RBI proposes uniform interest: వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ కొత్త ప్రతిపాదనలు.. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఒకే నిబంధనలు
ఈ వార్తాకథనం ఏంటి
రుణాలపై వడ్డీ రేట్ల నిర్ణయం, వడ్డీ లెక్కింపు విధానంలో పారదర్శకతతో పాటు ఏకరూపత తీసుకురావడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కీలక ప్రతిపాదనలు చేసింది. బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు) అనుసరించే రుణ నిబంధనలను ఒకే విధంగా తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టింది. ఆగస్టు ద్రవ్య విధాన సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు రుణాలపై వడ్డీని లెక్కించేందుకు వేర్వేరు డే కౌంట్ (Day Count) విధానాలను అనుసరిస్తున్నాయి.
వివరాలు
డే కౌంట్ విధానాన్ని ప్రామాణీకరించాలని ఆర్‌బీఐ ప్రతిపాదన
దీంతో ఒకే తరహా రుణాలపై కూడా సంస్థల మధ్య వడ్డీ లెక్కింపులో తేడాలు కనిపిస్తున్నాయి.
ఈ అసమానతలను తొలగించి, రుణగ్రహీతలకు స్పష్టత కల్పించేందుకు డే కౌంట్ విధానాన్ని ప్రామాణీకరించాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది.
దీనివల్ల అన్ని ఆర్థిక సంస్థల్లో వడ్డీ లెక్కింపు ఒకే విధంగా ఉండే అవకాశం ఉంది.
అలాగే,ఫ్లోటింగ్ వడ్డీ రేట్ల సవరణలోనూ ప్రస్తుతం ఏకరూపత లేదు. కొన్ని బ్యాంకులు ప్రతి నెలా, మరికొన్ని మూడు నెలలకు ఒకసారి, ఇంకొన్ని ఆరు నెలలు లేదా ఏడాదికోసారి వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి.
వివరాలు
ఫ్లోటింగ్ వడ్డీ రేట్ల సవరణకు కూడా ఒకే విధమైన ప్రమాణాలు
ఈ కారణంగా రుణగ్రహీతలకు ఈఎంఐల్లో మార్పులు ఎప్పుడు వస్తాయో అర్థం చేసుకోవడం కష్టమవుతోంది.
ఈ పరిస్థితిని మార్చేందుకు ఫ్లోటింగ్ వడ్డీ రేట్ల సవరణకు కూడా ఒకే విధమైన ప్రమాణాలు తీసుకురావాలని ఆర్‌బీఐ నిర్ణయించింది.
ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే, ఆర్‌బీఐ రెపో రేటులో మార్పు చేసిన తర్వాత రుణాలపై ఈఎంఐలు ఎప్పుడు మారతాయనే విషయంలో స్పష్టత ఉంటుంది.
అంతేకాదు, వేర్వేరు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వినియోగదారులకూ ఒకే సమయంలో వడ్డీ రేట్ల మార్పులు అమలయ్యే అవకాశం ఉంటుంది.
గతంలో హోమ్ లోన్, ఆటో లోన్, ఎంఎస్‌ఎంఈ రుణాలను బ్యాంకులు ప్రధానంగా ఎంసీఎల్‌ఆర్ (MCLR) ఆధారంగా మంజూరు చేసేవి.
వివరాలు
రుణం తీసుకునే ముందు వడ్డీ రేట్లు, నిబంధనలు అర్థం చేసుకోవడం కూడా మరింత సులభం
అయితే 2019లో కొత్త రుణాలను ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్ (EBLR) విధానానికి అనుసంధానం చేయాలని ఆర్‌బీఐ సూచించింది.
దీంతో అప్పటి వరకు మంజూరైన రుణాలకు ఎంసీఎల్‌ఆర్, కొత్త రుణాలకు ఈబీఎల్‌ఆర్ విధానం అమలులోకి వచ్చింది.
ప్రస్తుతం అమల్లో ఉన్న విధానంలో ఉన్న లోపాలను సరిదిద్దడంతో పాటు, ఆర్‌బీఐ రెపో రేటు తగ్గించినప్పుడు ఆ ప్రయోజనం రుణగ్రహీతలకు మరింత వేగంగా అందేలా ఈ కొత్త ప్రతిపాదనలు రూపొందించింది.
అలాగే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల రుణ నిబంధనలను ఒకే విధంగా తీసుకురావడం ద్వారా వినియోగదారులు వివిధ రుణ ఆఫర్లను సులభంగా పోల్చుకునే అవకాశం కలుగుతుంది.
రుణం తీసుకునే ముందు వడ్డీ రేట్లు, నిబంధనలు అర్థం చేసుకోవడం కూడా మరింత సులభతరం కానుంది.