Paytm's UPI market: రెండేళ్లలో ఒక శాతం పెరిగిన పేటీఎం యూపీఐ మార్కెట్ వాటా
ఈ వార్తాకథనం ఏంటి
డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటియం (Paytm) రెండేళ్లలో యూపీఐ మార్కెట్‌లో తన వాటాను ఒక శాతం మేర పెంచుకుంది. అయితే,2024 జనవరిలో పేటీఎం అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (PPBL)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకున్న చర్యలతో కోల్పోయిన మార్కెట్‌ను మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో తిరిగి దక్కించుకోలేకపోయింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వెబ్‌సైట్‌లోని గణాంకాల ప్రకారం.. 2024 సెప్టెంబర్‌లో మొత్తం యూపీఐ లావాదేవీల్లో పేటీఎం వాటా 7.1 శాతంగా ఉండగా.. 2026 సెప్టెంబర్ నాటికి 8.1 శాతానికి చేరింది. 2025 మార్చిలో ఈ వాటా 6.7 శాతానికి పడిపోయింది. ఆ తర్వాత గడిచిన 18 నెలల్లో సంస్థ క్రమంగా పుంజుకుంది.
వివరాలు
పెరిగిన లావాదేవీలు.. రెట్టింపైన చెల్లింపుల విలువ
మరోవైపు లాభాల విషయంలోనూ పేటీఎం మెరుగైన ఫలితాలు సాధించింది. వరుసగా ఆరు త్రైమాసికాల్లో నికర లాభాలను నమోదు చేసింది.
2026 సెప్టెంబర్‌లో పేటీఎం ద్వారా 194 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి.
2024 సెప్టెంబర్‌లో ఈ సంఖ్య 106 కోట్లుగా ఉంది. లావాదేవీల విలువ కూడా గణనీయంగా పెరిగింది.
2024 సెప్టెంబర్‌లో రూ.1.13 లక్షల కోట్లుగా ఉన్న మొత్తం లావాదేవీల విలువ.. 2026 సెప్టెంబర్ నాటికి రూ.2.05 లక్షల కోట్లకు చేరింది.
యూపీఐ లావాదేవీల మొత్తం విలువలో పేటీఎం వాటా ఇదే సమయంలో 5.5 శాతం నుంచి దాదాపు 7 శాతానికి పెరిగింది.
వివరాలు
యూపీఐ మార్కెట్‌లో ఫోన్‌పే, గూగుల్ పే ఆధిపత్యం
అయినప్పటికీ మార్కెట్‌లో గతంలో ఉన్న స్థానాన్ని తిరిగి పొందడానికి సంస్థ మరింత కష్టపడాల్సి ఉంది.
ప్రస్తుతం యూపీఐ మార్కెట్‌లో ఫోన్‌పే, గూగుల్ పే ఆధిపత్యం కొనసాగుతోంది.
ఈ రెండు సంస్థల వాటానే మొత్తం లావాదేవీల్లో దాదాపు 78 శాతంగా ఉంది.
2022-23లో యూపీఐ లావాదేవీల్లో పేటీఎం వాటా దాదాపు 13 శాతంగా ఉండేది.
క్రమంగా తగ్గుతూ 2024 జనవరిలో 11.8 శాతానికి చేరింది. ఆ తర్వాత ఆర్‌బీఐ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.
వివరాలు
పేటీఎంపై పీపీబీఎల్ ఆంక్షల ప్రభావం
2024 జనవరి 31న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది.
ఈ చర్యలు పేటీఎం వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపాయి. పేటీఎం వ్యవస్థలో పేమెంట్స్ బ్యాంక్ కీలక పాత్ర పోషించేది.
ఫాస్టాగ్ సేవలు,బ్యాంకింగ్ సేవలతో పాటు యూపీఐ కార్యకలాపాలకు పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్‌గా వ్యవహరించేది.
ఆంక్షల తర్వాత పేటీఎం తన యూపీఐ సేవలను థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (TPAP) విధానంలోకి మార్చుకోవాల్సి వచ్చింది.
ఫోన్‌పే,గూగుల్ పే కూడా ఇదే విధానంలో పనిచేస్తున్నాయి.ఈ క్రమంలో యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్,స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యెస్ బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
పాత @paytm యూపీఐ హ్యాండిల్ నుంచి ఇతర బ్యాంకుల హ్యాండిళ్లకు వినియోగదారులను మార్చాల్సి రావడంతో సంస్థ మార్కెట్ వాటా తగ్గింది.
వివరాలు
మళ్లీ పుంజుకుంటున్న వినియోగదారుల సంఖ్య
2024 జనవరిలో 11.8 శాతంగా ఉన్న పేటీఎం వాటా.. ఫిబ్రవరిలో 11 శాతానికి, మార్చిలో 9 శాతానికి పడిపోయింది.
ఆంక్షల ప్రభావం నుంచి బయటపడేందుకు పేటీఎం క్రమంగా ప్రయత్నిస్తోంది.
ఈ క్రమంలో నెలవారీ లావాదేవీలు నిర్వహించే వినియోగదారుల సంఖ్య (MTU) కూడా పెరిగింది.
2024 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో గరిష్ఠంగా 10 కోట్ల మంది నెలవారీ యాక్టివ్ వినియోగదారులు ఉండేవారు.
సంక్షోభ సమయంలో ఈ సంఖ్య 7 కోట్లకు తగ్గింది. తాజాగా 2026 సెప్టెంబర్ త్రైమాసికం ముగిసే సమయానికి 8.5 కోట్లకు చేరింది.
పేటీఎం చెల్లింపుల ఆదాయంలో కీలకమైన వ్యాపారుల స్థూల లావాదేవీల విలువ (GMV) కూడా పెరిగింది.
వివరాలు
మళ్లీ పుంజుకుంటున్న వినియోగదారుల సంఖ్య
2024 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో రూ.5 లక్షల కోట్లుగా ఉన్న ఈ విలువ.. 2027 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.7.1 లక్షల కోట్లకు చేరింది.
అంటే మూడేళ్లలో 40 శాతం వృద్ధి నమోదైంది. ఇదే సమయంలో వ్యాపారుల నుంచి సౌండ్‌బాక్స్ వంటి పరికరాల సబ్‌స్క్రిప్షన్లు కూడా పెరిగాయి.
2024 డిసెంబర్ త్రైమాసికం చివరికి 1.06 కోట్లుగా ఉన్న పరికరాల వినియోగదారుల సంఖ్య.. 2026 సెప్టెంబర్ త్రైమాసికంలో 1.64 కోట్లకు చేరింది.
వివరాలు
పోటీ సంస్థల నుంచి గట్టి సవాలు
గత మూడేళ్లలో పేటీఎం లావాదేవీల సంఖ్య, విలువ దాదాపు రెట్టింపైనప్పటికీ.. మార్కెట్ వాటా మాత్రం అదే స్థాయిలో పెరగలేదు.
దీనికి ప్రధాన కారణం యూపీఐ మార్కెట్ మొత్తం వేగంగా విస్తరించడమే.
మరోవైపు ఆర్‌బీఐ ఆంక్షల తర్వాత వినియోగదారులు,వ్యాపారుల్లో నమ్మకాన్ని తిరిగి సంపాదించేందుకు పేటీఎం సమయం,శ్రమ వెచ్చించాల్సి వచ్చింది.
ఈ సమయంలో కొత్త సంస్థలు కూడా మార్కెట్‌లో తమ స్థానాన్ని బలోపేతం చేసుకున్నాయి.
సచిన్ బన్సల్ మద్దతున్న నావీ (Navi) సంస్థకు 2024 సెప్టెంబర్‌లో యూపీఐ మార్కెట్‌లో పెద్దగా వాటా లేదు.
వివరాలు
పోటీ సంస్థల నుంచి గట్టి సవాలు
ప్రస్తుతం మొత్తం లావాదేవీల్లో దాదాపు 5 శాతం వాటాను సాధించింది.
2024 చివర్లో యూపీఐ రంగంలోకి వచ్చిన ఫ్లిప్‌కార్ట్ గ్రూప్‌కు చెందిన సూపర్.మనీ (super.money) కూడా సుమారు 2 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది.
ఈ కొత్త సంస్థలు క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.
క్రెడిట్ వంటి ఇతర ఆర్థిక సేవలను కూడా తమ వినియోగదారులకు అందిస్తూ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి.
ఫిన్‌టెక్ రంగంలో ఇలాంటి సేవలను ముందుగా ప్రాచుర్యంలోకి తెచ్చిన పేటీఎంకు ఇప్పుడు వాటి నుంచే పోటీ ఎదురవుతోంది.
మరోవైపు బీహెచ్‌ఐఎం (BHIM), ఫ్యాంపే (FamPay), వాట్సాప్ వంటి సంస్థల నుంచి కూడా పేటీఎం పోటీని ఎదుర్కొంటోంది.
ఈ పరిస్థితుల్లో యూపీఐ మార్కెట్ వాటాను మరింత పెంచుకోవడం సంస్థకు సవాలుగా మారింది.