Loading...
US Allegations: ఏ రంగంలోనూ అదనపు ఉత్పత్తి లేదు.. అమెరికా ఆరోపణలను ఖండించిన భారత్
ఏ రంగంలోనూ అదనపు ఉత్పత్తి లేదు.. అమెరికా ఆరోపణలను ఖండించిన భారత్

US Allegations: ఏ రంగంలోనూ అదనపు ఉత్పత్తి లేదు.. అమెరికా ఆరోపణలను ఖండించిన భారత్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2026
08:45 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా చేసిన పారిశ్రామిక ఉత్పత్తి సామర్థ్యానికి సంబంధించిన ఆరోపణలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. దేశంలో ఏ పారిశ్రామిక రంగంలోనూ అదనపు ఉత్పత్తి సామర్థ్యం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత్‌ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా ఇటీవల 25 శాతం సుంకం విధించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరితే ఈ సుంకాన్ని 17 శాతానికి తగ్గించే అవకాశం ఉందని అమెరికా వాణిజ్య ప్రతినిధి (యూఎస్‌టీఆర్‌) కార్యాలయం వెల్లడించింది. పలు దేశాల పారిశ్రామిక, వాణిజ్య విధానాలపై సెక్షన్‌ 301 కింద చేపట్టిన విచారణ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

వివరాలు 

ఈ కారణంగానే భారత్‌ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అదనపు సుంకాలు

యూఎస్‌టీఆర్‌ కార్యాలయం ప్రకారం.. భారత్‌లో అవసరానికి మించి పారిశ్రామిక ఉత్పత్తులు తయారవుతున్నాయి.

ఈ అదనపు ఉత్పత్తి సామర్థ్యం కారణంగా తక్కువ ధరకు పెద్ద మొత్తంలో వస్తువులు అమెరికా మార్కెట్‌లోకి వస్తున్నాయని ఆరోపించింది.

దీంతో తమ దేశంలోని పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతున్నాయని పేర్కొంది.

ఈ కారణంగానే భారత్‌ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అదనపు సుంకాలు విధించినట్లు వివరించింది.

అమెరికా నుంచి ఈ వ్యవహారానికి సంబంధించి నోటీసులు అందాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

వాటిని పరిశీలిస్తున్నామని తెలిపింది. అయితే, అమెరికా పరిశ్రమలకు నష్టం కలిగించే స్థాయిలో భారత్‌లో అదనపు పారిశ్రామిక ఉత్పత్తి సామర్థ్యం ఉందన్న వాదనను అంగీకరించబోమని స్పష్టం చేసింది.

వివరాలు 

సెక్షన్‌ 301 కింద అమెరికా చేపట్టిన విచారణకు భారత్‌ సహకారం 

దేశీయ అవసరాలకు మించి వస్తువులను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని సాధారణంగా అదనపు పారిశ్రామిక సామర్థ్యంగా పరిగణిస్తారని నిపుణులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా.. సెక్షన్‌ 301 కింద అమెరికా చేపట్టిన విచారణకు భారత్‌ పూర్తిస్థాయిలో సహకరించిందని కేంద్రం తెలిపింది.

ఈ అంశాలపై విడిగా నిర్ణయాలు తీసుకోవడం కంటే, ఇరు దేశాల మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక వాణిజ్య చర్చల్లో భాగంగా సంప్రదింపులు జరపాలని మరోసారి స్పష్టం చేసింది.

వాణిజ్య సంబంధిత సమస్యల పరిష్కారానికి అమెరికాతో కలిసి పనిచేసేందుకు భారత్‌ కట్టుబడి ఉందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

ADVERTISEMENT