Page Loader
Stock Market: వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసిన సూచీలు.. సెన్సెక్స్‌ 318 పాయింట్లు, నిఫ్టీ 98 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి 
వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసిన సూచీలు.. సెన్సెక్స్‌ 318 పాయింట్లు, నిఫ్టీ 98 పాయింట్లు

Stock Market: వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసిన సూచీలు.. సెన్సెక్స్‌ 318 పాయింట్లు, నిఫ్టీ 98 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 16, 2025
04:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో సానుకూల సంకేతాల నేపథ్యంలో ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే ధోరణిలో కొనసాగాయి. ముఖ్యంగా పవర్, మెటల్ రంగాల్లో కొనుగోళ్ల జోరుతో సూచీలు బలపడాయి. చివరికి సెన్సెక్స్ 319 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 23,300 ఎగువన ముగిసింది. ఉదయం సెన్సెక్స్ 77,319.50 వద్ద లాభాల్లో ప్రారంభమై, ఇంట్రాడేలో అదే స్థాయిలో కదలాడుతూ గరిష్ఠంగా 77,319.50ను తాకింది. చివరికి 318 పాయింట్ల లాభంతో 77,042.82 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 23,391.65 గరిష్ఠాన్ని చేరుకుని, 98.60 పాయింట్ల లాభంతో 23,311.80 వద్ద స్థిరపడింది.

వివరాలు 

రిలయన్స్‌, ఇన్ఫీ ఫలితాలపై ఫోకస్‌

ఈరోజు రిలయన్స్, ఇన్ఫోసిస్ సంస్థల త్రైమాసిక ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో, మార్కెట్ ముగిసే సమయానికి రిలయన్స్ షేర్లు 1.82 శాతం పెరిగి, ఇన్ఫోసిస్ షేర్లు 1.52 శాతం పడిపోయాయి. సెన్సెక్స్ 30 సూచీల్లో అదానీ పోర్ట్స్, ఎస్‌బీఐ, బాజాజ్ ఫిన్‌సర్వ్, భారతీ ఎయిర్‌ టెల్, టాటా మోటార్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, మారుతీ సుజుకీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభపడగా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్, హెచ్‌యూఎల్, ఐటీసీ, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 81.86 డాలర్ల వద్ద ఉండగా, బంగారం ఔన్సు 2,735.40 డాలర్ల వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.56 వద్ద నిలిచింది.