RBI: బ్యాంకుల దోపిడీకి ఆర్‌బీఐ చెక్.. ఇక బలవంతంగా ఇన్సూరెన్స్, లోన్లు అమ్మితే కఠిన చర్యలు!
ఈ వార్తాకథనం ఏంటి
హోం లోన్ కోసం బ్యాంకుకు వెళితే బలవంతంగా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని ఒత్తిడి చేయడం, మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లో అనవసరంగా వ్యక్తిగత రుణాల ప్రకటనలు చూపించడం వంటి చర్యలకు ఇక చెక్ పడనుంది. ఈ తరహా అక్రమ విక్రయాలను అరికట్టేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్ బి ఐ) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. జూన్ 15, 2026న ప్రకటించిన ఈ నిబంధనలు అన్ని వాణిజ్య బ్యాంకులకు వర్తిస్తాయి. ఇవి 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
వివరాలు
మిస్ సెల్లింగ్ అంటే ఏమిటి?
కస్టమర్‌కు అవసరం లేని లేదా సరిపోని ఆర్థిక ఉత్పత్తులను మోసపూరితంగా లేదా ఒత్తిడి చేసి విక్రయించడాన్ని 'మిస్ సెల్లింగ్'గా ఆర్‌బీఐ నిర్వచించింది.తొలిసారిగా దీనికి చట్టబద్ధమైన నిర్వచనం ఇచ్చింది.
1. కింది చర్యలు మిస్ సెల్లింగ్‌గా పరిగణించబడతాయి:
2. కస్టమర్‌కు అనుకూలం కాని ఉత్పత్తిని విక్రయించడం.
3. అసంపూర్ణ లేదా తప్పుడు సమాచారం ఇచ్చి ప్రోడక్ట్'ని అమ్మడం.
4. కస్టమర్ స్పష్టమైన అంగీకారం లేకుండా విక్రయించడం.
5. ఒక ప్రోడక్ట్ కోసం మరో ప్రోడక్ట్'ని తప్పనిసరి చేయడం.
6. ఇతర ఆర్థిక నియంత్రణ సంస్థలు మిస్ సెల్లింగ్‌గా గుర్తించిన పద్ధతులు అనుసరించడం.
ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే బ్యాంకు కస్టమర్ చెల్లించిన మొత్తం తిరిగి ఇవ్వడంతో పాటు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
వివరాలు
లోన్‌తో పాటు ఇన్సూరెన్స్ తప్పనిసరి కాదు
ఒప్పంద పత్రం అందిన 30 రోజుల్లో కస్టమర్ ఫిర్యాదు చేయవచ్చు.
హోం లోన్ లేదా వ్యక్తిగత రుణం తీసుకునే సమయంలో బ్యాంకులు తమ భాగస్వామ్య సంస్థల ఇన్సూరెన్స్ పాలసీలను తప్పనిసరిగా కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయడం సాధారణంగా జరుగుతోంది. దీనిపై ఆర్‌బీఐ అధికారికంగా నిషేధం విధించింది.
బ్యాంకు రుణ భద్రత కోసం ఇన్సూరెన్స్ అవసరమని భావిస్తే సూచించవచ్చు. అయితే కస్టమర్ తనకు నచ్చిన ఏ ఇన్సూరెన్స్ సంస్థ నుంచైనా పాలసీ తీసుకునే స్వేచ్ఛ ఉండాలి. బ్యాంకు సూచించిన సంస్థ నుంచే కొనాలనే నిబంధన ఉండకూడదు.
వివరాలు
కస్టమర్ అనుమతికి కొత్త నిర్వచనం
ఇప్పటి వరకు చిన్న అక్షరాల్లో రాసిన షరతులు లేదా ముందుగానే టిక్ చేసిన బాక్సుల ద్వారా బ్యాంకులు కస్టమర్ల అనుమతిని తీసుకున్నట్లు భావించేవి. ఇకపై అలాంటి పద్ధతులు చెల్లవు. ప్రతి ఆర్థిక ఉత్పత్తికి ప్రత్యేకంగా కస్టమర్ స్పష్టమైన అనుమతి తీసుకోవాలి.
ఒక ఉత్పత్తికి ఇచ్చిన అంగీకారాన్ని మరో ఉత్పత్తికి వర్తింపజేయకూడదు.
డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో డిఫాల్ట్ ఆప్షన్ 'కాదు' లేదా 'నేను అంగీకరించను' అనే విధంగా ఉండాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
కస్టమర్ స్వయంగా అంగీకరిస్తేనే ఉత్పత్తిని విక్రయించాలి.
బ్యాంకులు కస్టమర్ అనుమతికి సంబంధించిన రికార్డులను ఒప్పందం ముగిసిన తర్వాత కనీసం ఏడాది పాటు భద్రపరచాలి.
అలాగే ఉత్పత్తికి సంబంధించిన ఛార్జీలు, వడ్డీ రేట్లు, రిస్కులు, లాక్-ఇన్ పీరియడ్, నిష్క్రమణ ఛార్జీలను స్పష్టంగా వివరించాలి.
వివరాలు
డీఎస్‌ఏలు, డీఎంఏలపై కూడా ఆర్‌బీఐ నిఘా
బ్యాంకుల తరఫున పనిచేసే డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్లు (DSAs), డైరెక్ట్ మార్కెటింగ్ ఏజెంట్లు (DMAs) కూడా ఇక ఆర్‌బీఐ నియంత్రణలోకి రానున్నారు.
బ్యాంకులు తమ వెబ్‌సైట్‌లో గుర్తింపు పొందిన ఏజెంట్ల జాబితాను ఎప్పటికప్పుడు నవీకరించాలి.
బ్యాంకు ఉద్యోగులకు, ఏజెంట్లకు స్పష్టమైన గుర్తింపు ఉండాలి. ఏజెంట్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే కస్టమర్లను సంప్రదించాలి.
ముందస్తు అనుమతి లేకుండా ఇల్లు లేదా కార్యాలయానికి వెళ్లకూడదు. తాము బ్యాంకు ఉద్యోగులమని చెప్పి మోసం చేయరాదు.
వివరాలు
ప్రోడక్ట్ కస్టమర్‌కు సరిపోతుందా లేదా పరిశీలన తప్పనిసరి
ఏదైనా క్లిష్టమైన ఆర్థిక ఉత్పత్తిని విక్రయించే ముందు కస్టమర్ వయస్సు, ఆదాయం, ఆర్థిక పరిజ్ఞానం, రిస్క్ తీసుకునే సామర్థ్యం వంటి అంశాలను బ్యాంకులు పరిశీలించాలి.
ఉత్పత్తికి సంబంధించిన పత్రాలు స్థానిక భాషలో లేదా కస్టమర్‌కు అర్థమయ్యే భాషలో అందుబాటులో ఉండాలి.
ప్రతి ఉత్పత్తికి ప్రత్యేక దరఖాస్తు పత్రం లేదా డిజిటల్ విభాగం ఉండాలి.
విక్రయం జరిగిన 30 రోజుల్లో కస్టమర్ నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని ఆ వివరాలను బ్యాంకులు తమ విధానాల మెరుగుదలకు ఉపయోగించాలి.
వివరాలు
ఇక ఈ 11 డిజిటల్ మోసాలకు నో..
బ్యాంకులు, వాటి ఏజెంట్లు వినియోగిస్తున్న 'డార్క్ ప్యాటర్న్స్' అనే డిజిటల్ మోసపూరిత పద్ధతులను ఆర్‌బీఐ నిషేధించింది. అందులో ముఖ్యమైనవి:
త్వరగా నిర్ణయం తీసుకునేలా కౌంట్‌డౌన్ టైమర్లు చూపించడం.
కస్టమర్ అనుమతి లేకుండా ఇన్సూరెన్స్ జోడించడం.
తిరస్కరించే బటన్‌ను తప్పుగా చూపించడం.
యాప్‌లో బలవంతపు పాప్‌అప్‌లు చూపించడం.
సులభంగా సభ్యత్వం ఇచ్చి, రద్దు చేయడం కష్టతరం చేయడం.
కొన్ని ఎంపికలను ఆకర్షణీయంగా చూపించి కస్టమర్‌ను ప్రభావితం చేయడం.
తక్కువ వడ్డీ రేటు చెప్పి తర్వాత ఎక్కువ వసూలు చేయడం.
చివరి దశలో అదనపు ఛార్జీలు వెల్లడించడం.
ప్రకటనలను అత్యవసర నోటిఫికేషన్లలా చూపించడం.
తిరస్కరించిన తర్వాత కూడా పదేపదే అనుమతులు కోరడం.
గందరగోళపరిచే భాషతో కస్టమర్‌ను పొరపాటున అంగీకరించేలా చేయడం.
వివరాలు
కేంద్ర ఆర్థిక మంత్రి కూడా ఆందోళన
ఈ విధానాలను గుర్తించి తొలగించేందుకు బ్యాంకులు క్రమం తప్పకుండా అంతర్గత ఆడిట్లు నిర్వహించాలి.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే బ్యాంకుల ఇన్సూరెన్స్ విక్రయాలపై ఆందోళన వ్యక్తం చేశారు.
అవసరం లేని ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్'ను కస్టమర్లపై రుద్దడం వల్ల రుణ భారం పరోక్షంగా పెరుగుతోందని ఆమె పేర్కొన్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఆర్థిక ఉత్పత్తుల మిస్ సెల్లింగ్‌ను భారతీయ న్యాయ సంహిత (BNS) ప్రకారం నేరంగా పరిగణిస్తున్నట్లు ఆమె తెలిపారు.
వివరాలు
2027 జనవరి 1 నుంచి కస్టమర్లకు లాభమే
కొత్త నిబంధనల ప్రకారం హోం లోన్ తీసుకునే వ్యక్తిని బ్యాంకు తనకు అనుబంధంగా ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీ కొనుగోలు చేయాలని బలవంతం చేయలేరు.
ఫిక్స్‌డ్ డిపాజిట్ కోసం వచ్చిన వ్యక్తికి యూలిప్ వంటి ఉత్పత్తులను విక్రయించాలంటే స్పష్టమైన అనుమతి, అర్హత అంచనా తప్పనిసరి.
రాత్రి 7 గంటల తర్వాత ఫోన్ చేయడం, అనుమతి లేకుండా ఇంటికి రావడం, డిజిటల్ మాయాజాలంతో ఉత్పత్తులు అమ్మడం నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడుతుంది.
ఈ చర్యలకు బ్యాంకులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. డిసెంబర్ 31లోపు బ్యాంకులు తమ విధానాలు, ఉద్యోగులు-ఏజెంట్ల ప్రవర్తనా నియమావళి, డిజిటల్ అనుమతి వ్యవస్థలు, ఫీడ్‌బ్యాక్ విధానాలు, డార్క్ ప్యాటర్న్ నియంత్రణ వ్యవస్థలను సిద్ధం చేసుకోవాలని ఆర్‌బీఐ ఆదేశించింది.