EPFO: 37% పెనాల్టీకి బదులు 1% మాత్రమే.. ఈపీఎఫ్ఓ సంచలన నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) యజమానులకు భారీ ఊరట కలిగించే VISHWAS 2026 వన్‌టైమ్ సెటిల్‌మెంట్ స్కీమ్‌ను అమలు చేస్తోంది. PF చందాలను ఆలస్యంగా చెల్లించడం వల్ల పెండింగ్‌లో ఉన్న పెనాల్టీలు, వివాదాలను తక్కువ జరిమానాతో పరిష్కరించుకునే అవకాశం ఈ పథకం ద్వారా లభిస్తోంది. డిసెంబర్ 28, 2026 ఈ స్కీమ్‌కు చివరి తేదీగా EPFOస్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఆలస్య PF చెల్లింపులపై భారీ నష్టపరిహారం విధించే అవకాశం ఉండేది. అయితే VISHWAS 2026 కింద జరిమానాలను గణనీయంగా తగ్గించారు. రెండు నెలల వరకు ఆలస్యం అయితే నెలకు 0.25%, రెండు నుంచి నాలుగు నెలల వరకు 0.50%, నాలుగు నెలలకు మించి ఆలస్యం అయితే 1% మాత్రమే పెనాల్టీ విధించనున్నారు.
వివరాలు
ఆలస్యమైన కేసులకు వర్తించే అవకాశం
ఈ స్కీమ్ 2024 జూన్ 14కు ముందు జరిగిన PF ఆలస్య చెల్లింపులకు సంబంధించిన అర్హత కేసులకు వర్తిస్తుంది.
కోర్టులు లేదా ట్రిబ్యునళ్లలో పెండింగ్‌లో ఉన్న వివాదాలు, రికవరీ దశలో ఉన్న పెనాల్టీ ఆర్డర్లు, పెండింగ్ నోటీసులు, అలాగే కొన్ని నమోదు అయిన ఆలస్య కేసులు కూడా ఇందులోకి వస్తాయి.
దరఖాస్తు చేసుకునే యజమానులు ముందుగా ఆలస్య PF చందాలపై ఉన్న వడ్డీ మొత్తాన్ని పూర్తిగా చెల్లించాలి.
అనంతరం EPFO Employer Portal ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేస్తే, సిస్టమ్ కొత్త పెనాల్టీ మొత్తాన్ని స్వయంగా లెక్కిస్తుంది. చెల్లింపునకు 15 రోజుల గడువు ఇవ్వబడుతుంది.
వివరాలు
ప్రత్యేక పరిస్థితుల్లో మరో 15 రోజుల పొడగింపు
అవసరమైతే ప్రత్యేక పరిస్థితుల్లో మరో 15 రోజుల పొడిగింపు కూడా లభించవచ్చు. చెల్లింపు పూర్తయిన తర్వాత డిజిటల్ Settlement Certificate జారీ అవుతుంది.
ఈ పథకాన్ని వినియోగించుకోవాలని బాంబే, మద్రాస్, కేరళ హైకోర్టులు కూడా యజమానులను ప్రోత్సహించాయి.
దీని వల్ల దీర్ఘకాలంగా కొనసాగుతున్న PF వివాదాలు తగ్గడంతో పాటు, న్యాయపరమైన ఖర్చులు మరియు ఆర్థిక భారం కూడా తగ్గే అవకాశం ఉందని EPFO తెలిపింది.