MEIL Group: మేఘా ఇంజినీరింగ్ గ్రూప్ మొత్తం పగ్గాలు కృష్ణారెడ్డికి.. రూ.14 వేల కోట్లతో కుటుంబ ఆస్తుల ఒప్పందం!
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ మౌలిక సదుపాయాలు, ఇంజినీరింగ్ సేవల సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) గ్రూప్ మొత్తం బాధ్యతలు ఇప్పుడు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణారెడ్డి చేతుల్లోకి వెళ్లినట్లు సమాచారం. సంస్థ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పామిరెడ్డి పిచ్చిరెడ్డి.. కృష్ణారెడ్డికి మేనమామ అవుతారు. వీరిద్దరి మధ్య కుదిరినట్లు చెబుతున్న కుటుంబ ఆస్తుల పరిష్కార ఒప్పందంలో భాగంగా కృష్ణారెడ్డి దాదాపు రూ.14,000 కోట్లు చెల్లించి గ్రూప్ మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
వివరాలు
మేఘా గ్రూప్ విలువ దాదాపు రూ.లక్షకోట్లు
ఈ ఒప్పందం కోసం ఇప్పటికే కొంత మొత్తాన్ని చెల్లించగా..మిగిలిన మొత్తంలో భాగంగా తాజాగా అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలైన డీకే, హెచ్‌హెచ్, వర్డే పార్ట్‌నర్స్ నుంచి 700మిలియన్ డాలర్లు (సుమారు రూ.6,540 కోట్లు)సమీకరించినట్లు తెలుస్తోంది.
ఈ లావాదేవీ సందర్భంగా ఆయా సంస్థలు మేఘా గ్రూప్ విలువను దాదాపు రూ.లక్షకోట్లుగా అంచనా వేసినట్లు సమాచారం.
కీలక రంగాల్లో విస్తరించిన వ్యాపార కార్యకలాపాలు, భారీ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేయగల సామర్థ్యం,భవిష్యత్తులో మరింత వృద్ధి సాధించే అవకాశాలను పరిగణనలోకి తీసుకుని ఈ పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది.
మేఘా గ్రూప్ ఆధీనంలో మొత్తం 1,975కిలోమీటర్ల మేర రహదారి ప్రాజెక్టులు ఉన్నాయి.
వివరాలు
మూడు దశాబ్దాలుగా మౌలిక రంగంలో ప్రస్థానం
వీటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,కేరళ రాష్ట్రాల్లో ఉన్న ఏడు రహదారి ప్రాజెక్టులను సంబంధిత సంస్థలకు బదిలీ చేసేలా తాజా నిధుల సమీకరణ ఒప్పందం కుదిరినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
మేఘా ఇంజినీరింగ్ సంస్థ గత మూడు దశాబ్దాలుగా మౌలిక సదుపాయాల రంగంలో సేవలందిస్తోంది.
దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ తన కార్యకలాపాలను విస్తరించింది.
ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాల్లో భారీ ప్రాజెక్టులను చేపడుతోంది. ఇందులో భాగంగా దేశంలో పలు ప్రతిష్ఠాత్మక నిర్మాణాల్లో భాగస్వామిగా వ్యవహరిస్తోంది.
వివరాలు
ఈ కీలక ప్రాజెక్టుల్లో భాగస్వామిగా మేఘా ఇంజినీరింగ్ గ్రూప్
జమ్మూకశ్మీర్‌లో నిర్మించిన ప్రతిష్ఠాత్మక జోజిలా సొరంగం, ముంబయి కోస్టల్ రోడ్, థానే-బోరివలి జంట సొరంగ మార్గం వంటి కీలక ప్రాజెక్టుల్లో సంస్థ భాగస్వామిగా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో పోలవరం ప్రాజెక్టు, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వంటి భారీ నిర్మాణాల్లోనూ కీలక పాత్ర పోషించింది.
వివిధ రాష్ట్రాల్లో జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు ఆనకట్టలు, పోర్టులు, అణువిద్యుత్ కేంద్రాలు, భారీ పైపులైన్ల నిర్మాణం వంటి విభిన్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపడుతోంది.
మరోవైపు ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ద్వారా విద్యుత్ బస్సులు, ట్రక్కుల తయారీ రంగంలోనూ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రక్షణ రంగానికి అవసరమైన పరికరాల తయారీలో కూడా భాగస్వామిగా ఉంది.
వివరాలు
ఇంధన రంగంలోనూ భారీ పెట్టుబడులు
మేఘాగ్రూప్ అనుబంధ సంస్థల్లో ఇంధన రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈపీటీఎల్ కూడా కీలకంగా ఉంది.
ఈ సంస్థ విలువను దాదాపు రూ.14,000కోట్లుగా అంచనా వేసినట్లు సమాచారం.
దీని ఆధీనంలో 9,110మెగావాట్లకు పైగా సామర్థ్యం కలిగిన పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి.
వీటితో పాటు సుమారు 3,000మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్రాజెక్టులు నిర్వహిస్తోంది.
700 మెగావాట్లకు పైగా సామర్థ్యం కలిగిన అణు విద్యుత్ ప్రాజెక్టులోనూ భాగస్వామిగా ఉంది.
విద్యుత్ రంగానికే పరిమితం కాకుండా డ్రిల్లింగ్, తయారీ,నగర గ్యాస్ పంపిణీ వంటి విభాగాల్లోనూ మేఘా గ్రూప్ తన కార్యకలాపాలను విస్తరించింది.
మౌలిక సదుపాయాలు,ఇంధనం,రవాణా,రక్షణ రంగాల్లో విస్తరించిన ఈ వ్యాపార కార్యకలాపాల నేపథ్యంలో గ్రూప్ యాజమాన్య మార్పు, తాజా పెట్టుబడుల సమీకరణ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.