LOADING...
OpenAI: ఓపెన్‌ఏఐలో 5% వాటా అమెరికా ప్రభుత్వానికి?
ఓపెన్‌ఏఐలో 5% వాటా అమెరికా ప్రభుత్వానికి?

OpenAI: ఓపెన్‌ఏఐలో 5% వాటా అమెరికా ప్రభుత్వానికి?

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 02, 2026
11:25 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా ప్రభుత్వం కోసం ఓపెన్‌ఏఐ తన ఈక్విటీలో 5 శాతం వాటాను కేటాయించే ప్రతిపాదన చేసినట్లు సమాచారం. సంస్థ కార్పొరేట్ పాలనా వ్యవస్థలో మార్పులు, అలాగే అమెరికా ప్రభుత్వ మద్దతు పొందే అంశాలపై జరుగుతున్న చర్చల్లో ఈ ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం, ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్‌తో పాటు సంస్థ ఉన్నతాధికారులు అమెరికాలోని ప్రముఖ కృత్రిమ మేధ (AI) సంస్థలు తమ ఈక్విటీలో 5 శాతం వాటాను ఒక ప్రజా నిధికి (పబ్లిక్ ఫండ్) కేటాయించాలని సూచించినట్లు సమాచారం.

వివరాలు 

ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే..

ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే, ఓపెన్‌ఏఐ ప్రస్తుత మార్కెట్ విలువను బట్టి ఆ 5 శాతం వాటా విలువ పదుల బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ఆలోచనకు అమెరికాలోని అలాస్కా పర్మనెంట్ ఫండ్ నమూనాగా నిలిచింది. చమురు ఆదాయాన్ని వినియోగించి రాష్ట్ర ప్రజలకు ప్రతి సంవత్సరం డివిడెండ్లు చెల్లించడం,రాష్ట్ర బడ్జెట్‌కు నిధులు సమకూర్చడం ఈ నిధి ప్రధాన ఉద్దేశం. ఈ ప్రతిపాదనతో కృత్రిమ మేధ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో దాని లాభాలు ఎవరికి చేరాలి? ఈ రంగంలోని ప్రముఖ కంపెనీలతో ప్రభుత్వాలు ఎంత మేరకు అనుసంధానమై ఉండాలి? అనే అంశాలపై కొత్త చర్చ మొదలైంది.

వివరాలు 

ప్రభుత్వ ప్రయోజనాలతో అనుసంధానం

ఏఐ సాంకేతికత వ్యూహాత్మకంగా మరింత కీలకంగా మారుతున్న ఈ సమయంలో, ఓపెన్‌ఏఐ లక్ష్యాలను అమెరికా ప్రభుత్వ ప్రయోజనాలతో అనుసంధానం చేయడమే ఈ ప్రతిపాదన ఉద్దేశమని సమాచారం. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఓపెన్‌ఏఐ గానీ, అమెరికా వైట్ హౌస్ గానీ అధికారికంగా స్పందించలేదు. ప్రస్తుతం ఓపెన్‌ఏఐ తన కార్పొరేట్ పాలనా వ్యవస్థలో మార్పులు చేపడుతూనే, మరింత అధునాతన ఏఐ మోడళ్ల అభివృద్ధిలో ఇతర సంస్థలతో తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది.

Advertisement

వివరాలు 

ఏఐ కంపెనీల్లో ప్రజలకూ వాటా?

ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రముఖ ఏఐ కంపెనీల్లో సాధారణ ప్రజలకు కూడా వాటా కల్పించే అవకాశాలపై పరిశీలిస్తున్నట్లు ప్రకటించారు. ఏఐ రంగం ద్వారా వచ్చే భారీ లాభాల నుంచి సాధారణ అమెరికన్లు దూరం కాకూడదన్న ఉద్దేశంతో ఈ ఆలోచనను ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. దీనికి అనుగుణంగా, ఓపెన్‌ఏఐ కూడా ఏఐ సంస్థల్లో పెట్టుబడులు పెట్టే 'పబ్లిక్ వెల్త్ ఫండ్' ఏర్పాటు చేసి, వచ్చే లాభాలను ప్రజలకు అందించే విధానాన్ని సూచించినట్లు సమాచారం. మరోవైపు, ఆంత్రోపిక్ సంస్థ కూడా ఏఐ రంగంపై విధించే పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని అమెరికా ప్రజలకు నేరుగా అందించే 'డిజిటల్ డివిడెండ్' విధానాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement