Loading...
Tata Trusts: టాటా ట్రస్ట్స్‌లో ముదురుతున్న వివాదం.. కోర్టులో కెవియట్ వేసిన నోయెల్
టాటా ట్రస్ట్స్‌లో ముదురుతున్న వివాదం.. కోర్టులో కెవియట్ వేసిన నోయెల్

Tata Trusts: టాటా ట్రస్ట్స్‌లో ముదురుతున్న వివాదం.. కోర్టులో కెవియట్ వేసిన నోయెల్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 14, 2026
11:55 am

ఈ వార్తాకథనం ఏంటి

టాటా ట్రస్ట్స్, టాటా సన్స్ మధ్య నాయకత్వం, పాలనకు సంబంధించిన వివాదం మరింత తీవ్రమవుతోంది. ఈ క్రమంలో సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ (SDTT)లోని కొందరు ట్రస్టీలపై నోయెల్ టాటా, ఆయన కుమారుడు నెవిల్లె టాటా ముంబయి సిటీ సివిల్ కోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో వేణు శ్రీనివాసన్,విజయ్ సింగ్,డారియస్ ఖంబటా,భాస్కర్ భట్ పేర్లు ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ పదవీకాలం పొడిగింపుపై బోర్డు స్థాయిలో చర్చలు జరుగుతున్న సమయంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. తమ వాదన వినకుండా,తమకు వ్యతిరేకంగా కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకుండా ఉండేందుకు నోయెల్ టాటా ఈ కేవియట్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.

వివరాలు 

అసలు వివాదం ఏమిటి?

టాటా ట్రస్ట్స్ ఛైర్మన్‌గా నోయెల్ టాటా నియామకం, ఆయన శాశ్వత ట్రస్టీగా కొనసాగడంపై ట్రస్టీల మధ్య విభేదాలు నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, ట్రస్టీ వేణు శ్రీనివాసన్ ఇటీవల మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

టాటా సన్స్‌కు సంబంధించిన నామినీలు, ప్రతినిధుల నియామకం వంటి అంశాలపై సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ తీసుకునే నిర్ణయాల్లో నోయెల్ టాటా పాల్గొనకుండా,ఓటు వేయకుండా ఆంక్షలు విధించాలని ఆయన కోరారు.

టాటా ట్రస్ట్స్, దాని నిర్వహణ బృందం, ఛైర్మన్ నోయెల్ టాటా.. టాటా సన్స్ వాణిజ్య వ్యవహారాల్లో, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ ఈక్విటీ వాటా నగదుగా మార్చుకునే అంశానికి సంబంధించిన చర్చల్లో నేరుగా జోక్యం చేసుకుంటున్నారని వేణు శ్రీనివాసన్ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.

వివరాలు 

అసలు వివాదం ఏమిటి?

ఇలాంటి చర్యలు ట్రస్ట్ ఏర్పాటు వెనుక ఉన్న ప్రాథమిక లక్ష్యాలకు విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు.

నమోదిత లాభాపేక్ష రహిత సంస్థలు (ఎన్‌పీఓలు) నేరుగా వాణిజ్య లావాదేవీల్లో పాల్గొనడం ఆదాయపు పన్ను నిబంధనల ఉల్లంఘనకు దారితీయవచ్చని పేర్కొన్నారు.

ఈ విధమైన పరిణామాలు చోటుచేసుకుంటే ట్రస్ట్‌కు భారీ ఆర్థిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఫిర్యాదులో ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT

వివరాలు 

నోయెల్ టాటా ఎందుకు కేవియట్ వేశారు?

టాటా కుటుంబ ఆధ్వర్యంలోని ట్రస్ట్‌లు నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నాయా లేదా అనే అంశాన్ని మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ పర్యవేక్షిస్తుంటారు.

వేణు శ్రీనివాసన్ చేసిన ఫిర్యాదు నేపథ్యంలో నోయెల్ టాటా అక్టోబర్ 19లోగా తన వివరణ ఇవ్వాల్సి ఉంది.

ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయన, ఆయన కుమారుడు నెవిల్లె టాటా కోర్టును ఆశ్రయించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

కేవియట్ పిటిషన్ ద్వారా తమ వాదనలు వినకుండా తమకు వ్యతిరేకంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకుండా చూడాలని వారు కోరినట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT

వివరాలు 

టాటా గ్రూప్‌లో ట్రస్టుల ప్రాధాన్యం ఎంత?

ప్రస్తుతం నోయెల్ టాటా టాటా ట్రస్ట్స్ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్‌లో టాటా ట్రస్ట్స్‌కు 66 శాతం వాటా ఉంది.

టాటా ట్రస్ట్స్ పరిధిలో మొత్తం 15 దాతృత్వ సంస్థలు ఉండగా, వాటిలో సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్ కీలకమైనవి. టాటా సన్స్‌లో ఈ రెండు ట్రస్టులకు కలిపి 51.54 శాతం వాటా ఉంది.

ఈ కారణంగా టాటా ట్రస్ట్స్‌లోని ట్రస్టీల అభిప్రాయాలు, నిర్ణయాలు టాటా సన్స్ పాలన, నాయకత్వం, సంస్థాగత విధానాలపై గణనీయమైన ప్రభావం చూపుతుంటాయి.

అందుకే ట్రస్టీల మధ్య నెలకొన్న విభేదాలు టాటా గ్రూప్‌లో కీలక చర్చకు దారితీస్తున్నాయి.

ADVERTISEMENT