SEBI: ఐపీఓ దిశగా ఎన్‌ఎస్‌ఈ అడుగు.. సెబీకి రూ.715 కోట్లు చెల్లింపు
ఈ వార్తాకథనం ఏంటి
తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు సన్నాహాలు చేస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) కీలక ముందడుగు వేసింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కో-లోకేషన్, డార్క్ ఫైబర్ కేసుల పరిష్కారం కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి మొత్తం రూ.1,491.21 కోట్లు చెల్లించినట్లు ఎన్‌ఎస్‌ఈ శుక్రవారం ప్రకటించింది. ఇంతకుముందే రూ.776.47 కోట్లు డిపాజిట్ చేసిన ఎన్‌ఎస్‌ఈ, తాజాగా రూ.714.74 కోట్లు అదనంగా చెల్లించింది. దీంతో సెటిల్‌మెంట్‌కు అంగీకరించిన మొత్తం రూ.1,491.21 కోట్లు పూర్తిగా చెల్లించినట్లైంది. ఈ కేసులకు సంబంధించిన సవరించిన సెటిల్‌మెంట్ ప్రతిపాదనకు సెబీ గురువారం సూత్రప్రాయంగా ఆమోదం తెలపడంతో ఎన్‌ఎస్‌ఈ ఈ చెల్లింపును పూర్తి చేసింది.
వివరాలు
సెటిల్‌మెంట్ మొత్తాన్ని పెంచిన ఎన్‌ఎస్‌ఈ
కో-లోకేషన్, డార్క్ ఫైబర్ కేసుల పరిష్కారం కోసం 2025 జూన్ 20న ఎన్‌ఎస్‌ఈ రూ.1,387.39 కోట్లతో రెండు సెటిల్‌మెంట్ దరఖాస్తులు దాఖలు చేసింది.
అనంతరం 2026 మార్చి 13న ఆ ప్రతిపాదనను సవరించి, సెటిల్‌మెంట్ మొత్తాన్ని రూ.1,491.21 కోట్లకు పెంచింది. ఈ సవరించిన ప్రతిపాదనకు సెబీ అంగీకారం తెలిపింది.
వివరాలు
ఐపీఓకు మార్గం సుగమం
ఈ సెటిల్‌మెంట్‌తో ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ ప్రక్రియలో కీలక అడ్డంకి తొలగినట్లైంది. ఇప్పటికే ఐపీఓకు అనుమతి కోరుతూ సెబీకి ముసాయిదా పత్రాలను ఎన్‌ఎస్‌ఈ సమర్పించింది.
ప్రతిపాదిత ఐపీఓలో ప్రస్తుత వాటాదారులు 14.89 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. ఇది సంస్థ మొత్తం ఈక్విటీ మూలధనంలో సుమారు 6 శాతం వాటాకు సమానం.
మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ పరిమాణం సుమారు రూ.30,000 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది.
ఈ ఐపీఓ భారత మూలధన మార్కెట్ చరిత్రలో అతిపెద్ద పబ్లిక్ ఆఫర్లలో ఒకటిగా నిలిచే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.