PAN Card: ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డు కొత్త నిబంధనలు.. లావాదేవీలపై మారిన లిమిట్స్
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో పాన్ కార్డు, ఆధార్ కార్డుతో పాటు అత్యంత కీలకమైన గుర్తింపు పత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల సమయంలో పాన్ కార్డు అవసరం కీలకంగా ఉంటుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ పాన్‌కు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేసింది. ముఖ్యంగా ట్రాన్సాక్షన్ లిమిట్స్‌ను సవరించింది. కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుండగా, దీనికి అనుగుణంగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు కొత్త పన్ను నిబంధనలను నోటిఫై చేసింది. ఈ మార్పుల్లో భాగంగా పాన్ కార్డు అవసరమయ్యే లావాదేవీ పరిమితులను కూడా సవరించింది. కొత్త లిమిట్స్ ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి రానున్నాయి.
Details
బ్యాంక్ లావాదేవీలు
ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి అకౌంట్‌లో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని ఒకేసారి లేదా విడతల వారీగా డిపాజిట్ చేసినా, విత్‌డ్రా చేసుకున్నా పాన్ కార్డు వివరాలు తప్పనిసరిగా సమర్పించాలి. ఇది ఒకే బ్యాంక్ లేదా వేర్వేరు బ్యాంక్ అకౌంట్లకు వర్తిస్తుంది. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం రోజుకు రూ.50 వేలకుపైగా లావాదేవీలకు మాత్రమే పాన్ అవసరం ఉంటుంది. ప్రాపర్టీ లావాదేవీలు ఇళ్లు లేదా ప్లాట్ల కొనుగోలు, విక్రయాలకు సంబంధించి ట్రాన్సాక్షన్ విలువ రూ.20 లక్షలు దాటితే ఇకపై పాన్ కార్డు తప్పనిసరి. ప్రస్తుతం ఈ పరిమితి రూ.10 లక్షలుగా ఉంది.
Details
వాహనాల కొనుగోలు
టూ వీలర్స్ సహా ఏ మోటార్ వాహనం కొనుగోలు చేసినా, దాని విలువ రూ.5 లక్షలు దాటితే కొనుగోలుదారు పాన్ కార్డు వివరాలు సమర్పించాలి. పాత నిబంధనల ప్రకారం ద్విచక్ర వాహనాలకు ఈ రూల్ వర్తించలేదు. కార్లు, ఇతర వాహనాలకు మాత్రం ధరతో సంబంధం లేకుండా పాన్ అవసరం ఉండేది. ఇప్పుడు కేంద్రం కొత్త పరిమితిని తీసుకువచ్చింది.
Details
హోటల్స్, ఈవెంట్ ఖర్చులు
హోటల్స్, కన్వెన్షన్ సెంటర్స్, రెస్టారెంట్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలకు చేసే చెల్లింపుల్లో రూ.1 లక్ష దాటితే పాన్ కార్డు వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పరిమితి రూ.50 వేలుగా ఉండగా, దీనిని రెట్టింపు చేశారు. ఇన్సూరెన్స్ పాలసీలు ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలుకు సంబంధించిన నిబంధనల్లో కూడా మార్పులు చేశారు. ప్రస్తుతం వార్షిక ప్రీమియం రూ.50 వేలకుపైగా ఉంటే మాత్రమే పాన్ అవసరం ఉండగా, ఇకపై ప్రతి పాలసీకి పాన్ వివరాలు సమర్పించడం తప్పనిసరి.