RBI: రెపో రేటు యథాతదం.. వృద్ధిరేటు అంచనాల పెంపు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన కమిటీ (MPC) కీలకమైన రుణ రేటును యథాతథంగా ఉంచుతున్నట్లు గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం తెలిపారు. దింతో రెపోరేటు 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగనుంది. గత నాలుగు ద్వైమాసిక ద్రవ్య విధానాలలో కీలకమైన రుణ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. ద్రవ్యపరపతి విధాన (RBI Monetary Policy) కమిటీ సమావేశం బుధవారం ప్రారంభమైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం నాడు ఆరుగురు సభ్యుల MPC (monetary policy committee) ద్వైమాసిక ద్రవ్య విధానానికి సంబంధించిన నిర్ణయాలను వెల్లడించారు.
2023-'24 GDP 7%గా అంచనా : శక్తికాంత దాస్
RBI చివరిసారిగా ఫిబ్రవరిలో రెపో రేటును 6.5%కి పెంచింది. మే 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, గ్లోబల్ సప్లై చెయిన్‌లో ఏర్పడిన అంతరాయాల తర్వాత వడ్డీ రేట్ల పెంపు సైకిల్ ముగిసింది. గవర్నర్ శక్తికాంత దాస్ ప్రసంగంలోని కీలక అంశాలు: 2023 సంవత్సరం చివరికి వస్తుండడంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటోందన్న ఆయన దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు పటిష్ఠంగా ఉన్నాయన్నారు. ద్రవ్యోల్బణం (Inflation) తగ్గుముఖం పడుతోందన్న ఆయన ఆహార ద్రవ్యోల్బణంలో మాత్రం రిస్క్ లో కొనసాగుతోందన్నారు. ప్రస్తుత సంవత్సరం (2023-'24) GDP వృద్ధి రేటు 6.5 నుండి 7%గా అంచనా వేసినట్లు RBI గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు.
విదేశీ మారక నిల్వలు 604 బిలియన్ డాలర్లు
హాస్పిటల్స్ , ఎడ్యుకేషనల్ ఇంస్టిట్యూషన్స్ కు UPI చెల్లింపుల పరిమితిని ఆర్‌బీఐ రూ.1 లక్ష నుండి రూ.5 లక్షలకు పెంచింది. రికరింగ్ చెల్లింపుల ఇ-మ్యాండేట్ పరిమితిని రూ.15 వేల నుంచి రూ.1 లక్షకు పెంచాలని నిర్ణయించింది. డిసెంబర్ 1 2023 నాటికి భారతదేశ విదేశీ మారక నిల్వలు 604 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు ఆర్‌బీఐ తెలిపింది.