Elon Musk: జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ కోసం పిటిషన్.. సంతకం చేస్తానన్న ఎలాన్ మస్క్!
ఈ వార్తాకథనం ఏంటి
వివాహేతర సంబంధాల వివాదంతో ఎన్విడియా సీఈఓ పదవికి రాజీనామా చేసిన బిలియనీర్ జెన్సన్ హువాంగ్‌కు మద్దతు పెరుగుతోంది. ఆయనను తిరిగి సీఈఓగా నియమించాలంటూ కంపెనీకి చెందిన పలువురు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌కు కొందరు ప్రముఖులు కూడా మద్దతు పలుకుతున్నారు. ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సైతం జెన్సన్కు అండగా నిలిచారు. జెన్సన్ను తిరిగి సీఈఓగా నియమించాలని కోరుతూ ఏదైనా పిటిషన్ వస్తే తాను సంతకం చేస్తానని మస్క్ వెల్లడించారు. అంతేకాదు.. ఎన్విడియా డైరెక్టర్ల బోర్డు ఆయనను తిరిగి తీసుకోవడానికి అంగీకరించకపోతే, తన కంపెనీలో నియమించుకోవడం గౌరవంగా భావిస్తానని పేర్కొన్నారు. జెన్సన్ను నియమించుకోవడం తనకు ఎంతో గౌరవంగా ఉంటుందని మస్క్ గతంలోనూ వ్యాఖ్యానించారు.
వివరాలు
ఎన్విడియా సీఈఓ రేసులో రెనే హాస్ పేరు
జెన్సన్ హువాంగ్ రాజీనామాతో ఖాళీ అయిన సీఈఓ స్థానానికి కొత్త వ్యక్తిని ఎంపిక చేసేందుకు ఎన్విడియా డైరెక్టర్ల బోర్డు చర్యలు చేపట్టింది.
ఈ క్రమంలో బ్రిటిష్ చిప్‌మేకర్ ఆర్మ్ హోల్డింగ్స్ ముఖ్య కార్యనిర్వహణాధికారి రెనే హాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
ఆయనను జెన్సన్ వారసుడిగా పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
రెనే హాస్ గతంలో రెండేళ్లపాటు ఎన్విడియాలో పనిచేశారు. 2013లో ఆర్మ్‌లో చేరడానికి ముందు ఎన్విడియా కంప్యూటింగ్ ఉత్పత్తుల వ్యాపార విభాగానికి వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
అయితే ఎన్విడియా బోర్డు కొత్త సీఈఓ ఎంపిక కోసం అంతర్గత, బాహ్య అభ్యర్థులను పరిశీలిస్తోంది. ప్రస్తుతం కంపెనీ సీఎఫ్ఓ కోలెట్ క్రెస్ తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
వివరాలు
జెన్సన్కు మద్దతుగా ఉద్యోగుల నిరసన
జెన్సన్ హువాంగ్ రాజీనామాను ఎన్విడియాలోని పలువురు ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు.
ఆయనను తిరిగి నియమించే విషయంలో సంస్థలోని మొత్తం ఉద్యోగుల అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని డైరెక్టర్ల బోర్డును కోరుతున్నారు.
కంపెనీ అంతర్గత వేదికపై జెన్సన్ను తిరిగి తీసుకురావాలని కోరుతూ ఉద్యోగులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఎన్విడియాకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 42,000 మంది ఉద్యోగులు ఉన్నారు.
వివరాలు
అలిస్తో సంబంధాలపై దర్యాప్తు
మరోవైపు చైనా గూఢచారిగా అమెరికా నిఘా వర్గాలు అనుమానిస్తున్న అలిస్ హువాంగ్‌తో జెన్సన్కు ఉన్న సంబంధాలపై వివాదం కొనసాగుతోంది.
ఈ వ్యవహారంపై అమెరికా నిఘా సంస్థలు ఆరా తీస్తున్నాయి. ఎఫ్‌బీఐ కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి.
అయితే అలిస్ చైనా కోసం గూఢచర్యం చేశారనే ఆరోపణలు ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ వ్యవహారంపై ఎన్విడియా డైరెక్టర్ల బోర్డు కూడా స్వతంత్ర దర్యాప్తు చేపట్టింది