Tech Layoffs: ఆపిల్,ఇంటెల్,ఇతర టెక్ సంస్థలో కొనసాగుతున్న లేఆఫ్‌లు.. ఆగస్టులో 27,000 మంది
టెక్ సంస్థల్లో కొనసాగుతున్న లేఆఫ్‌లు తగ్గుముఖం పట్టడం లేదు. కోవిడ్ తర్వాత ప్రారంభమైన ఈ తొలగింపుల ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కృత్రిమ మేధ (ఏఐ) ప్రాప్తితో కొందరు ఉద్యోగాలు కోల్పోగా, ఖర్చుల నియంత్రణ కోసం కొన్ని సంస్థలు ఈ చర్యలు తీసుకుంటున్నాయి. ఈ ఏడాది ఆగస్టులోనే సుమారు 40 కంపెనీలు 27,000 మంది ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించాయి. మరికొన్ని కంపెనీలు కూడా లేఆఫ్‌లకు సిద్ధమవుతున్నాయి, వీటిలో ఇంటెల్, ఐబీఎం, సిస్కో వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి. స్టార్టప్ కంపెనీలూ ఈ తొలగింపుల ప్రక్రియలో భాగస్వామ్యమవుతున్నాయి.
ఆగస్టులో 15,000 మంది ఉద్యోగులను తొలగించిన ఇంటెల్
కంప్యూటర్ చిప్‌ల తయారీదారు ఇంటెల్ ఆగస్టులో 15,000 మంది ఉద్యోగులను తొలగించింది, ఇది సంస్థ మొత్తం ఉద్యోగుల 15 శాతం. 2025 నాటికి 10 బిలియన్ డాలర్ల ఖర్చును తగ్గించాలన్న ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. నెట్‌వర్కింగ్ సంస్థ సిస్కో సిస్టమ్స్ సైతం 6,000 మంది ఉద్యోగులను తొలగించింది, సంస్థ ఉద్యోగుల సంఖ్యలో ఇది 7 శాతం తగ్గుదల. ఈ చర్యను ఏఐ, సైబర్ సెక్యూరిటీ వంటి వృద్ధి చెందుతున్న విభాగాలపై దృష్టి సారించడంలో భాగంగా తీసుకుంది.
ఏడాదిలో మొత్తం 1.36 లక్షల మంది
మరో ప్రముఖ సంస్థ ఐబీఎం చైనాలోని తన రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ టీమ్‌లో 1,000 మందిని తొలగించాలని నిర్ణయించింది. చైనా మార్కెట్‌లో పరిస్థితులు కఠినంగా మారడం, ఐటీ హార్డ్‌వేర్‌కు డిమాండ్ తగ్గడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకుంది. జర్మన్ చిప్ తయారీ సంస్థ ఇన్ఫినియాన్ 1,400 మంది, గో ప్రో 140 మంది ఉద్యోగులను తొలగించుకోవాలని నిర్ణయించాయి. యాపిల్, డెల్, బ్రేవ్ షేర్‌చాట్ వంటి సంస్థలు కూడా పరిమిత లేఆఫ్‌లు ప్రకటించాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది మొత్తం 1.36 లక్షల మంది టెక్ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు.