LOADING...
Personal Finance: బ్యాంకు రుణంతో బంగారం కొనడం సరైన నిర్ణయమా? ఆర్థిక నిపుణుల సూచనలివే..
బ్యాంకు రుణంతో బంగారం కొనడం సరైన నిర్ణయమా? ఆర్థిక నిపుణుల సూచనలివే..

Personal Finance: బ్యాంకు రుణంతో బంగారం కొనడం సరైన నిర్ణయమా? ఆర్థిక నిపుణుల సూచనలివే..

వ్రాసిన వారు Moogati Shabari
Jun 12, 2026
12:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవలి కాలంలో బంగారం ధరలు కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ, భవిష్యత్తులో అవి ఎలా మారతాయో ఖచ్చితంగా చెప్పడం కష్టం. ప్రస్తుతం ధరలు కొద్దిగా తగ్గినా, ఇంకా అధిక స్థాయిలోనే ఉన్నాయి. దీంతో సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలకు బంగారం కొనుగోలు చేయడం ఆర్థికంగా భారంగా మారుతోంది. అయితే భారతీయ సంస్కృతిలో పెళ్లిళ్లు, శుభకార్యాలు వంటి సందర్భాల్లో బంగారం కొనడం ఒక సంప్రదాయంగా, భావోద్వేగ అంశంగా కొనసాగుతోంది. ఈ అవసరాల కోసం కొందరు బ్యాంకుల నుంచి పర్సనల్ లోన్లు తీసుకుని బంగారం కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రుణం తీసుకుని బంగారం కొనడం ఎంతవరకు సమంజసం? ఇది ఆర్థికంగా లాభదాయకమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వివరాలు

పర్సనల్ లోన్‌తో బంగారం కొనడం మంచిదేనా?

ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, పర్సనల్ లోన్ తీసుకుని బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం సాధారణంగా మంచి నిర్ణయం కాదు. అయితే పెళ్లిళ్లు లేదా ఇతర అత్యవసర కుటుంబ అవసరాల వంటి తప్పనిసరి పరిస్థితుల్లో రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు పరిమిత మొత్తంలో రుణం తీసుకోవడం గురించి ఆలోచించవచ్చు. కానీ అధిక మొత్తంలో లోన్ తీసుకుని బంగారం కొనుగోలు చేయడం భవిష్యత్తులో ఆర్థిక ఒత్తిడికి దారితీయవచ్చు. ముఖ్యంగా పర్సనల్ లోన్లపై బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు సాధారణంగా 15 శాతం నుంచి 25 శాతం వరకు ఉండే అవకాశం ఉంది. ఫలితంగా ప్రతి నెల చెల్లించాల్సిన ఈఎంఐలు పెరిగి కుటుంబ బడ్జెట్‌పై అదనపు భారం పడుతుంది.

వివరాలు

పెట్టుబడి కోసం రుణంతో బంగారం కొనకూడదని సూచన..

కేవలం భవిష్యత్తులో లాభాలు వస్తాయనే ఆశతో పర్సనల్ లోన్ తీసుకుని బంగారంలో పెట్టుబడి పెట్టడం సరికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే బంగారం ధరలు పెరిగి వచ్చే లాభాల కంటే, మీరు రుణంపై చెల్లించే వడ్డీ ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశముంది. అందువల్ల పెట్టుబడి లక్ష్యంతో బంగారాన్ని ఎంచుకోవాలనుకునేవారు ఆభరణాల రూపంలో కాకుండా ఇతర ప్రత్యామ్నాయాలను పరిశీలించడం మంచిదని వారు సూచిస్తున్నారు.

Advertisement

వివరాలు

గోల్డ్ ఈటీఎఫ్‌లు (Gold ETFs)..

గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టడం షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టినట్లే ఉంటుంది. వీటిలో బంగారం విలువ ఆధారంగా పెట్టుబడి అవకాశం లభిస్తుంది. ఆభరణాలు కొనుగోలు చేసే సమయంలో ఉండే మేకింగ్ ఛార్జీలు, తరుగు నష్టం, మజూరీ వంటి అదనపు ఖర్చులు ఇందులో ఉండవు.

Advertisement

వివరాలు

డిజిటల్ గోల్డ్..

ప్రస్తుతం అనేక డిజిటల్ పేమెంట్ యాప్‌ల ద్వారా డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఇందులో కేవలం ఒక రూపాయి నుంచే పెట్టుబడిని ప్రారంభించవచ్చు. నిల్వ, భద్రత వంటి అంశాల పరంగా కూడా ఇది సౌకర్యవంతమైన ఎంపికగా పరిగణించబడుతోంది.

వివరాలు

సరైన నిర్ణయం తీసుకోవడం అవసరం..

శుభకార్యాలు లేదా కుటుంబ అవసరాల కారణంగా తప్పనిసరి పరిస్థితి ఉంటే మాత్రమే పరిమిత మొత్తంలో రుణం తీసుకుని బంగారం కొనుగోలు చేయడం గురించి ఆలోచించవచ్చు. కానీ కేవలం పెట్టుబడి కోసం లేదా ఆడంబరాల కోసం అధిక వడ్డీతో పర్సనల్ లోన్లు తీసుకుని బంగారం కొనడం ఆర్థికంగా మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. మీ ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం అత్యంత అవసరం.

Advertisement