Paytm: గ్రూప్ ఖర్చుల లెక్కలకు చెక్.. పేటీఎం 'స్ప్లిట్ బిల్స్' ఫీచర్ వచ్చేసింది
ఈ వార్తాకథనం ఏంటి
స్నేహితులతో కలిసి ట్రిప్‌కు వెళ్లినా, పార్టీ నిర్వహించినా లేదా ఉమ్మడి ఖర్చులు చేసినా చివరికి ఎవరు ఎంత చెల్లించాలి, ఎవరు ఎంత ఖర్చు చేశారు అనే లెక్కలు వేయడం చాలామందికి ఇబ్బందిగా మారుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటియం తన యాప్‌లో 'స్ప్లిట్ బిల్స్' అనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫ్రెండ్‌షిప్ డేకు ముందు ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టిన సంస్థ, గ్రూప్ ఖర్చులను నమోదు చేయడం, వాటిని సభ్యుల మధ్య విభజించడం, బకాయిలను సులభంగా సెటిల్ చేసుకునేలా ఈ ఫీచర్‌ను రూపొందించింది. పేటీఎం తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధానంగా స్నేహితుల గ్రూపులు, కాలేజీ విద్యార్థులు, యువ ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేశారు.
వివరాలు
ఫీచర్స్
రోడ్ ట్రిప్స్, పుట్టినరోజు వేడుకలు, సినిమా టికెట్లు, ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లు వంటి ఉమ్మడి ఖర్చులను ఒకే చోట నమోదు చేసి నిర్వహించుకోవచ్చు.
ఈ ఫీచర్‌ను ఉపయోగించాలంటే పేటీఎం యాప్‌లోని'Pay Anyone' విభాగానికి వెళ్లి'Split Bills'ఆప్షన్‌ను ఎంపిక చేయాలి.
అనంతరం కొత్త గ్రూప్‌ను సృష్టించి,సభ్యులను జోడించిన తర్వాత ఖర్చుల వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఖర్చులను సమానంగా అందరికీ పంచడం,నిర్దిష్ట మొత్తాల ప్రకారం విభజించడం లేదా వాటాల ఆధారంగా లెక్కించడం వంటి పలు ఎంపికలను ఈ ఫీచర్ అందిస్తుంది.
గ్రూప్‌లో ఇప్పటివరకు జరిగిన మొత్తం ఖర్చు, ప్రతి సభ్యుడి వాటా,ఎవరు ఎంత చెల్లించాలి వంటి వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి.
ఈ సదుపాయాన్ని వినియోగించడానికి ఎలాంటి పరిమితులు లేదా అదనపు ఛార్జీలు లేవని పేటీఎం వెల్లడించింది.
వివరాలు
ఇతర యూపీఐ యాప్స్ చెల్లింపులకూ మద్దతు
పేటీఎం యూపీఐ ద్వారా చేసిన చెల్లింపులతో పాటు, ఇతర యూపీఐ యాప్స్, నగదు లేదా డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించిన మొత్తాలను కూడా ఈ ఫీచర్‌లో నమోదు చేసుకునే అవకాశం ఉంది.
దీంతో అన్ని రకాల ఉమ్మడి ఖర్చులను ఒకే చోట ట్రాక్ చేయడం మరింత సులభమవుతుంది.
అలాగే బకాయిలు చెల్లించాల్సిన సభ్యులకు యాప్ నుంచే రిమైండర్లు పంపే సౌకర్యాన్ని కూడా పేటీఎం అందిస్తోంది.
ఈ సందర్భంగా పేటీఎం ప్రతినిధి మాట్లాడుతూ, "స్నేహితులతో గడిపిన ఆనంద క్షణాలు మాత్రమే గుర్తుండాలి.. ఖర్చుల లెక్కలు కాదు. అదే లక్ష్యంతో 'స్ప్లిట్ బిల్స్' ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం" అని పేర్కొన్నారు.