ఒరాకిల్‌లో కొనసాగుతున్న ఉద్యోగుల తొలగింపు; వందలాది మందికి ఉద్వాసన
ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు మాంద్యం భయాల నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపడుతున్నాయి. అందులో భాగంగా గ్లోబల్ టెక్ సంస్థ ఒరాకిల్ మరొక రౌండ్ తొలగింపులను చేపట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఈసారి ఆరోగ్య విభాగంలోని ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకు జాబ్ ఆఫర్‌లను కూడా రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కొన్ని కొన్ని ఓపెన్ పొజిషన్‌లను తగ్గించుకుంటోంది. డిసెంబరు 2021లో ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ సంస్థ సెర్నర్‌ను 28.3 బిలియన్ డాలర్లకు ఒరాకిల్ కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో సెర్నర్ సంస్థలో తొలగింపులు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.
నెల వేతనంతో పాటు అదనపు బెన్‌ఫిట్స్ చెల్లించే యోచనలో ఒరాకిల్
రోగుల ఆరోగ్య సమాచారాన్ని ఆల్‌లైన్‌లో రిజిస్టర్ చేయడానికి ఉపయోగించే ఎలక్ట్రానిక్ సిస్టమ్‌లను నిర్వహించడానికి, మెరుగుపరచడానికి ఒరాకిల్ సెర్నర్ విభాగం, అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ వెటరన్స్ అఫైర్స్ ఆఫీస్‌తో ఒప్పందాలను కుదుర్చుకుంది. సెర్నర్ సాఫ్ట్‌వేర్ అవాంతరాల వల్ల అనేక మంది రోగులు డేటా రిజిస్టర్ కాకపోవడంతో అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ వెటరన్స్ అఫైర్స్ ఒప్పందాన్ని ఒరాకిల్ నిలిపివేసింది. ఈ క్రమంలో ఒప్పందం రద్దు కావడంతో సెర్నర్ విభాగంలో ఉద్యోగులను తొలగించేందుకు ఒరాకిల్ సిద్ధమైంది. నాలుగు వారాలకు సమానమైన వేతనంతో పాటు ప్రతి సంవత్సరం సర్వీస్‌కు ఒక అదనపు వారం, సెలవు రోజుల చెల్లింపులను కంపెనీ అందజేయనుంది.