Loading...
RBI: విదేశాల్లోని 60 టన్నుల బంగారాన్ని భారత్‌కు తరలించిన ఆర్బీఐ
విదేశాల్లోని 60 టన్నుల బంగారాన్ని భారత్‌కు తరలించిన ఆర్బీఐ

RBI: విదేశాల్లోని 60 టన్నుల బంగారాన్ని భారత్‌కు తరలించిన ఆర్బీఐ

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2026
02:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) తన బంగారం నిల్వలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో భద్రపరిచిన పసిడిలో కొంత భాగాన్ని తిరిగి స్వదేశానికి తీసుకొచ్చింది. గత సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల కాలంలో ఏకంగా 60.08టన్నుల బంగారాన్ని భారత్‌కు తరలించినట్లు ఆర్బీఐ తాజా అర్ధ వార్షిక నివేదికలో వెల్లడించింది. ఈ పరిణామంతో దేశంలోనే భద్రపరిచిన బంగారం నిల్వల వాటా గణనీయంగా పెరిగింది. ఆర్బీఐ నివేదిక ప్రకారం..ఈ ఏడాది మార్చి చివరి నాటికి దేశీయంగా ఉన్న బంగారం నిల్వలు 680.05 టన్నులుగా ఉన్నాయి. సెప్టెంబర్ చివరి నాటికి ఈ నిల్వలు 740.13టన్నులకు చేరాయి. దీంతో ఆర్బీఐ మొత్తం పసిడి నిల్వల్లో భారత్‌లోనే భద్రపరిచిన బంగారం వాటా 77.23శాతం నుంచి దాదాపు 84శాతానికి పెరిగింది.

వివరాలు 

మొత్తం బంగారం నిల్వల్లో మార్పు లేదని తెలిపిన రిజర్వ్ బ్యాంక్

కాగా, ఆర్బీఐ వద్ద ఉన్న మొత్తం బంగారం నిల్వల్లో ఎలాంటి మార్పు లేదు.

మొత్తం 880.52 టన్నుల బంగారం యథాతథంగా ఉంది. అయితే విదేశాల్లోని నిల్వల్లో మాత్రం తగ్గుదల నమోదైంది.

బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్ (బీఐఎస్) వంటి అంతర్జాతీయ సంస్థల వద్ద భద్రపరిచిన బంగారం నిల్వలు మార్చి నాటికి 197.67 టన్నులుగా ఉండగా.. సెప్టెంబర్ నాటికి 140.39 టన్నులకు తగ్గాయి.

అంటే ఈ ఆరు నెలల్లో విదేశాల్లో ఉన్న నిల్వల నుంచి 60.08 టన్నుల బంగారాన్ని భారత్‌కు తీసుకొచ్చినట్లు స్పష్టమవుతోంది.

వివరాలు 

మరోవైపు పెరిగిన విదేశీ మారక ద్రవ్య నిల్వలు

మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల్లో వచ్చిన మార్పుల ప్రభావం నిల్వల విలువపై పడింది.

దీంతో ఆర్బీఐ వద్ద ఉన్న మొత్తం బంగారం నిల్వల విలువ 115.40 బిలియన్ డాలర్ల నుంచి 106.08 బిలియన్ డాలర్లకు తగ్గింది.

ఇదిలా ఉండగా, దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు (ఫారెక్స్ రిజర్వ్స్) మాత్రం పెరిగాయి.

సెప్టెంబర్ చివరి నాటికి ఇవి 737.78 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

అలాగే, విదేశీ కరెన్సీ ఆస్తులను (ఎఫ్‌సీఏ) కూడా ఎక్కువగా సెక్యూరిటీల రూపంలోకి మళ్లించినట్లు ఆర్బీఐ తన నివేదికలో పేర్కొంది.

ADVERTISEMENT