EPFO Update : మీ పీఎఫ్ ఖాతా నిలిచిపోయిందా? ఇలా చేస్తే మళ్లీ యాక్టివ్ అవుతుంది!
ఈ వార్తాకథనం ఏంటి
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ఖాతాదారులకు కీలక సూచనలు జారీ చేసింది. చాలా మంది ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలు కేవైసీ లోపాలు, వివరాల అసమానతలు లేదా ఖాతా ఎక్కువకాలం ఉపయోగించకపోవడం వల్ల నిలిచిపోతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఈపీఎఫ్ఓ తాజాగా ప్రత్యేక విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీని ద్వారా నిలిచిపోయిన పీఎఫ్ ఖాతాలను తిరిగి ప్రారంభించుకునే అవకాశం కల్పించింది. మొదటగా ఉద్యోగికి యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) తప్పనిసరిగా ఉండాలి. యూఏఎన్ లేకపోతే సమీప ఈపీఎఫ్ఓ కార్యాలయాన్ని సంప్రదించి పొందవచ్చు. కార్యాలయానికి వెళ్లలేని వారు ఈపీఎఫ్ ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అభ్యర్థన పంపించవచ్చు. బ్యాంకు వివరాలు సమర్పించి బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తి చేసిన తర్వాత యూఏఎన్ జారీ అవుతుంది.
వివరాలు
ఆధార్,పాన్, బ్యాంకు ఖాతా వివరాలను యూఏఎన్‌తో అనుసంధానం చేయాలి
పీఎఫ్ ఖాతాను తిరిగి ప్రారంభించేందుకు కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడం తప్పనిసరి. ఆధార్,పాన్, బ్యాంకు ఖాతా వివరాలను యూఏఎన్‌తో అనుసంధానం చేయాలి. ఈ వివరాలు సరిపోకపోతే ఖాతా మళ్లీ నిలిచిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పేరు,పుట్టిన తేదీ ఆధార్‌లో ఉన్నట్లుగానే పీఎఫ్ నమోదుల్లో ఉండాలి. కేవైసీ పూర్తి చేసిన తర్వాత ఖాతా పునరుద్ధరణ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థన ఆమోదం పొందిన వెంటనే ఖాతా మళ్లీ పనిచేయడం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత పీఎఫ్ నగదు ఉపసంహరణ లేదా ఇతర అభ్యర్థనలు సమర్పించుకోవచ్చు. పీఎఫ్ నగదు కోసం దరఖాస్తు చేసే సమయంలో అవసరమైతే ఫీల్డ్ అధికారుల సహాయం కూడా పొందవచ్చు.
వివరాలు
సమీప ఈపీఎఫ్ఓ కార్యాలయానికి వెళ్లి జాయింట్ డిక్లరేషన్ ఫారం' సమర్పించాలి
రూ.5లక్షల లోపు అభ్యర్థనలకు తొలి స్థాయి అనుమతి సరిపోతుంది.అంతకంటే ఎక్కువ మొత్తాలకు ఉన్నత స్థాయి ఆమోదం అవసరం అవుతుంది. కొన్నిసందర్భాల్లో సాంకేతిక లోపాలు లేదా సమాచారం సరిపోకపోవడం వల్ల ఆన్‌లైన్ ప్రక్రియ పనిచేయకపోవచ్చు. అప్పుడు సమీప ఈపీఎఫ్ఓ కార్యాలయానికి వెళ్లి జాయింట్ డిక్లరేషన్ ఫారం' సమర్పించాలి. దీనిని ప్రస్తుత లేదా గత యజమాని ధృవీకరించాల్సి ఉంటుంది.అలాగే ఆధార్,పాన్ ప్రతులను కూడా జత చేయాలి. పత్రాలు పరిశీలించిన తర్వాత ప్రాంతీయ భవిష్యనిధి కమిషనర్ మీఖాతాను మాన్యువల్‌గా యాక్టివేట్ చేస్తారు. ఉద్యోగం మారిన వెంటనే పాత పీఎఫ్ నిల్వలను కొత్త ఖాతాకు మార్చుకోవడం మంచిది. దీంతో ఖాతా నిలిచిపోకుండా ఉంటుంది.అలాగే ఇ-పాస్‌బుక్‌ను తరచుగా పరిశీలిస్తూ యూఏఎన్ పాస్ వర్డ్ కూడా మారుస్తూ ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.