silver : వెండి దిగుమతులపై కేంద్రం కొత్త ఆంక్షలు.. ఇకపై ప్రభుత్వ అనుమతి తప్పనిసరి
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం విలువైన లోహాల దిగుమతులపై కొత్త ఆంక్షలు విధించింది. ముఖ్యంగా వెండి దిగుమతులపై కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. అలాగే జ్యువెలరీ ఎగుమతిదారులకు ఇచ్చే సుంక రహిత బంగారం దిగుమతుల నిబంధనలను కూడా మరింత కఠినతరం చేసింది. దేశంలో పెరుగుతున్న దిగుమతి బిల్లు, వాణిజ్య లోటును నియంత్రించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశ్యంగా ప్రభుత్వం తెలిపింది. తాజా ఆదేశాల ప్రకారం వెండి, అన్‌వ్రాట్ వెండి (unwrought silver), సెమీ-మాన్యుఫ్యాక్చర్డ్ వెండి ఉత్పత్తులు, వెండి పొడి వంటి అనేక వర్గాల దిగుమతులు ఇకపై 'ఫ్రీ' కేటగిరీ నుంచి 'రిస్ట్రిక్టెడ్' కేటగిరీకి మార్చారు. దీంతో ఈ వస్తువుల దిగుమతులకు ఇకపై ప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరిగా ఉండనుంది.
వివరాలు
దిగుమతులపై ఆర్బీఐ నిబంధనలు
కొన్ని వెండి దిగుమతులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనలు కూడా వర్తించనున్నాయి. ఈ మార్పులు ITC (HS) క్లాసిఫికేషన్‌లోని దిగుమతి విధాన సవరణల ద్వారా అమల్లోకొచ్చాయి. ఇటీవల కాలంలో బంగారం, వెండి దిగుమతులపై ప్రభుత్వం ఇప్పటికే దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. అదే సమయంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT), జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎగుమతిదారులకు ఇచ్చే అడ్వాన్స్ ఆథరైజేషన్ (AA) పథకం కింద సుంక రహిత బంగారం దిగుమతుల నిబంధనలను కూడా కఠినతరం చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, ఒక్కో లైసెన్స్ కింద బంగారం దిగుమతికి 100 కిలోల పరిమితి విధించారు.
వివరాలు
నెలవారి సమగ్ర నివేదకలు సమర్పించాలి
మొదటిసారి దరఖాస్తు చేసే సంస్థల ఫ్యాక్టరీలను ముందుగా ప్రత్యక్షంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతులు ఇవ్వనున్నారు. అలాగే పునరావృత దరఖాస్తుదారులపై కూడా మరింత కఠినమైన పరిశీలన ఉండనుంది. ముందటి లైసెన్స్‌ల కింద కనీసం 50 శాతం ఎగుమతి బాధ్యత పూర్తయిన తర్వాతే కొత్త అనుమతులు జారీ చేయనున్నట్లు DGFT తెలిపింది. అంతేకాకుండా బంగారం దిగుమతి చేసే ఎగుమతిదారులు (fortnightly) సర్టిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్ ధృవీకరణతో నివేదికలు సమర్పించాలి. ఈ నివేదికల్లో దిగుమతి, ఎగుమతి వివరాలు స్పష్టంగా ఉండాలి. ప్రాంతీయ కార్యాలయాలు నెలవారీ సమగ్ర నివేదికలను DGFT కేంద్ర కార్యాలయానికి పంపాలి.
వివరాలు
బంగారం, వెండి మార్కెట్‌పై ప్రభావం పడే అవకాశం
ఇటీవలి గణాంకాల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో బంగారం దిగుమతులు 24 శాతానికి పైగా పెరిగి రికార్డు స్థాయిలో 71.98 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతి పరిమాణం తగ్గినా విలువ మాత్రం పెరగడం గమనార్హం. స్విట్జర్లాండ్ బంగారం దిగుమతులలో ప్రధాన సరఫరాదారుగా ఉండగా, తరువాత యూఏఈ, దక్షిణాఫ్రికా నిలిచాయి. ఈ కొత్త నియంత్రణల వల్ల బంగారం, వెండి మార్కెట్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా అధిక సుంకాలు, కఠిన నియమాలు అక్రమ వ్యాపారం మరియు స్మగ్లింగ్‌ను పెంచే ప్రమాదం ఉందని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెలరీ కౌన్సిల్ హెచ్చరించింది.