Onion Prices: ఉల్లి ధరలు ఎప్పుడు తగ్గుతాయో చెప్పిన కేంద్రం.. ఆ నెలలో కిలో రూ.40 లోపే..
దేశంలో ఉల్లిపాయ ధరలు మండిపోతున్నాయి. దీంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. దేశ రాజధాని దిల్లీలో కిలో ఉల్లి ధర ప్రస్తుతం రూ.80కి చేరుకుంది. ఈ క్రమంలో దేశంలో ఉల్లి ధరలను నియంత్రించేందుకు కేంద్రం చేర్యలు చేపట్టింది. వచ్చే ఏడాది మార్చి వరకు ఉల్లి ఎగుమతిని కేంద్రం ప్రభుత్వం నిషేధించింది. ఇదే సమయంలో దేశంలో ఉల్లి ధరలు ఎప్పుడు తగ్గుతాయనే దానిపై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. జనవరి, 2024నాటికి కిలో ఉల్లి సగటు ధర రూ.40దిగువకు తగ్గుతుందని కేంద్రం అంచనా వేస్తున్నట్లు వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ సోమవారం తెలిపారు. ఉల్లి ధరలు కిలో రూ.40కంటే తక్కువకు ఎప్పుడు దిగొస్తాయని జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానం చెప్పారు.
ఉల్లి ధర కేజీ రూ.60దాటదు: కేంద్రం
కొందరు ఉల్లి ధర కేజీ రూ.100దాటుతుందని అంటున్నారని, కానీ అలా ఎప్పటికీ కాదని రోహిత్ కుమార్ సింగ్ అన్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధర సగటున కేజీ రూ.57.02ఉన్నట్లు చెప్పారు. అది ఎప్పటికీ రూ.60 దాటదని వెల్లడించారు. ఉల్లి ఎగుమతి నిషేధం వల్ల రైతులపై ప్రభావం చూపదని, భారత్, బంగ్లాదేశ్ మార్కెట్లలో ధరల వ్యత్యాసాన్ని చిన్నపాటి వ్యాపారులు సద్వినియోగం చేసుకుంటున్నారని అన్నారు. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ)లో ఉల్లి ద్రవ్యోల్బణం పెరుగుతోంది. జూలై నుంచి రెండంకెలలో ఉంది, అక్టోబర్‌లో నాలుగేళ్ల గరిష్ట స్థాయి 42.1 శాతానికి చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 4 వరకు దేశం నుంచి 9.75 లక్షల టన్నుల ఉల్లి ఎగుమతి అయింది.