LOADING...
Phone pe: ఫోన్‌పే ఐపీఓకు తాత్కాలిక బ్రేక్‌.. మార్కెట్‌ స్థిరపడితే మళ్లీ లిస్టింగ్
ఫోన్‌పే ఐపీఓకు తాత్కాలిక బ్రేక్‌.. మార్కెట్‌ స్థిరపడితే మళ్లీ లిస్టింగ్

Phone pe: ఫోన్‌పే ఐపీఓకు తాత్కాలిక బ్రేక్‌.. మార్కెట్‌ స్థిరపడితే మళ్లీ లిస్టింగ్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 16, 2026
02:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

వాల్‌మార్ట్‌ మద్దతుతో కొనసాగుతున్న ఫిన్‌టెక్‌ దిగ్గజం ఫోన్‌ పే ఐపీఓకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. సెబీ నుంచి ఇప్పటికే అనుమతి వచ్చినప్పటికీ, మార్కెట్‌ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని లిస్టింగ్‌ను కొంతకాలం వాయిదా వేసినట్లు సంస్థ వెల్లడించింది. కంపెనీ సీఈఓ సమీర్‌ నిగమ్‌ ప్రకారం, భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఐపీఓ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపినట్లు చెప్పారు. మార్కెట్లు మళ్లీ స్థిరపడిన తర్వాత లిస్టింగ్‌ ప్రక్రియను పునఃప్రారంభిస్తామన్నారు. పరిస్థితులు త్వరలోనే మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

వివరాలు 

డిజిటల్‌ చెల్లింపుల్లో అగ్రగామి ఫోన్‌పే

ఫోన్‌పే 2016లో డిజిటల్‌ పేమెంట్‌ యాప్‌గా ప్రారంభమైంది. 2025 సెప్టెంబర్‌ 30 నాటికి ఈ వేదికకు 65 కోట్ల రిజిస్టర్డ్‌ వినియోగదారులు, 4.7 కోట్లకు పైగా వ్యాపార భాగస్వాములు ఉన్నారు. దీంతో డిజిటల్‌ చెల్లింపుల రంగంలో ఇది అగ్రస్థానంలో నిలిచింది. చెల్లింపుల సేవలకే పరిమితం కాకుండా, ఫోన్‌పే ఇన్సూరెన్స్‌ అగ్రిగేటర్‌గా కూడా సేవలు అందిస్తోంది. అదేవిధంగా 'షేర్‌మార్కెట్‌' స్టాక్‌బ్రోకింగ్‌ యాప్‌, గూగుల్‌కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న 'ఇండస్‌ యాప్‌ స్టోర్‌' వంటి వేదికలూ సంస్థ పరిధిలో ఉన్నాయి.

వివరాలు 

రూ.10వేల కోట్లకు పైగా సమీకరణ లక్ష్యం

ప్రస్తుతం డిజిటల్‌ చెల్లింపుల్లో బలమైన స్థానం కలిగిన ఫోన్‌పే.. ఐపీఓ ద్వారా రూ.10వేల కోట్లకు పైగా నిధులు సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు అవసరమైన సెబీ ఆమోదం కూడా లభించింది. అయితే పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, వాటి ప్రభావంతో మార్కెట్లలో ఏర్పడిన ఒడుదొడుకుల కారణంగా ఈ ప్రక్రియకు తాత్కాలిక విరామం పడింది.

Advertisement

వివరాలు 

మరికొన్ని ఐపీఓలపైనా ప్రభావం

ఫోన్‌పే ఒక్కటే కాదు, మరికొన్ని సంస్థల ఐపీఓలు కూడా ఆలస్యం కావచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం దాదాపు 141 కంపెనీలు నియంత్రణ సంస్థల అనుమతులు పొంది లిస్టింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ఇవి కలిపి సుమారు రూ.1.64 లక్షల కోట్లు సమీకరించే అవకాశముంది. ఇందులో సుమారు 80 కంపెనీలకు పబ్లిక్‌ ఇష్యూ తీసుకురావడానికి 3 నుంచి 9 నెలల గడువు ఉంది. అయితే ప్రస్తుత మార్కెట్‌ అస్థిరతను దృష్టిలో పెట్టుకుని అవి కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement