RBI: నిబంధనల ఉల్లంఘనలపై ఆర్బీఐ కొరడా.. కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు రూ.61.95 లక్షల జరిమానా!
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోని అన్ని బ్యాంకుల కార్యకలాపాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే బ్యాంకులపై అవసరమైతే జరిమానాలు విధించే అధికారం ఆర్బీఐకి ఉంది. ఈ క్రమంలో నియంత్రణ నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు ప్రైవేట్ రంగానికి చెందిన కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా విధించింది. బ్యాంకింగ్ సేవల అందుబాటు, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలు (BSBD), బిజినెస్ కరస్పాండెంట్ (BC) పాత్ర, అలాగే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు లేదా క్రెడిట్ బ్యూరోల (CIC)కు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ చర్య తీసుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది.
Details
కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు నోటీసులు జారీ
ఈ జరిమానాను ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 47A(1)(c)ను సెక్షన్ 46(4)(i)తో కలిసి, అలాగే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల (నియంత్రణ) చట్టం-2005లోని సెక్షన్ 23(4)తో చదివిన సెక్షన్ 25(1)(iii) కింద ఉన్న అధికారాలను వినియోగించి విధించినట్లు కేంద్ర బ్యాంక్ స్పష్టం చేసింది. ఈ అంశంపై ముందుగా కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు నోటీసు జారీ చేసినట్లు ఆర్బీఐ తెలిపింది. బ్యాంక్ ఇచ్చిన వివరణను పరిశీలించిన అనంతరం పలు ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించింది. ఇప్పటికే బీఎస్‌బీడీ ఖాతాలు కలిగి ఉన్న కొంతమంది కస్టమర్ల కోసం బ్యాంక్ అదనపు బీఎస్‌బీడీ ఖాతాలను తెరిచినట్లు ఆర్బీఐ గుర్తించింది. అలాగే బిజినెస్ కరస్పాండెంట్లకు అనుమతించిన కార్యకలాపాల పరిధిలో లేని పనులు నిర్వహించేందుకు బ్యాంక్ బీసీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది.
Details
బ్యాంకుకు తప్పుగా సమాచారం అందించినట్లు నిర్ధారణ
ఇదే కాకుండా, కొంతమంది రుణగ్రహీతలకు సంబంధించిన సమాచారాన్ని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు బ్యాంక్ తప్పుగా అందించినట్లు కూడా ఆర్బీఐ పేర్కొంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నియంత్రణ ఉల్లంఘనల ఆధారంగానే ఈ చర్య తీసుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. ఈ జరిమానా కేవలం చట్టపరమైన, నియంత్రణ సంబంధిత లోపాలపై ఆధారపడినదేనని ఆర్బీఐ తెలిపింది. బ్యాంకు తన కస్టమర్లతో కుదుర్చుకున్న ఏవైనా లావాదేవీలు లేదా ఒప్పందాల చెల్లుబాటుపై వ్యాఖ్యానించేందుకు ఈ చర్య ఉద్దేశించబడలేదని స్పష్టంచేసింది. అలాగే ఈ నిర్ణయం బ్యాంక్ కస్టమర్ల డబ్బుపై ఎలాంటి ప్రభావం చూపదని కూడా ఆర్బీఐ స్పష్టం చేసింది.