NVIDIA: ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ పునర్నియామకం.. బోర్డు ఏకగ్రీవ నిర్ణయం!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా (NVIDIA)కీలక ప్రకటన చేసింది. కంపెనీ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO),బోర్డు డైరెక్టర్‌గా జెన్సెన్ హువాంగ్‌ను తిరిగి నియమించింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. జెన్సన్ హువాంగ్‌తో పలు దఫాలుగా చర్చలు,సమావేశాలు నిర్వహించిన అనంతరం కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఆయన నిజాయితీగా వ్యవహరించిన తీరు,కంపెనీని సమర్థంగా నడిపించే సామర్థ్యంపై సంతృప్తి వ్యక్తం చేసిన బోర్డు సభ్యులు.. ఏకగ్రీవంగా ఆయన పునర్నియామకానికి ఆమోదం తెలిపారు. ఈ ప్రక్రియలో అమెరికా ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి అధికారుల అభిప్రాయాలను కూడా బోర్డు తీసుకుంది. జెన్సన్ హువాంగ్ తిరిగి బాధ్యతలు చేపట్టడం వల్ల జాతీయ భద్రతకు ఎలాంటి ముప్పు ఉండదని బోర్డు స్పష్టం చేసింది.
వివరాలు
జెన్సన్ నాయకత్వంపై బోర్డు పూర్తి విశ్వాసం..
ఈ సందర్భంగా ఎన్విడియా బోర్డు ఛైర్మన్ హార్వీ సి. జోన్స్ మాట్లాడుతూ.. కంపెనీకి నాయకత్వం వహించేందుకు జెన్సన్ హువాంగ్ సరైన వ్యక్తి అని పేర్కొన్నారు.
ఆయన తిరిగి బాధ్యతలు చేపట్టడం వాటాదారులు, ఉద్యోగులు, వ్యాపార భాగస్వాములు, వినియోగదారుల ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుందని తెలిపారు.
జెన్సన్ నాయకత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందని, ఆయనతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నామని చెప్పారు.
తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు నిర్వహించిన కోలెట్ క్రెస్‌కు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
సీఎఫ్‌ఓగా తన బాధ్యతలను కొనసాగిస్తూనే తాత్కాలిక సీఈఓగా కంపెనీకి సేవలందించినందుకు ఆమెను అభినందించారు. హార్వీ జోన్స్ బోర్డు ఛైర్మన్‌గా కొనసాగనున్నారు.
వివరాలు
తిరిగి బాధ్యతలు చేపట్టిన జెన్సన్.. మద్దతు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు
తిరిగి బాధ్యతలు చేపట్టడంపై జెన్సన్ హువాంగ్ సంతోషం వ్యక్తం చేశారు.
ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సాంకేతిక సంస్థల్లో ఒకటైన ఎన్విడియాకు నాయకత్వం వహించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు.
ప్రస్తుతం ప్రపంచం కొత్త పారిశ్రామిక విప్లవం దిశగా అడుగులు వేస్తోందని,ఈ సమయంలో కంపెనీ బాధ్యతలు చేపట్టడం మరింత ప్రత్యేకమని పేర్కొన్నారు.
తనపై నమ్మకం ఉంచిన బోర్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా బోర్డు ఛైర్మన్ హార్వీ జోన్స్, తాత్కాలిక సీఈఓ కోలెట్ క్రెస్, కంపెనీ ఉన్నతాధికారులకు ధన్యవాదాలు చెప్పారు.
ఈ కష్టకాలంలో తనకు అండగా నిలిచిన ఉద్యోగులు,వాటాదారులు,ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగస్వాములు,పరిశ్రమకు చెందిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
వివరాలు
విదేశీ నిఘా ఆరోపణలపై కొనసాగుతున్న విచారణ
అన్నింటికంటే ముఖ్యంగా తన కుటుంబం అందించిన ప్రేమ, మద్దతుకు రుణపడి ఉంటానని చెప్పారు. తిరిగి పనిలోకి వెళ్లేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని జెన్సన్ వెల్లడించారు.
ఇదిలా ఉండగా, ఇటీవల జెన్సన్ హువాంగ్ విదేశీ నిఘా సంస్థల ప్రయత్నాలకు లక్ష్యంగా మారినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఎన్విడియా బోర్డు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
స్వతంత్ర డైరెక్టర్లతో కూడిన ఈ కమిటీ విచారణ చేపట్టగా, దానికి సహకరించేందుకు స్వతంత్ర న్యాయ సలహాదారులను కూడా నియమించింది.
ఈ విచారణ పూర్తయ్యే వరకు కొనసాగుతుందని బోర్డు స్పష్టం చేసింది. విచారణకు జెన్సన్ హువాంగ్ పూర్తి మద్దతు ప్రకటించడంతో పాటు, దర్యాప్తునకు సహకరిస్తానని హామీ ఇచ్చారు.
వివరాలు
జాతీయ భద్రత, నిబంధనల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ
మరోవైపు, వాణిజ్య నిబంధనల అమలు, జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలను పర్యవేక్షించేందుకు స్వతంత్ర డైరెక్టర్లతో ప్రత్యేకంగా నేషనల్ సెక్యూరిటీ అండ్ ఎక్స్‌పోర్ట్ కంట్రోల్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు.
జాతీయ భద్రతకు సంబంధించిన అంశాల్లో అనుభవం ఉన్న న్యాయ నిపుణుల సేవలను ఈ కమిటీ తీసుకోనుంది.
అలాగే, ఈ రంగంలో నైపుణ్యం ఉన్న ఇతర సలహాదారులను కూడా నియమించనుంది.
కంపెనీ వ్యాప్తంగా నిబంధనల అమలును పర్యవేక్షించేందుకు కొత్తగా చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్ (CCO) పదవిని సృష్టించి, ఆ నియామక ప్రక్రియను ప్రారంభించింది.
ఈ అధికారి నామినేషన్ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్ కమిటీకి నివేదిక అందించనున్నారు.
ప్రభుత్వ సంస్థలు చేపడుతున్న ప్రస్తుత విచారణలు, దర్యాప్తులకు ఎన్విడియా సహకారం కొనసాగిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జెన్సన్ హువాంగ్‌కు ఎన్విడియా బోర్డు మద్దతు.. మళ్లీ సీఈఓగా బాధ్యతలు
Nvidia's board has reinstated Jensen Huang as chief executive, president and as a member of the board, the company said in an announcement Monday. https://t.co/CQCEa56s3F pic.twitter.com/AtqS8yPfmT
— CNN Breaking News (@cnnbrk) November 23, 2026