EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. క్లెయిమ్ లేకుండానే ఖాతాలోకి డబ్బులు!
ఈ వార్తాకథనం ఏంటి
చాలా మంది ఉద్యోగులకు పీఎఫ్ డబ్బులు క్లెయిమ్ చేసుకోవడం పెద్ద సమస్యగా మారుతోంది. ముఖ్యంగా గతంలో పనిచేసిన సంస్థలను వదిలేసిన తర్వాత, కొంతమందికి పీఎఫ్ఓలో పాత ఖాతాలు అలాగే మిగిలిపోతుంటాయి. ఆ ఖాతాల్లో చిన్న చిన్న మొత్తాలు నిల్వగా ఉండి, చాలా కాలంగా క్లెయిమ్ చేయకుండా ఉండిపోతాయి. ఇలాంటి పని చేయని ఖాతాల్లో ఉన్న డబ్బును సభ్యులకు త్వరగా అందించేందుకు ఎంప్లాయ్ మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కొత్త పైలట్ ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపింది. చాలా కాలంగా క్లెయిమ్ చేయకుండా ఉన్న చిన్న మొత్తాలను సభ్యులకు త్వరగా తిరిగి ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
వివరాలు
వారికి గుడ్ న్యూస్
ఈ కొత్త కార్యక్రమం ప్రకారం రూ.1,000 లేదా అంతకంటే తక్కువ బ్యాలెన్స్ ఉన్న పని చేయని ఈపీఎఫ్ఓ ఖాతాల నుంచి క్లెయిమ్ సెటిల్‌మెంట్‌ను స్వయంచాలకంగా ప్రాసెస్ చేస్తుంది. దీనికోసం ఖాతాదారులు ప్రత్యేకంగా విత్‌డ్రాయల్ కోసం అప్లికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అంటే చిన్న మొత్తాలు ఉన్న ఖాతాల్లోని డబ్బు ఆటోమేటిక్‌గా సెటిల్ అవుతాయి. మొదటి దశలో సుమారు 1.33 లక్షల ఖాతాలు ఈ కార్యక్రమంలోకి వస్తాయి. వీటిలో దాదాపు ₹5.68 కోట్ల వరకు నిధులు ఉన్నాయి. ఈ విషయాన్ని EPFO బోర్డు సమావేశంలో అధికారులు చర్చించారు.
వివరాలు
'ఇనాపరేటివ్ ఖాతా' అంటే ఏమిటి?
'ఇనాపరేటివ్ ఖాతా' అంటే ఏమిటి? వాటికి సంబంధించిన లావాదేవీలను ఎలా ప్రాసెస్ చేస్తారు? అనే ప్రశ్నలు చాలా మందికి ఉన్నాయి. ఈపీఎఫ్ నిబంధనల ప్రకారం, సభ్యుడు 55 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత లేదా రిటైర్మెంట్ అయిన తర్వాత.. వరుసగా మూడు సంవత్సరాలు ఖాతాలో ఎలాంటి కాంట్రిబ్యూషన్ లేకపోతే ఆ ఖాతాను "ఇనాపరేటివ్"గా పరిగణిస్తారు. ఈ విషయాన్ని ఈపీఎఫ్ఓ సంస్థ స్పష్టం చేసింది. బోర్డు సమావేశం వివరాల ప్రకారం.. 2025 మార్చి 31 నాటికి దేశంలో ఇలాంటి ఇనాపరేటివ్ ఖాతాలు మొత్తం 31.83 లక్షలు ఉన్నాయి. వాటిలో సుమారు ₹10,181 కోట్ల వరకు నిధులు నిల్వగా ఉన్నాయి. అయితే ఇందులో అంతర్జాతీయ కార్మికుల ఖాతాలు లెక్కలోకి తీసుకోలేదు.
వివరాలు
కొత్త మార్పులు ఏమిటి?
ఈ పైలట్ ప్రాజెక్ట్ ప్రకారం.. ఈపీఎఫ్ఓ వద్ద నమోదు చేసిన సభ్యుల ఆధార్‌కు లింక్ అయిన బ్యాంక్ ఖాతాల్లో డబ్బును నేరుగా జమ చేయనుంది. దీనికోసం కొత్తగా క్లెయిమ్ చేయడం లేదా అదనపు పత్రాలు సమర్పించడం అవసరం ఉండదు. ఈ నిర్ణయంతో విత్‌డ్రాయల్ ప్రక్రియ మరింత సులభమవుతుందని అధికారులు తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే, తర్వాత రూ.1,000 కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉన్న ఖాతాలకు కూడా ఈ సదుపాయాన్ని విస్తరించే అవకాశం ఉంది. సభ్యులకు అనుకూలమైన సంస్కరణలపై EPFO మరింత దృష్టి పెడుతోందని అధికారులు తెలిపారు.
వివరాలు
డబ్బులు డ్రా చేయడం ఇక మరింత సులభం
ఈపీఎఫ్ఓ తన సేవలను మెరుగుపరచేందుకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ కూడా పలు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా దేశంలోని సుమారు 8 కోట్ల ఈపీఎఫ్ సభ్యులు యూపీఐ (UPI) ద్వారా నేరుగా డబ్బు విత్‌డ్రా చేసుకునే విధంగా కొత్త వ్యవస్థను తీసుకురానుంది. ఈ ప్రాజెక్ట్‌ను 2026 ఏప్రిల్ నాటికి అమలు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో ఉన్న సాఫ్ట్‌వేర్ సమస్యలను కూడా ఈపీఎఫ్ఓ పరిష్కరించే పనిలో ఉంది. ఈ మార్పులు అమల్లోకి వస్తే సుమారు 8 కోట్ల మందికి ప్రయోజనం కలగనుంది. ఇప్పటివరకు వారు ఈపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బు తీసుకోవాలంటే ఎక్కువ సమయం పట్టేది. ఇకపై ఆ సమస్యకు చెక్ పెట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.