LOADING...
RBI Interest Rates: శుభవార్త చెప్పిన ఆర్‌బీఐ.. వడ్డీ రేట్లపై మరో 0.25శాతం కోత
శుభవార్త చెప్పిన ఆర్‌బీఐ.. వడ్డీ రేట్లపై మరో 0.25శాతం కోత

RBI Interest Rates: శుభవార్త చెప్పిన ఆర్‌బీఐ.. వడ్డీ రేట్లపై మరో 0.25శాతం కోత

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 05, 2025
10:12 am

ఈ వార్తాకథనం ఏంటి

చాలా రోజుల విరామం తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)నుంచి మరో శుభవార్త వచ్చింది. కీలక వడ్డీ రేట్లను మరోసారి 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ఆర్ బి ఐ ప్రకటించింది. దీంతో ప్రస్తుతం రెపో రేటు 5.25 శాతానికి చేరింది.మూడు రోజుల పాటు నిర్వహించిన ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) సమావేశాల అనంతరం తీసుకున్న నిర్ణయాలను కేంద్ర బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం ఉదయం వెల్లడించారు. ఈ ఏడాదిలో వడ్డీ రేట్ల కోత విధించడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. ఇప్పటికే ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గింపులు చేయగా, జూన్‌లో జరిగిన సమీక్షలో ఏకంగా 50 బేసిస్ పాయింట్లు కోత విధించారు.

వివరాలు 

1.25 శాతం మేర వడ్డీ రేట్లు తగ్గినట్లయ్యింది

ఈ వరుస తగ్గింపుల ప్రభావంతో ఈ ఏడాది ప్రారంభంలో 6.50 శాతంగా ఉన్న రెపో రేటు ప్రస్తుతం 5.25 శాతానికి దిగొచ్చింది. మొత్తంగా చూస్తే ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 125 బేసిస్ పాయింట్లు అంటే 1.25 శాతం మేర వడ్డీ రేట్లు తగ్గినట్లయ్యింది. ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం నియంత్రణలోనే కొనసాగుతుండటం, అదే సమయంలో జీడీపీ వృద్ధి రేటు అంచనాలకు మించిన స్థాయిలో నమోదు కావడంతో వడ్డీ రేట్ల తగ్గింపుకు ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ తెలిపారు. ఈ అంశంపై కమిటీ సభ్యులందరూ ఏకగ్రీవంగా సమ్మతించినట్లు ఆయన వెల్లడించారు.

వివరాలు 

హోం లోన్, వ్యక్తిగత లోన్  వడ్డీ రేట్లు తగ్గుతాయి.

ఆర్బీఐ రెపో రేటును తగ్గించిన వెంటనే బ్యాంకులు కూడా లోన్ వడ్డీ రేట్లను తగ్గించాల్సి వస్తుంది. దీని ద్వారా హోం లోన్, వ్యక్తిగత లోన్ వంటి రుణాల వడ్డీ రేట్లు తగ్గుతాయి. దీంతో కొత్తగా రుణాలు తీసుకునే వారికి తక్కువ వడ్డీకే లోన్లు లభించనున్నాయి. అంతేకాదు, ఇప్పటికే ఫ్లోటింగ్ వడ్డీ రేటుపై లోన్లు తీసుకున్నవారు తమ నెలవారీ ఈఎంఐలను తగ్గించుకోవచ్చు లేదా లోన్ కాలపరిమితిని తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇదిలా ఉండగా, దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటోందని నవంబర్ 28న కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. జూలై నుంచి సెప్టెంబర్ వరకూ కొనసాగిన ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 8.20 శాతంగా నమోదైంది.

Advertisement

వివరాలు 

క్రమంగా తగ్గుతున్న రిటైల్ ద్రవ్యోల్బణం

ఇది వరుసగా ఆరు త్రైమాసికాల్లో అత్యధిక స్థాయి కావడం గమనార్హం. ఆర్బీఐ ముందుగా ఈ త్రైమాసికానికి 7 శాతం వృద్ధి మాత్రమే అంచనా వేసినా, వాస్తవంగా దీనికంటే మెరుగైన ఫలితాలు నమోదయ్యాయి. మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణం కూడా క్రమంగా తగ్గుతూ వస్తోంది. అక్టోబర్ నెలలో ఇది కేవలం 0.25 శాతంగా నమోదైంది. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యల్ప స్థాయి అని చెప్పవచ్చు. ఆహార పదార్థాల ధరలు తగ్గడం, జీఎస్టీ రేట్లలో కోత వంటి చర్యలు ద్రవ్యోల్బణం తగ్గడానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ ఇటీవలే వడ్డీ రేట్లపై కోత విధించే అవకాశాలపై ముందుగానే సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే.

Advertisement