LOADING...
Tech Layoffs: 2025లో టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత.. లక్షకు పైగా ఉద్యోగులను తొలగించిన 218 సంస్థలు

Tech Layoffs: 2025లో టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత.. లక్షకు పైగా ఉద్యోగులను తొలగించిన 218 సంస్థలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 03, 2025
09:52 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగం భారీ ఉద్యోగాల కోతలతో దద్దరిల్లుతోంది. 2025లో ఇప్పటివరకు 218 కంపెనీలు కలిపి 1,12,700 మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు లేఆఫ్స్.ఎఫ్‌వైఐ అనే అంతర్జాతీయ వెబ్‌సైట్ తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఆర్థిక వృద్ధి మందగించడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఆధారిత ఆటోమేషన్‌ వేగంగా పెరగడం వంటి కారణాలతో అమెజాన్‌, ఇంటెల్‌, టీసీఎస్‌, మైక్రోసాఫ్ట్‌, యాక్సెంచర్‌ వంటి దిగ్గజ సంస్థలు వేలాది ఉద్యోగాలపై కత్తెర వేశాయి. క రోనా కాలంలో అవసరానికి మించి ఉద్యోగులను నియమించుకోవడం,మారుతున్న టెక్‌ మార్కెట్‌కు అనుగుణంగా వ్యూహాలను మార్చుకోవడం వంటి అంశాలే ఈ తొలగింపుల వెనుక ఉన్న ప్రధాన కారణాలుగా కంపెనీలు పేర్కొంటున్నాయి.

వివరాలు 

అమెజాన్‌లో చరిత్రలోనే అతిపెద్ద కోత 

ఈ-కామర్స్‌ మహా సంస్థ అమెజాన్‌ తన చరిత్రలోనే అతి పెద్ద ఉద్యోగాల కోతకు సన్నద్ధమైంది. ఆపరేషన్స్‌, హెచ్‌ఆర్‌, డివైజెస్‌, ఏడబ్ల్యూఎస్‌ విభాగాల్లోని సుమారు 14,000 కార్పొరేట్‌ ఉద్యోగాలు సహా మొత్తం 30,000 మందిని తొలగించనుంది. సంస్థను "ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్‌లా" నడపాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని, ఏఐ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టుతున్నామని సీఈఓ ఆండీ జాస్సీ వెల్లడించారు.

వివరాలు 

ఇంటెల్, టీసీఎస్‌లోనూ భారీగా తొలగింపులు 

చిప్‌ తయారీ దిగ్గజం ఇంటెల్‌ కూడా 24,000 మందిని (మొత్తం సిబ్బందిలో 22%) తగ్గించనున్నట్టు తెలిపింది. పీసీలకు డిమాండ్‌ తగ్గడంతో ఎన్విడియా, ఏఎండీ వంటి కంపెనీల పోటీ కారణంగా ఖర్చులను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారతీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) కూడా తన చరిత్రలోనే అతిపెద్ద ఉద్యోగాల కోతను ప్రకటించింది. సెప్టెంబర్‌ 2025తో ముగిసిన త్రైమాసికంలోనే 19,755 మందిని తొలగించింది. దీతో కంపెనీ ఉద్యోగుల సంఖ్య 2022 తర్వాత మొదటిసారిగా ఆరు లక్షల కంటే తక్కువకు చేరింది. ఏఐ ఆధారిత ఆటోమేషన్‌పై దృష్టి పెట్టడంతో మధ్యస్థాయి, ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో కోతలు తప్పలేదని సంస్థ సీహెచ్‌ఆర్‌ఓ సుదీప్‌ కున్నుమల్‌ వివరించారు.

వివరాలు 

ఏఐ కేంద్రీకృత పునర్‌వ్యవస్థీకరణ 

యాక్సెంచర్‌, మైక్రోసాఫ్ట్‌, సేల్స్‌ఫోర్స్‌ వంటి సంస్థలు కూడా భారీగా ఉద్యోగులను తొలగించాయి. ఏఐ, క్లౌడ్‌ సర్వీసుల విభాగాలను విస్తరించేందుకు మైక్రోసాఫ్ట్‌ 9,000 మందిని తొలగించగా, కస్టమర్‌ సేవల్లో ఏఐ ఆటోమేషన్‌ అమలు నేపథ్యంలో సేల్స్‌ఫోర్స్‌ 4,000 మంది సిబ్బందిని కోతకు గురి చేసింది. సిస్కో, గూగుల్‌, మెటా, ఒరాకిల్‌ వంటి కంపెనీలు కూడా ఏఐ ఆధారంగా పునర్‌వ్యవస్థీకరణ చేపట్టి ఉద్యోగాల సంఖ్యను తగ్గించాయి.

వివరాలు 

టెక్‌ రంగాన్ని దాటిన లేఆఫ్స్‌ ప్రభావం 

ఉద్యోగాల కోతలు కేవలం టెక్‌ కంపెనీలకే పరిమితం కావడం లేదు. ఆటోమేషన్‌ కారణంగా యూపీఎస్‌ 48,000 మందిని, ఎలక్ట్రిక్‌ వాహనాలపై దృష్టి సారించిన ఫోర్డ్‌ 13,000 మందిని, పారామౌంట్‌ గ్లోబల్‌ 2,000 మందిని తొలగించాయి. ఒకవైపు సంస్థలు ఏఐ టూల్స్‌పై బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టుతుండగా, మరోవైపు సంప్రదాయ ఉద్యోగాల కోతను తప్పించుకోలేకపోవడం టెక్‌ రంగానికి కొత్త సవాలుగా మారింది.