NPS: ఎన్‌పీఎస్ చందాదారులకు శుభవార్త.. పెట్టుబడి గడువును పెంచిన పీఎఫ్‌ఆర్డీఏ
ఈ వార్తాకథనం ఏంటి
జాతీయ పెన్షన్ వ్యవస్థ (NPS) చందాదారులకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) శుభవార్త చెప్పింది. అదే రోజు పెట్టుబడి (Same-Day Investment)ద్వారా ఆ రోజు ముగింపు నికర ఆస్తి విలువ (NAV) పొందేందుకు ఉండే గడువును రెండున్నర గంటలు పెంచింది. ఇప్పటి వరకు ఉదయం 11 గంటల వరకు ఉన్న గడువును ఇకపై వ్యాపార సెటిల్‌మెంట్ రోజుల్లో మధ్యాహ్నం 1:30 గంటల వరకు పొడిగించింది. ఈ నిర్ణయంతో ఎన్‌పీఎస్ చందాదారులు తమ కాంట్రిబ్యూషన్లను మరింత సౌకర్యవంతంగా చెల్లించే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా మార్కెట్‌లో ఒడిదుడుకులు ఉన్న సమయంలో ఆలస్యంగా చందా చెల్లించే వారికి అదే రోజు ముగింపు NAV ప్రయోజనం పొందడం సులభమవుతుంది.
వివరాలు
లావాదేవీలు పూర్తి చేయడానికి అదనంగా రెండున్నర గంటల సమయం
గతంలో ఉదయం 11 గంటలలోపు లావాదేవీలు పూర్తి చేయాల్సి ఉండగా, ఇప్పుడు అదనంగా రెండున్నర గంటల సమయం అందుబాటులో ఉంటుంది.
ఈ కొత్త గడువు ప్రభుత్వ నోడల్ కార్యాలయాలు, పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్ (PoPs), eNPS, D-Remit, భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (BBPS), UPI, STAR NPS, తత్కాల్ NPS వంటి అన్ని ప్రధాన చందా చెల్లింపు మార్గాలకు వర్తిస్తుందని పీఎఫ్‌ఆర్డీఏ తెలిపింది.
అయితే, చందాదారులు, మధ్యవర్తి సంస్థలు తమ నిధుల బదిలీలను ముందుగానే ప్రారంభించాలని పీఎఫ్‌ఆర్డీఏ సూచించింది.
వ్యాపార సెటిల్‌మెంట్ రోజున మధ్యాహ్నం 1:30 గంటలలోపు ట్రస్టీ బ్యాంక్‌కు నిధులు చేరితేనే అదే రోజు పెట్టుబడిగా పరిగణించి, ఆ రోజు ముగింపు NAV ఆధారంగా యూనిట్లు కేటాయిస్తారు.
వివరాలు
ముగింపు NAV ఆధారంగా యూనిట్ల కేటాయింపు
అలాగే, కొత్త గడువుకు అనుగుణంగా తమ సాంకేతిక, కార్యాచరణ వ్యవస్థలను నవీకరించాలని అన్ని మధ్యవర్తి సంస్థలకు పీఎఫ్‌ఆర్డీఏ ఆదేశించింది.
దీంతో అదే రోజు పెట్టుబడి విధానం ఎలాంటి అంతరాయం లేకుండా అమలవుతుందని పేర్కొంది.
ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారమే ఆ రోజు ముగింపు NAV ఆధారంగా యూనిట్ల కేటాయింపు కొనసాగుతుందని స్పష్టం చేసింది.