LOADING...
RBI: అమెరికా-ఇరాన్‌ శాంతి ఒప్పందంతో వృద్ధికి సానుకూలతలు.. ఆర్‌బీఐ ద్వైవార్షిక ఆర్థిక స్థిరత్వ నివేదిక
ఆర్‌బీఐ ద్వైవార్షిక ఆర్థిక స్థిరత్వ నివేదిక

RBI: అమెరికా-ఇరాన్‌ శాంతి ఒప్పందంతో వృద్ధికి సానుకూలతలు.. ఆర్‌బీఐ ద్వైవార్షిక ఆర్థిక స్థిరత్వ నివేదిక

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 01, 2026
08:01 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం భారత ఆర్థిక వ్యవస్థకు అనుకూల ప్రభావం చూపే అవకాశం ఉందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌ బి ఐ) అభిప్రాయపడింది. ఈ ఒప్పందంతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గడంతో పాటు ప్రపంచ సరఫరా వ్యవస్థ మళ్లీ గాడిన పడే అవకాశముందని, అంతర్జాతీయ కమొడిటీ మార్కెట్లపై ఉన్న ఒత్తిడి కూడా క్రమంగా తగ్గుతుందని ఆర్‌బీఐ తన తాజా ఆర్థిక స్థిరత్వ నివేదిక (ఎఫ్‌ఎస్‌ఆర్‌)లో వెల్లడించింది. ఆర్‌బీఐ ప్రకారం, పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభ సమయంలో భారత్ బలమైన స్థూల ఆర్థిక పరిస్థితులతో ముందుకు సాగింది. అందువల్ల ప్రపంచ అనిశ్చితుల ప్రభావాన్ని దేశ ఆర్థిక వ్యవస్థ సమర్థంగా ఎదుర్కోగలిగిందని పేర్కొంది.

వివరాలు 

బలంగా కొనసాగుతున్న ఆర్థిక కార్యకలాపాలు

ఏప్రిల్-మే 2026 గణాంకాలు పరిశీలిస్తే దేశంలో ఆర్థిక కార్యకలాపాలు బలంగా కొనసాగుతున్నట్లు స్పష్టమవుతోందని తెలిపింది. అలాగే 2026-27 ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలోనూ వృద్ధి బలంగానే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. ఇటీవలి కాలంలో విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొంత మందగించినప్పటికీ, అవి తిరిగి పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయని నివేదిక పేర్కొంది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ తీసుకున్న తాజా చర్యలు దీనికి తోడ్పడతాయని తెలిపింది. ఈ పెట్టుబడులు కరెంట్ అకౌంట్ లోటును తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయని అభిప్రాయపడింది.

వివరాలు 

ఇంధన ధరలు, ద్రవ్యోల్బణంపై ఆందోళన

అయితే కొన్ని కీలక సవాళ్లు ఇంకా కొనసాగుతున్నాయని ఆర్‌బీఐ హెచ్చరించింది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, ఇతర కమొడిటీ ధరల పెరుగుదల భారత్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది. ఇంధన దిగుమతులపై అధికంగా ఆధారపడటం ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంది. పెరుగుతున్న ఇంధన వ్యయాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మందగమనం, ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల కారణంగా 2026-27 మూడో త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 6 శాతానికి చేరువ కావచ్చని అంచనా వేసింది. అదనంగా సబ్సిడీల భారం పెరగడం, ఎగుమతి సుంకాల్లో కోతలు, చమురు ధరల పెరుగుదలను వినియోగదారులపై పూర్తిగా మోపకుండా ప్రభుత్వం పరిమితంగానే బదిలీ చేయడం వల్ల కూడా ద్రవ్య ఒత్తిళ్లు పెరిగే అవకాశముందని తెలిపింది.

Advertisement

వివరాలు 

చరిత్రలో కనిష్ఠ స్థాయికి బ్యాంకుల ఎన్‌పీఏలు

దేశ బ్యాంకింగ్ రంగం మరింత బలోపేతమవుతోందని ఆర్‌బీఐ నివేదిక వెల్లడించింది. మార్చి 2026 నాటికి బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏలు) పలు దశాబ్దాల కనిష్ఠ స్థాయి అయిన 1.8శాతానికి తగ్గినట్లు తెలిపింది. మార్చి 2028 నాటికి అవి 1.9శాతానికి చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థకు తగినంత మూలధనం అందుబాటులో ఉన్నప్పటికీ,డిపాజిటర్లు తమ పొదుపులను మ్యూచువల్ ఫండ్లు,ఈక్విటీలు వంటి అధిక లాభాలిచ్చే పెట్టుబడుల వైపు మళ్లిస్తున్నందున బ్యాంకులు నిధుల సమీకరణలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. మరోవైపు, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సైబర్ దాడులు ఆర్థిక రంగానికి భవిష్యత్తులో పెద్ద ముప్పుగా మారే అవకాశముందని హెచ్చరించి, బలమైన సైబర్ భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని సూచించింది.

Advertisement

వివరాలు 

మోదీ పిలుపుతో తగ్గిన బంగారం దిగుమతులు

బంగారం కొనుగోళ్లను కొంతకాలం వాయిదా వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన పిలుపు ప్రభావంతో మే నెలలో పసిడి దిగుమతులు మందగించినట్లు ఆర్‌బీఐ తెలిపింది. వరుసగా మూడో నెల కూడా దిగుమతులు తగ్గి 12 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని వెల్లడించింది. అయితే 2026-27లో బంగారం ధరలు పెరిగినప్పటికీ మొత్తం దిగుమతులు గణనీయంగా పెరిగినట్లు పేర్కొంది. గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు)లో పెట్టుబడులు 2025-26లో 190 శాతం పెరిగినప్పటికీ, మే నెలలో మాత్రం నికరంగా రూ.725 కోట్ల విలువైన విక్రయాలు నమోదయ్యాయని తెలిపింది.

వివరాలు 

ఇతర ముఖ్యాంశాలు

2025-26లో భారత సెక్యూరిటీస్ మార్కెట్ పరిమాణం 2.3 శాతం తగ్గి రూ.15.32 లక్షల కోట్లకు చేరింది. డెట్ జారీల్లో తగ్గుదల ఇందుకు ప్రధాన కారణమని నివేదిక పేర్కొంది. అదే సమయంలో ఈక్విటీ మార్కెట్‌లో 366 ఐపీఓల ద్వారా సంస్థలు కలిపి రూ.1.9 లక్షల కోట్ల నిధులను సమీకరించాయి. వరుసగా ఏడు త్రైమాసికాల తర్వాత తొలిసారిగా 2026 జనవరి-మార్చి త్రైమాసికంలో సూక్ష్మ రుణాల వృద్ధి నమోదైంది. అయితే రుణాలు తీసుకున్న వారి సంఖ్య 22.7 లక్షలకు తగ్గింది. గృహ రంగానికి సంబంధించిన మొత్తం రుణాలు దేశ జీడీపీలో 45.5 శాతానికి చేరగా, మార్చి 2026 నాటికి మొత్తం రుణాల్లో గృహేతర రిటైల్ రుణాల వాటా 58.4 శాతానికి పెరిగినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.

Advertisement