Loading...
Indian Currency: రూ.200, రూ.500 నోట్లకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిన‌ నేపాల్
రూ.200, రూ.500 నోట్లకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిన‌ నేపాల్

Indian Currency: రూ.200, రూ.500 నోట్లకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిన‌ నేపాల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 26, 2026
05:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత కరెన్సీ వినియోగంపై నేపాల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు తమ దేశంలో కేవలం రూ.100 భారత నోట్లకే అనుమతి ఉన్న నేపథ్యంలో ఇకపై రూ.200, రూ.500 నోట్లను కూడా వినియోగించుకోవచ్చని నేపాల్‌ ప్రకటించింది. ఈ విషయాన్ని నేపాల్‌ రాష్ట్ర బ్యాంక్‌ ప్రతినిధి గురు ప్రసాద్‌ పౌడెల్‌ వెల్లడించారు. భారత్‌లో 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత నేపాల్‌ కేవలం రూ.100 నోట్లను మాత్రమే అనుమతిస్తూ వచ్చింది. అయితే తాజా నిర్ణయంతో 2016 నవంబర్‌ 9 లేదా ఆ తర్వాత జారీ చేసిన రూ.200, రూ.500 భారత కరెన్సీ నోట్లను కూడా నేపాల్‌లో చెల్లుబాటు అయ్యేలా అనుమతించింది.

వివరాలు 

రూ.25 వేల వరకు మాత్రమే అనుమతి

కొత్త నిబంధనల ప్రకారం రూ.100 లోపు విలువైన నోట్లతో పాటు రూ.200, రూ.500 నోట్లను నేపాల్‌లోకి తీసుకెళ్లడం, అక్కడి నుంచి బయటకు తీసుకురావడం సాధ్యమవుతుంది.

అయితే గరిష్ఠంగా రూ.25 వేల వరకు మాత్రమే భారత కరెన్సీని కలిగి ఉండేందుకు అనుమతి ఉంటుంది.

ఈ నిర్ణయంతో భారత్‌-నేపాల్‌ సరిహద్దు ప్రాంతాల్లో నగదు లావాదేవీలు మరింత సులభతరం కానున్నాయి. ముఖ్యంగా నేపాలీ పౌరులు, భారత పర్యాటకులకు ఇది గణనీయమైన ఊరటనివ్వనుంది.

అయితే ఇతర దేశాల నుంచి తీసుకొచ్చే భారత కరెన్సీకి ఈ అనుమతి వర్తించదని నేపాల్‌ స్పష్టం చేసింది.

భారత్‌ నుంచి నేరుగా తీసుకెళ్లే కరెన్సీకే తాజా నిబంధనలు వర్తిస్తాయని అధికారులు వెల్లడించారు.

ADVERTISEMENT