Loading...
Smartphones: ఏఐ ప్రభావంతో స్మార్ట్‌ఫోన్ల ధరలకు రెక్కలు.. 30 శాతం వరకు పెరుగుదల!
ఏఐ ప్రభావంతో స్మార్ట్‌ఫోన్ల ధరలకు రెక్కలు.. 30 శాతం వరకు పెరుగుదల!

Smartphones: ఏఐ ప్రభావంతో స్మార్ట్‌ఫోన్ల ధరలకు రెక్కలు.. 30 శాతం వరకు పెరుగుదల!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 06, 2026
08:42 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ వేగంగా విస్తరిస్తుండటంతో ఇప్పుడు దాని ప్రభావం స్మార్ట్‌ ఫోన్ మార్కెట్‌పై పడుతోంది. ముఖ్యంగా కొత్తగా స్మార్ట్‌ ఫోన్ కొనాలనుకునే సామాన్యులకు ఇది భారంగా మారనుంది. రానున్న రోజుల్లో స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా పెరిగే అవకాశముందని ప్రముఖ అంతర్జాతీయ పరిశోధనా సంస్థ జెఫరీస్ తన తాజా నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా బడ్జెట్ ఆండ్రాయిడ్ ఫోన్ల ధరలు ఏకంగా 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.

వివరాలు 

మెమరీ చిప్‌లకు పెరిగిన డిమాండ్

ఏఐ టెక్నాలజీకి కీలకమైన ప్రాసెసర్లు, మెమరీ చిప్‌లకు ప్రస్తుతం భారీగా డిమాండ్ ఏర్పడుతోంది.

జెమిని, చాట్‌జీపీటీ వంటి ఏఐ అప్లికేషన్ల వినియోగం పెరుగుతుండటంతో గూగుల్, ఇతర టెక్ దిగ్గజాలు భారీ డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి.

వీటి నిర్వహణ, విస్తరణ కోసం పెద్ద మొత్తంలో మెమరీ చిప్‌లను కొనుగోలు చేస్తున్నాయి.

దీంతో స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలకు అవసరమైన చిప్‌ల కొరత ఏర్పడుతోంది. దీని ప్రభావంతో మెమరీ చిప్‌ల ధరలు భారీగా పెరిగాయి.

గతంలో ఒక మెమరీ యూనిట్ ధర 20 డాలర్లు (సుమారు రూ.1,680) ఉండేది.

ప్రస్తుతం అది మూడు రెట్లు పెరిగి 60 నుంచి 65 డాలర్లకు (సుమారు రూ.5,000) చేరింది. ఈ పెరుగుదల స్మార్ట్‌ఫోన్ తయారీ వ్యయాన్ని గణనీయంగా పెంచుతోంది.

వివరాలు 

బడ్జెట్ ఫోన్లపైనే అధిక ప్రభావం

మెమరీ చిప్‌ల ధరల పెరుగుదల ప్రభావం ముఖ్యంగా రూ.16 వేల లోపు ధర కలిగిన స్మార్ట్‌ఫోన్లపై ఎక్కువగా ఉండనుంది.

ఎందుకంటే ఈ విభాగంలోని ఫోన్ల తయారీ ఖర్చులో దాదాపు 60 శాతం మెమరీ చిప్‌లకే వెచ్చించాల్సి వస్తోంది.

దీంతో పెరిగిన తయారీ వ్యయాన్ని భరించడం కంపెనీలకు కష్టంగా మారుతోంది.

ఈ భారాన్ని తగ్గించుకునేందుకు స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు ధరలను పెంచే అవకాశం ఉంది.

ఫలితంగా వినియోగదారులపై అదనపు భారం పడనుంది. ధరలు పెరిగితే చాలామంది కొత్త ఫోన్ల కొనుగోలును వాయిదా వేసుకోవచ్చని జెఫరీస్ అంచనా వేసింది.

మరికొందరు తక్కువ ధరకు లభించే సెకండ్ హ్యాండ్ లేదా రీఫర్బిష్డ్ ఫోన్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపవచ్చని తెలిపింది.

ADVERTISEMENT

వివరాలు 

ప్రీమియం ఫోన్లకు పెరగనున్న ఆదరణ

ఈ పరిణామాలు ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ తీరును కూడా మార్చనున్నాయి.

200 డాలర్ల లోపు ధర కలిగిన ఫోన్ల మార్కెట్ వాటా ప్రస్తుతం 42 శాతంగా ఉండగా, అది 24 శాతానికి తగ్గే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.

మరోవైపు 600 డాలర్ల కంటే ఎక్కువ ధర కలిగిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల మార్కెట్ వాటా 29 శాతం నుంచి 38 శాతానికి పెరగవచ్చని అంచనా వేసింది.

తయారీ ఖర్చులను నియంత్రించుకునేందుకు కొన్ని కంపెనీలు కొత్త ఫోన్లలో పాత తరం ప్రాసెసర్లను ఉపయోగించే అవకాశం ఉందని జెఫరీస్ తెలిపింది.

అంతేకాకుండా తక్కువ ధరలో అందుబాటులో ఉండే మోడళ్ల సంఖ్యను కూడా తగ్గించవచ్చని పేర్కొంది.

ADVERTISEMENT

వివరాలు 

2027 వరకు కొనసాగనున్న ధరల ఒత్తిడి

ఏఐ రంగంలో పెట్టుబడులు మరింత పెరగనున్న నేపథ్యంలో మెమరీ చిప్‌ల కొరత ఇప్పట్లో తగ్గకపోవచ్చని నివేదిక స్పష్టం చేసింది.

ఏఐ కంపెనీలు 2027 నాటికి సుమారు 1.5 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నాయని అంచనా వేసింది.

దీంతో మెమరీ చిప్‌ల ధరలు 2027 మధ్యకాలం వరకు గరిష్ఠ స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉందని తెలిపింది.

ఇదే జరిగితే స్మార్ట్‌ఫోన్ ధరలు కూడా మరికొంతకాలం సామాన్యులకు భారంగా మారే పరిస్థితి కనిపిస్తోంది.

ADVERTISEMENT