TCS Fresher hiring: ఈ ఏడాది 25 వేలమంది ఫ్రెషర్లకు అవకాశం.. టీసీఎస్ కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2026-27) 25 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ప్రముఖ ఐటీ సేవల సంస్థ టీసీఎస్ (TCS) ప్రకటించింది. డిమాండ్‌ను బట్టి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సంస్థ స్పష్టం చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ 44 వేల మంది ఫ్రెషర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించి, ప్రైవేట్ రంగంలో అత్యధిక నియామకాలు చేసిన సంస్థగా నిలిచింది. ఈ వివరాలను టీసీఎస్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇతర కంపెనీల నుంచి ఉద్యోగులను నియమించుకునే విధానంపై వచ్చిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, సాధారణంగా ఒక ఫ్రెషర్‌ను పూర్తిస్థాయి ఉద్యోగిగా తయారు చేయడానికి సుమారు 9 నెలల ట్రైనింగ్ అవసరమవుతుందని తెలిపారు.
వివరాలు
గతంలో 12వేల మంది ఉద్యోగుల తొలగింపు
అదే ఇతర సంస్థల నుండి వచ్చిన అనుభవజ్ఞులైతే వెంటనే ప్రాజెక్టుల్లో పనిచేయగలరని చెప్పారు. వ్యాపార అవసరాలను బట్టి నియామక వ్యూహాలు మారుతాయని కూడా ఆయన పేర్కొన్నారు. గత మూడేళ్లుగా కంపెనీ ప్రతి సంవత్సరం కనీసం 40 వేలకుపైగా ఫ్రెషర్లను నియమిస్తోందని వివరించారు. ఉద్యోగాల తొలగింపులపై కూడా ఆయన స్పందించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సుమారు 12 వేల మంది ఉద్యోగులను సంస్థ తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా జరిగినదన్న అభిప్రాయాన్ని ఆయన తిరస్కరించారు. తొలగింపులు ప్రధానంగా సీనియర్ స్థాయి ఉద్యోగులను పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా చేసినవేనని తెలిపారు. కంపెనీలో మంచి పనితీరు కొనసాగించిన ఉద్యోగులకు కెరీర్ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయన స్పష్టం చేశారు.