CBDT: పన్నుల వసూళ్లలో భారీ వృద్ధి.. రూ.12.12 లక్షల కోట్లకు చేరిన నికర ఆదాయం
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష పన్నుల రూపంలో వచ్చే ఆదాయం గణనీయంగా పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 17 వరకు నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 13శాతం వృద్ధి చెంది రూ.12.12లక్షల కోట్లకు చేరాయి. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ)శుక్రవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లలోనూ పెరుగుదల సెప్టెంబర్ 17 వరకు స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 15శాతానికి పైగా పెరిగి రూ.14.3లక్షల కోట్లకు చేరాయి. ఇందులో కార్పొరేట్ పన్ను వసూళ్లు 19.48శాతం వృద్ధితో సుమారు రూ.5.56లక్షల కోట్లుగా నమోదయ్యాయి. వ్యక్తిగత ఆదాయ పన్ను,హిందూ అవిభక్త కుటుంబాల (హెచ్‌యూఎఫ్)నుంచి వచ్చిన వసూళ్లు 6శాతం పెరిగి రూ.6.16లక్షల కోట్లకు పైగా చేరాయి.
వివరాలు
ఎస్‌టీటీ వసూళ్లలో 53 శాతం పెరుగుదల
సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్‌టీటీ) వసూళ్లు కూడా గణనీయంగా పెరిగాయి.
గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈసారి 53 శాతం వృద్ధి నమోదై, రూ.40,214 కోట్లకు చేరాయి.
మరోవైపు పన్ను రిఫండ్ల జారీ 29 శాతానికి పైగా పెరిగి రూ.2.2 లక్షల కోట్లను దాటింది.
అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లూ పైపైకి
సెప్టెంబర్ 17 వరకు అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు 16.18 శాతం పెరిగి రూ.5.22 లక్షల కోట్లకు చేరాయి.
ఇందులో కార్పొరేట్ అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు 18 శాతం వృద్ధితో రూ.4.16 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
నాన్-కార్పొరేట్ అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు 9.24 శాతం పెరిగి రూ.1.06 లక్షల కోట్లకు చేరాయి.
వివరాలు
ఏప్రిల్-జూలైలో ద్రవ్యలోటు రూ.4.55 లక్షల కోట్లు
మరోవైపు, ఏప్రిల్ నుంచి జూలై వరకు నాలుగు నెలల్లో కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు రూ.4.55 లక్షల కోట్లుగా నమోదైంది.
ఇది పూర్తి ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన ద్రవ్యలోటు లక్ష్యంలో 26.8 శాతానికి సమానం.
గత ఏడాది ఇదే కాలంలో ద్రవ్యలోటు రూ.4.7 లక్షల కోట్లుగా ఉండగా.. ఈసారి కొంత తగ్గింది.
2026-27 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 4.3 శాతానికి పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.