LOADING...
RBI on Financial frauds: ఆర్థిక మోసాల నివారణకు ఆర్బీఐ కొత్త నిర్ణయం 
ఆర్థిక మోసాల నివారణకు ఆర్బీఐ కొత్త నిర్ణయం

RBI on Financial frauds: ఆర్థిక మోసాల నివారణకు ఆర్బీఐ కొత్త నిర్ణయం 

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 07, 2025
01:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్థిక మోసాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. భారతదేశంలోని బ్యాంకులకు ఇకపై 'bank.in' ఇంటర్నెట్ డొమైన్‌ను తప్పనిసరి చేసింది. అదే విధంగా, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు 'fin.in' డొమైన్‌ను ఉపయోగించాలని సూచించింది. ద్వైపాక్షిక పరపతి విధాన సమీక్ష సందర్భంగా ఆర్‌ బి ఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 'bank.in' రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఆ తర్వాత 'fin.in' రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తామని గవర్నర్ స్పష్టం చేశారు. డిజిటల్ చెల్లింపుల్లో మోసాలు పెరుగుతున్న వేళ, బ్యాంకింగ్ వ్యవస్థపై వినియోగదారుల నమ్మకాన్ని పెంచే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Details

'bank.in' డొమైన్‌ను అనుసరించాలి

ఇటీవల కాలంలో ఫిషింగ్ వెబ్‌సైట్ల ద్వారా నేరగాళ్లు వినియోగదారులను మోసగిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో అర్ బి ఐ ఈ కొత్త డొమైన్ విధానాన్ని అమలు చేస్తోంది. అసలు బ్యాంక్ వెబ్‌సైట్‌లను పోలి ఉండే నకిలీ వెబ్‌సైట్లను అడ్డుకునేందుకు 'bank.in' డొమైన్‌ను అనుసరించాలనే నిబంధన తీసుకువస్తున్నట్లు అర్ బి ఐ స్పష్టం చేసింది. ఈ డొమైన్ రిజిస్ట్రేషన్‌కు ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తుందని తెలిపింది.

Details

త్వరలోనే పూర్తి వివరాలు

అంతేకాకుండా, దేశంలో జారీ అయిన డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఇతర దేశాల్లో జరిగే లావాదేవీలకు అదనపు భద్రతగా AFA విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు గవర్నర్ తెలిపారు. ఇతర దేశాల్లో ఉన్న మర్చంట్లతో సురక్షిత లావాదేవీల కోసం ఈ కొత్త భద్రతా చర్యలను తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ముసాయిదాను విడుదల చేసి, సంబంధిత భాగస్వామ్య పక్షాల నుంచి అభిప్రాయాలను సేకరిస్తామని అర్ బి ఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు.