Loading...
Silver Price Crash: ఒకప్పుడు రికార్డు స్థాయికి.. ఇప్పుడు భారీ పతనం.. కారణం ఏమిటంటే?
ఒకప్పుడు రికార్డు స్థాయికి.. ఇప్పుడు భారీ పతనం.. కారణం ఏమిటంటే?

Silver Price Crash: ఒకప్పుడు రికార్డు స్థాయికి.. ఇప్పుడు భారీ పతనం.. కారణం ఏమిటంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 18, 2026
02:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు భారీగా దిద్దుబాటుకు గురవుతున్నాయి. అమెరికా ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ పెరగడం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చన్న అంచనాలు ఇందుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. అయితే ఈ రెండు విలువైన లోహాల్లో వెండి ధరల పతనం మాత్రం మరింత ఆశ్చర్యకరంగా ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు వెండి ధర 120 డాలర్ల మార్కును దాటింది. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర ఏకంగా రూ.4 లక్షలకు మించింది. బంగారంతో పోలిస్తే వెండి ధరలు అత్యంత వేగంగా పెరిగి అందరినీ ఆశ్చర్యపరిచాయి. సాధారణంగా రూ.లక్షలోపే ఉండే కిలో వెండి ధర ఒక్కసారిగా ఈ స్థాయికి చేరడంతో అప్పట్లో కొనుగోలుదారులు ముక్కున వేలేసుకున్నారు.

వివరాలు

1980 నాటి గరిష్ఠాల కంటే దిగువకు

అయితే ఇప్పుడు అదే వేగంతో వెండి ధరలు పతనమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో గత కొంతకాలంగా ఔన్సు వెండి ధర 50 డాలర్ల దిగువనే ట్రేడవుతోంది.

బుధవారం మరింత క్షీణించి 45.87 డాలర్లకు పడిపోయింది. దీంతో దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.1.70 లక్షల దిగువకు చేరింది.

అంతర్జాతీయ ధరలను పరిశీలిస్తే.. 1980, 2011లో నమోదైన గరిష్ఠ స్థాయుల కంటే ప్రస్తుతం వెండి ధర దిగువన ట్రేడవుతోంది.

చరిత్రలో 1980 జనవరి 18న ఔన్సు వెండి ధర 49.45 డాలర్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత 2011 ఏప్రిల్ 20న 48.44 డాలర్ల వద్ద మరో గరిష్ఠాన్ని నమోదు చేసింది.

వివరాలు

వెండి ధరలు పడిపోవడానికి కారణాలివే!

ఈ ఏడాది ప్రారంభంలో ఏకంగా 120 డాలర్ల స్థాయికి చేరిన వెండి.. ఏడాది చివరికి వచ్చేసరికి తన విలువలో 60 శాతానికి పైగా కోల్పోయింది.

అమెరికాలో ద్రవ్యోల్బణం అధికంగా ఉండటంతో ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్లను పెంచవచ్చన్న అంచనాలు బలపడుతున్నాయి.

వడ్డీ రేట్లు పెరిగితే ఎలాంటి వడ్డీ ఆదాయం ఇవ్వని వెండి వంటి విలువైన లోహాలపై పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గుతుంది.

దీంతో వాటి ధరలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ విలువతో పాటు ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ భారీగా పెరిగాయి.

దీంతో ఇన్వెస్టర్లు వెండిలో పెట్టిన పెట్టుబడులను ఉపసంహరించుకుని సురక్షితమైన ప్రభుత్వ బాండ్ల వైపు మళ్లుతున్నారు.

ADVERTISEMENT

వివరాలు

పారిశ్రామిక డిమాండ్ తగ్గుతుందన్న అంచనాలు

ఇతర ఆర్థిక సాధనాల్లో పెట్టుబడులు ఒత్తిడిని ఎదుర్కొంటుండటంతో నగదు అవసరాల కోసం కూడా ఇన్వెస్టర్లు బంగారం, వెండి వంటి విలువైన లోహాలను విక్రయిస్తున్నారు. ఇది కూడా వెండి ధరల పతనానికి మరో కారణంగా మారింది.

బంగారంతో పోలిస్తే వెండికి పెట్టుబడి పరంగానే కాకుండా పారిశ్రామికంగా కూడా అధిక డిమాండ్ ఉంటుంది.

ఎలక్ట్రానిక్స్ సహా పలు పరిశ్రమల్లో వెండిని వినియోగిస్తుంటారు. అయితే ప్రస్తుతం పారిశ్రామిక డిమాండ్ తగ్గే అవకాశం ఉందన్న అంచనాలు మార్కెట్లో నెలకొన్నాయి.

ఈ పరిణామం కూడా వెండి ధరలపై అదనపు ఒత్తిడిని పెంచుతోందని నిపుణులు పేర్కొంటున్నారు.

ADVERTISEMENT