LOADING...
Price Hike Alert: డాలర్ ముందు వణికిన రూపాయి.. జవవరి నుంచి పెరగనున్న వీటి ధరలు..
డాలర్ ముందు వణికిన రూపాయి.. జవవరి నుంచి పెరగనున్న వీటి ధరలు..

Price Hike Alert: డాలర్ ముందు వణికిన రూపాయి.. జవవరి నుంచి పెరగనున్న వీటి ధరలు..

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 16, 2025
12:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ ఆర్థిక చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడూ ఎదురుకాని కఠిన పరిస్థితిని ప్రస్తుతం రూపాయి ఎదుర్కొంటోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారక విలువ నిరంతరం పడిపోతూ పాతాళ స్థాయికి చేరుతోంది. ఆల్‌టైమ్ రికార్డు కనిష్టానికి చేరుకుంటూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. సోమవారం 90.78 వద్ద ముగిసిన రూపాయి, మంగళవారం ఒక్కసారిగా ఐదు పైసలు క్షీణించి 90.83 వద్ద స్థిరపడింది. ఇదే రూపాయి జీవితకాలంలో నమోదైన అత్యల్ప స్థాయిగా మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. గత కొన్ని రోజులుగా ఎలాంటి విరామం లేకుండా రూపాయి పతనం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే రానున్న రోజుల్లో మరింత దిగజారే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

వివరాలు 

ఏఏ వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది..? 

దీని ప్రభావం నేరుగా ప్రజలపై పడనుంది. ముఖ్యంగా విదేశాల నుంచి దిగుమతి చేసే వస్తువుల ధరలు పెరగడం వల్ల సామాన్యుల జీవన వ్యయంపై భారమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మొబైల్ ఫోన్లు, టెలివిజన్ల తయారీలో ఉపయోగించే చిప్స్, సర్క్యూట్ బోర్డులు వంటి కీలక భాగాలను భారత్ ప్రధానంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. రూపాయి విలువ పడిపోవడంతో తయారీ కంపెనీల ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ కారణంగా టీవీలు, స్మార్ట్‌ఫోన్ల ధరలను పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. జనవరి నుంచి టెలివిజన్ ధరలు 3 నుంచి 4 శాతం వరకు పెరిగే అవకాశముందని అంచనా. మొబైల్ ఫోన్ల ధరలు కూడా గణనీయంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

వివరాలు 

ఏఏ వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది..? 

అదే సమయంలో టెలికాం కంపెనీలు ప్రీపెయిడ్ రీచార్జ్ ఛార్జీలను పెంచేందుకు నిర్ణయం తీసుకుంటున్నాయి. దీని వల్ల మొబైల్ వినియోగ ఖర్చులు సామాన్యులకు మరింత భారంగా మారనున్నాయి. మరోవైపు గత సెప్టెంబర్‌లో 32 అంగుళాలకు పైగా ఉన్న టీవీలపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని 28శాతం నుంచి 18శాతానికి తగ్గించింది. దీనివల్ల అప్పట్లో టీవీల ధరలు సుమారు రూ.4,500 వరకు తగ్గాయి. అయితే తాజా పరిస్థితుల్లో ఆ తగ్గింపు ప్రయోజనం క్రమంగా తగ్గిపోయి ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉంది. ఇక విదేశాల నుంచి దిగుమతి అయ్యే కార్ల ధరలు కూడా పెరగనున్నాయి. అంతేకాదు ఇంట్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్ వస్తువులైన ఎయిర్ కండిషనర్లు,వాషింగ్ మెషిన్లు,ఫ్రిజ్‌లు వంటి ఉత్పత్తుల ధరలు కూడా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Advertisement

వివరాలు 

రూపాయి పతనానికి కారణాలివే.. 

రూపాయి విలువ భారీగా పడిపోవడానికి పలు కారణాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా ట్రంప్ విధించిన టారిఫ్‌లు ఒక కారణంగా నిలుస్తున్నాయి. ఈ పరిస్థితుల వల్ల భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ పెట్టుబడిదారులు ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే ఉన్న పెట్టుబడులను కూడా వారు తమ దేశాలకు తరలిస్తున్నారు. ఫలితంగా భారత స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ నిధులు భారీగా వెనక్కి వెళ్లిపోతున్నాయి.

Advertisement

వివరాలు 

రూపాయి పతనానికి కారణాలివే.. 

అదే సమయంలో భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై స్పష్టత లేకపోవడం కూడా రూపాయి మీద ప్రతికూల ప్రభావం చూపుతోంది. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ప్రతిసారీ వాయిదా పడుతూనే వస్తోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇవన్నీ కలిసి రూపాయి విలువ క్షీణించడానికి ప్రధాన కారణాలుగా మారాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Advertisement