Putin to visit India today:పుతిన్ పర్యటన ఎఫెక్ట్.. రక్షణ స్టాక్స్‌లో కొనుగోళ్ల జోరు.. HAL,BDL,BEL లాభపడే అవకాశం ఉందన్నవిశ్లేషకులు
ఈ వార్తాకథనం ఏంటి
డిసెంబర్ 4న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 23వ భారత్-రష్యా వార్షిక సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కి రానున్నడంతో,దేశీయ రక్షణ రంగానికి చెందిన షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. భారత్-రష్యా మధ్య కొత్త రక్షణ ఒప్పందాలపై ఆశలు పెరగడంతో కొన్ని ప్రముఖ డిఫెన్స్ కంపెనీలకు ఈ పరిణామం మేలు చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నాలుగేళ్ల విరామం తర్వాత తొలిసారి ఢిల్లీకి వస్తున్న పుతిన్ తోపాటు రష్యా రక్షణమంత్రి ఆండ్రే బెలౌసోవ్‌తో పాటు వ్యాపార,పరిశ్రమ రంగాలకు చెందిన పెద్ద బృందం కూడా భారత్‌కి వస్తోంది. ఈ పర్యటనతో భారత్-రష్యా మధ్య రక్షణ సంబంధాలు మళ్లీ బలపడే అవకాశాలు ఉన్నాయని స్టాక్‌కార్ట్ సీఈవో ప్రణయ్ అగర్వాల్ తెలిపారు.
వివరాలు
అదనపు S-400 గగన రక్షణ క్షిపణి రెజిమెంట్ల కొనుగోలు
వాయుసేన రక్షణ వ్యవస్థల విస్తరణ,ఆధునిక క్షిపణి సాంకేతికతల ప్రవేశం, స్టెల్త్ యుద్ధ విమానాల కొనుగోలు, సంయుక్త లాజిస్టిక్స్ ఒప్పందాలపై చర్చలు జరగొచ్చని అంచనా వేశారు. బోనాంజా సంస్థ సీనియర్ అనలిస్టు నితిన్ జైన్ మాట్లాడుతూ భారత్ వ్యూహాత్మక సైనిక సామర్థ్యాలను మెరుగుపరిచే దిశగా ఈ సదస్సు కీలకమని చెప్పారు. ముఖ్యంగా అదనపు S-400 గగన రక్షణ క్షిపణి రెజిమెంట్ల కొనుగోలు అంశం ప్రాధాన్యత పొందనుందని, ఇందులో సాంకేతిక బదిలీ ఒప్పందాల ద్వారా భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL)వంటి సంస్థలు దేశీయంగా విడిభాగాల తయారీ, అసెంబ్లీలో భాగస్వాములు అవుతారని తెలిపారు. భారత్‌లోని 29 యుద్ధవిమాన దళాలలో ఎక్కువగా సుఖోయ్-30 విమానాలే ఉండగా,తాజా సు-57 స్టెల్త్ ఫైటర్‌ను కూడా రష్యా ఆఫర్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
వివరాలు
నావికాదళ రంగంలో సహకారం ఏర్పడితే..
విమానాల తయారీ, నిర్వహణలో ప్రత్యేకత ఉన్న హిందూస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)కి ఈ ఒప్పందాలతో పెద్ద అవకాశాలు ఏర్పడుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. HAL, BDL, భారత్ ఎలక్ట్రానిక్స్ (BEL) వంటి రక్షణ షేర్లు కలిసి ఉత్పత్తి కార్యక్రమాలు, కొత్త ఒప్పందాల వల్ల లాభపడే అవకాశాలున్నాయని ప్రైమస్ పార్ట్నర్స్ ఎండీ శ్రవణ్ శెట్టి తెలిపారు. నావికాదళ రంగంలో సహకారం ఏర్పడితే మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ వంటి కంపెనీలకూ మేలు జరుగుతుందన్నారు. గత మూడేళ్లలో నిఫ్టీ డిఫెన్స్ సూచీ దాదాపు 300 శాతం ఎగబాకిందని, భవిష్యత్‌లో వేగం కొంత తగ్గినా వృద్ధి కొనసాగుతుందని అంచనా వేశారు.
వివరాలు
మళ్లీ లాభాల బాట పట్టిన నిఫ్టీ ఇండియా డిఫెన్స్ సూచీ
డిసెంబర్ 4 ఉదయం 10.35 గంటల సమయంలో నిఫ్టీ ఇండియా డిఫెన్స్ సూచీ సుమారు 0.5 శాతం పెరిగి 7,845.55 వద్ద ట్రేడవుతూ వరుసగా రెండు రోజులు నష్టాలు నమోదైన తర్వాత సూచీ మళ్లీ లాభాల బాట పట్టింది. యూనిమెక్ ఏరోస్పేస్ షేర్లు దాదాపు 4 శాతం లాభాలతో ముందుండగా, మిధానీ షేర్లు 1 శాతం పైగా పెరిగాయి. డేటా పాటర్న్స్, పారాస్ డిఫెన్స్, BDL, భారత్ ఫోర్జ్, BEML, BEL, HAL, కోచిన్ షిప్‌యార్డ్ షేర్లు సుమారు 1 శాతం చొప్పున లాభాల్లో ఉన్నాయి. గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ షేర్లు స్తబ్ధంగా ఉండగా, మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ షేర్లు సుమారు 1 శాతం తగ్గుదలతో ట్రేడయ్యాయి.