 12 గంటల వ్యవధిలో రోజుకు మొత్తం 23 విమానాల రాకపోకలు నిర్వహించనున్నారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌తో పాటు ఇండిగో, ఆకాశ ఎయిర్ సంస్థలు కూడా దేశంలోని 16 ముఖ్య నగరాలకు ఇక్కడి నుంచి విమాన సేవలు అందించనున్నాయి. ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, 2026 ఫిబ్రవరి నుంచి ఈ విమానాశ్రయాన్ని 24 గంటల పాటు పూర్తిస్థాయిలో కార్యకలాపాలకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. అదానీ ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (74 శాతం వాటా),మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సిడ్కో (26 శాతం వాటా) కలిసి పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో ఈ నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించారు.