Loading...
UPI AutoPay: యూపీఐ ఆటో-పేలో కొత్త విధానం.. పాత మండేట్లను మరో యాప్‌కు మార్చుకోవచ్చు
యూపీఐ ఆటో-పేలో కొత్త విధానం.. పాత మండేట్లను మరో యాప్‌కు మార్చుకోవచ్చు

UPI AutoPay: యూపీఐ ఆటో-పేలో కొత్త విధానం.. పాత మండేట్లను మరో యాప్‌కు మార్చుకోవచ్చు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 31, 2026
05:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

యూపీఐ ఆటో-పే సేవల్లో కీలక మార్పు రాబోతోంది. ఇప్పటికే ఉన్నAutoPay మండేట్లను ఒక UPI యాప్‌ నుంచి మరో యాప్‌కు మార్చుకునే అవకాశం కల్పించేందుకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(NPCI)సిద్ధమవుతోంది. అదే సమయంలో వ్యాపారులు తమ పాత మండేట్లను ఒక పేమెంట్‌ గేట్‌వే నుంచి మరో గేట్‌వేకు మార్చుకునే అవకాశం కూడా రానుంది. ఈ పరిణామంపై అవగాహన ఉన్న నలుగురు వ్యక్తులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మార్పుతో రికరింగ్‌ పేమెంట్స్‌ మార్కెట్‌లో వినియోగదారులు,వ్యాపారులు ఎదుర్కొంటున్న రెండు రకాల ఆధారపడే పరిస్థితులు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ఒక UPIయాప్‌లో AutoPay ఏర్పాటు చేసిన వినియోగదారుడు మరో యాప్‌కు మారాలంటే పాత మండేట్‌ను రద్దు చేసి కొత్తదాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

వివరాలు 

ఇది దేనికి ఉపయోగపడనుంది

ఇకపై అలా చేయాల్సిన అవసరం లేకుండా ఇప్పటికే ఉన్న AutoPay మండేట్లను మరో UPI యాప్‌కు మార్చుకునే అవకాశం ఉంటుంది.

సబ్‌స్క్రిప్షన్లు, బీమా ప్రీమియాలు, సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్లు (SIPలు), రుణ వాయిదాలకు ఇది ఉపయోగపడనుంది.

అంతేకాకుండా వివిధ UPI యాప్‌లలో ఉన్న AutoPay మండేట్లను ఒకేచోట చూసుకునే అవకాశం రావడం వల్ల రానున్న చెల్లింపులు, బ్యాంకు ఖాతాలోని నిల్వ, గతంలో మర్చిపోయిన సబ్‌స్క్రిప్షన్లను సులభంగా గుర్తించవచ్చు.

ఈ రెండు మార్పులను వచ్చే నెల ముంబయిలో జరగనున్న గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌లో ప్రకటించే అవకాశం ఉందని సంబంధిత వ్యక్తుల్లో ఒకరు తెలిపారు.

వివరాలు 

బ్యాంకు ఖాతాల విషయంలో మార్పు ఉండదు.

బ్యాంకు ఖాతాల విషయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు.

ఒక మండేట్‌ను ఏర్పాటు చేసేటప్పుడు వినియోగదారు ఏ బ్యాంకు ఖాతాకు అనుమతి ఇచ్చారో.. భవిష్యత్తులో డబ్బు అదే ఖాతా నుంచే డెబిట్‌ అవుతుంది.

కొత్త విధానంలో మారేది మండేట్‌ను ఏ UPI యాప్‌లో చూసుకోవచ్చు, ఏ పేమెంట్‌ గేట్‌వే ద్వారా అమలు చేయవచ్చన్న అంశమే.

కొత్తగా నమోదు చేసుకోవాల్సిన అవసరం లేకుండానే వ్యాపారులు తమ పాత మండేట్లను కొత్త అక్వైరింగ్‌ బ్యాంకు లేదా పేమెంట్‌ గేట్‌వేకు మార్చుకోవచ్చు.

ADVERTISEMENT

వివరాలు 

2020లో ప్రారంభమైన AutoPay

సబ్‌స్క్రిప్షన్లు, రుణ చెల్లింపులు, బీమా ప్రీమియాలు, మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులకు నిర్ణీత వ్యవధుల్లో వినియోగదారుల బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా డబ్బు డెబిట్‌ చేసేందుకు NPCI 2020లో UPI AutoPayను ప్రారంభించింది.

కొంతకాలంగా వ్యాపారులు తమ మండేట్లను ఒక అక్వైరింగ్‌ భాగస్వామి నుంచి మరో భాగస్వామికి మార్చుకునేలా NPCI, పేమెంట్‌ గేట్‌వే సంస్థలు ఇంటర్‌ఆపరబిలిటీపై పనిచేస్తున్నాయని సంబంధిత వ్యక్తులు తెలిపారు.

రికరింగ్‌ పేమెంట్ల పరిమాణం కూడా గణనీయంగా పెరిగింది. NPCI గణాంకాల ప్రకారం జులైలో టాప్‌-10 బ్యాంకులు కలిపి దాదాపు 180 కోట్ల UPI ఈ-మండేట్‌ లావాదేవీలను ప్రాసెస్‌ చేశాయి.

2025 జులైలో నమోదైన 58.5 కోట్ల లావాదేవీలతో పోలిస్తే ఇది మూడు రెట్లకుపైగా.

ADVERTISEMENT

వివరాలు 

చిన్న UPI యాప్‌లకు సమాన అవకాశాలు

చిన్న UPI యాప్‌లు AutoPayను పెద్ద ప్రత్యర్థుల వద్ద వినియోగదారులు కొనసాగిపోయేలా చేసే అంశంగా భావిస్తున్నాయి.

అందుకే ఈ ఇంటర్‌ఆపరబిలిటీ మార్పు కోసం అవి కొంతకాలంగా డిమాండ్‌ చేస్తున్నాయని ఓ ప్రముఖ UPI యాప్‌లోని చెల్లింపుల విభాగం అధికారి తెలిపారు.

చాలా మంది వినియోగదారులు క్యాష్‌బ్యాక్‌లు, ఆఫర్ల కోసం ఒక UPI యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని అందులో AutoPay ఏర్పాటు చేస్తున్నారు.

ఆ తర్వాత వారి రికరింగ్‌ పేమెంట్లు అదే యాప్‌తో అనుసంధానమై ఉండటంతో మరో యాప్‌కు మారడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో పెద్ద UPI యాప్‌లకు ప్రయోజనం కలుగుతోంది.

వివరాలు 

చిన్న UPI యాప్‌లకు సమాన అవకాశాలు

ఇక AutoPay మండేట్లను యాప్‌ల మధ్య చూడటం, మార్చుకోవడం సాధ్యమైతే ఈ ప్రయోజనం తగ్గే అవకాశం ఉంది.

దీంతో Navi, POP UPI, super.money వంటి కొత్త యాప్‌లు, PhonePe, Google Pay వంటి పెద్ద యాప్‌లలో ప్రస్తుతం నిర్వహిస్తున్న రికరింగ్‌ పేమెంట్లను తమవైపు ఆకర్షించేందుకు మెరుగైన అవకాశం లభించవచ్చు.

అయితే ఈ విధానాన్ని అమలు చేయడానికి మొత్తం UPI వ్యవస్థలోని యాప్‌లు కొన్ని సాంకేతిక మార్పులు చేయాల్సి ఉంటుంది.

వినియోగదారులు ఉపయోగించే అన్ని యాప్‌ల మధ్య ఈ సదుపాయం పనిచేయాల్సి ఉండటంతో మార్పులు తప్పనిసరని సంబంధిత అధికారి తెలిపారు.

తమ సంస్థ ఇప్పటికే అవసరమైన మార్పులు చేసిందని చెప్పారు. దీనిపై NPCIకి పంపిన ప్రశ్నలకు వార్త ప్రచురించే సమయానికి సమాధానం రాలేదు.

వివరాలు 

వ్యాపారులకు ఏం ప్రయోజనం?

వ్యాపారులకు ఈ ఇంటర్‌ఆపరబిలిటీ వల్ల ఇప్పటికే ఉన్న AutoPay మండేట్లను మరో పేమెంట్‌ గేట్‌వేకు మార్చుకునే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం ఒక సబ్‌స్క్రిప్షన్‌ సంస్థ పేమెంట్‌ గేట్‌వేను మార్చుకుంటే కొత్త కస్టమర్లను కొత్త భాగస్వామి ద్వారా తీసుకోవచ్చు.

కానీ పాత కస్టమర్ల AutoPay మండేట్లు మాత్రం పాత పేమెంట్‌ ప్రొవైడర్‌ వద్దే కొనసాగుతాయి.

ఉదాహరణకు నెట్‌ఫ్లిక్స్‌ మొదట PayU వంటి పేమెంట్‌ గేట్‌వేతో సేవలు ప్రారంభించి, తర్వాత కొత్తగా Cashfreeకి మారాలనుకుంటే.. కొత్త కస్టమర్లతో పాటు ఇప్పటికే ఉన్న మండేట్లను కూడా Cashfreeకి మార్చుకునే అవకాశం ఉంటుంది.

ఇంటర్‌ఆపరబిలిటీ అమల్లోకి వస్తే పాత మండేట్ల నుంచి కూడా భవిష్యత్తులో డెబిట్‌లను Cashfree నిర్వహించగలదని Cashfree Payments సహ వ్యవస్థాపకుడు రీజూ దత్తా తెలిపారు.

వివరాలు 

వ్యాపారులకు ఏం ప్రయోజనం?

ప్రస్తుతం ఇంటర్‌ఆపరబిలిటీ లేకపోవడంతో కొత్త కస్టమర్లను కొత్త గేట్‌వేకు మార్చినా, పాత కస్టమర్ల మండేట్లు మాత్రం పాత ప్రొవైడర్‌ వద్దే ఉంటాయని ఆయన వివరించారు.

దీంతో పాత మండేట్ల కోసం వ్యాపారులు పాత గేట్‌వేపైనే ఆధారపడాల్సి వస్తోందని, ఈ సమస్యను పరిష్కరించడమే ఇంటర్‌ఆపరబిలిటీ లక్ష్యమని తెలిపారు.

వివరాలు 

అమలుకు సాంకేతికంగా పెద్ద మార్పులు

గతంలో UPI యాప్‌లు తమ సొంత QR కోడ్‌లపై ఆధారపడి పనిచేసేవని ఓ ప్రముఖ పేమెంట్‌ గేట్‌వే సంస్థకు చెందిన సీనియర్‌ అధికారి తెలిపారు.

ఉదాహరణకు Paytm వినియోగదారుడు Paytm యాప్‌లో చెల్లింపు చేయాలంటే Paytm జారీ చేసిన QR కోడ్‌నే స్కాన్‌ చేయాల్సి వచ్చేది.

మరో పేమెంట్‌ యాప్‌కు చెందిన QR కోడ్‌ను ఉపయోగించడం సాధ్యమయ్యేది కాదు.

ఇప్పుడు అదే తరహా ఇంటర్‌ఆపరబిలిటీని UPI AutoPayలోనూ తీసుకురావాలని NPCI చూస్తోంది.

ప్రస్తుతం ఉన్న పరిమిత వ్యవస్థ నుంచి బయటకు వచ్చి, వినియోగదారుడు ఏ యాప్‌ ఉపయోగిస్తున్నాడన్న దానితో సంబంధం లేకుండా అనేక యాప్‌లు, అనేక పేమెంట్‌ సేవల మధ్య పనిచేసే వ్యవస్థను రూపొందించడమే లక్ష్యమని ఆ అధికారి తెలిపారు.

వివరాలు 

అమలుకు సాంకేతికంగా పెద్ద మార్పులు

బిల్లర్‌ ఏ ప్లాట్‌ఫామ్‌లో నమోదై ఉన్నా వినియోగదారులు UPI AutoPay ఏర్పాటు చేసుకునేలా వ్యవస్థ ఉండాలని చెప్పారు.

ఈ మార్పుల కోసం ప్రధానంగా వినియోగదారులు నేరుగా ఉపయోగించే UPI యాప్‌లు సాంకేతిక మార్పులు చేయాల్సి ఉంటుంది.

పేమెంట్‌ ప్రాసెసర్ల కంటే థర్డ్‌ పార్టీ అప్లికేషన్‌ ప్రొవైడర్లు (TPAP), వినియోగదారుల యాప్‌లపైనే ఎక్కువ పని ఉంటుందని సంబంధిత అధికారి తెలిపారు.

ఏ సంస్థకూ ప్రత్యేకమైన AutoPay వ్యవస్థగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా మార్చడం ఇందులో ప్రధాన సవాలుగా పేర్కొన్నారు.

వివరాలు 

జులైలో UPI లావాదేవీల రికార్డు

NPCI గణాంకాల ప్రకారం జులైలో UPI ద్వారా రికార్డు స్థాయిలో 23.66 బిలియన్‌ లావాదేవీలు జరిగాయి.

వీటి మొత్తం విలువ రూ.29.88 లక్షల కోట్లు. లావాదేవీల సంఖ్యలో PhonePe 45.89 శాతంతో ముందుండగా, Google Pay 32.33 శాతం, Paytm 8.05 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

మిగిలిన వాటాలో చిన్న UPI యాప్‌లు పోటీ పడుతున్నాయి. UPI AutoPayలో ఇంటర్‌ఆపరబిలిటీ అమలైతే ఈ చిన్న యాప్‌లకు పెద్ద సంస్థలతో పోటీ పడేందుకు మరింత అవకాశం లభించే వీలుంది.

ADVERTISEMENT