Venezuela: అమెరికా డిమాండ్లకు 15 నిమిషాలే గడువు.. డెన్సీ రోడ్రిగ్జ్ సంచలన వీడియో లీక్
ఈ వార్తాకథనం ఏంటి
వెనెజువెలాపై అమెరికా సైనిక దాడి చేపట్టి, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు ఆయన భార్యను యూఎస్ దళాలు నిర్బంధించిన ఘటన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ సమయంలో తమకు ఎదురైన తీవ్ర సవాళ్లపై తాత్కాలిక అధ్యక్షురాలు డెన్సీ రోడ్రిగ్జ్ (Delcy Rodriguez) ఫోన్‌లో మాట్లాడిన వీడియో ఒకటి తాజాగా లీక్ అయింది. లీక్ అయిన ఈ వీడియోలో, మదురో నిర్బంధం అనంతరం జరిగిన ఓ సమావేశంలో రోడ్రిగ్జ్ ఫోన్ కాల్ ద్వారా మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అధికారాన్ని కాపాడుకోవడమే తన ప్రధాన ప్రాధాన్యతగా పేర్కొన్నట్లు వీడియోలో ఉంది. అధ్యక్షుడు మదురో కిడ్నాప్ అయిన నిమిషాల నుంచే తమపై తీవ్రమైన బెదిరింపులు ప్రారంభమయ్యాయని ఆమె వెల్లడించారు.
Details
కేవలం 15 నిమిషాల సమయమే ఇచ్చారు
అమెరికా దళాలు తమ డిమాండ్లను అంగీకరించేందుకు కేవలం 15 నిమిషాల సమయమే ఇచ్చాయని రోడ్రిగ్జ్ తెలిపారు. ఆ సమయంలో తనతో పాటు అంతర్గత మంత్రి డియోస్టాడో కాబెల్లో, తన సోదరుడు, మంత్రి జార్జ్ రోడ్రిగ్జ్ ఉన్నారని పేర్కొన్నారు. డిమాండ్లకు ఒప్పుకోకపోతే తమను చంపేస్తామని యూఎస్ దళాలు బెదిరించాయని ఆమె వీడియోలో చెప్పినట్లు తెలుస్తోంది. ఇంకా మదురో, ఆయన భార్యను కిడ్నాప్ చేయలేదని, ఇప్పటికే చంపేశామని అమెరికా దళాలు తమకు తెలిపినట్లు రోడ్రిగ్జ్ పేర్కొన్నారు. ఇలాంటి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో బాధ్యతలు స్వీకరించాల్సి రావడం తనకు తీవ్ర వేదన కలిగించిందని ఆమె వ్యాఖ్యానించారు.
Details
అమెరికాతో రహస్య ఒప్పందం
ఇదిలా ఉండగా దేశంలో అధికార మార్పిడికి సంబంధించి రోడ్రిగ్జ్ అమెరికాతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. గతేడాది నవంబర్ నుంచే ఆమె యూఎస్ అధికారులతో సంప్రదింపులు జరిపినట్లు బ్రిటన్‌కు చెందిన ప్రముఖ పత్రిక 'ది గార్డియన్' కథనం వెల్లడించింది. మదురోను అధికారంలో నుంచి తొలగించి తానే పాలన చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని రోడ్రిగ్జ్ అమెరికా ప్రతినిధులకు తెలిపినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, తాజాగా ఆమె మాట్లాడిన వీడియో బయటకు రావడం వెనెజువెలా రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసినట్లుగా మారింది.