RBI's new FD rules: అక్టోబర్ 5 నుంచి FDలపై కొత్త RBI నిబంధనలు.. డిపాజిటర్లకు కీలక మార్పులు
ఈ వార్తాకథనం ఏంటి
ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD) చేసే ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీ రేట్లను నిర్ణయించే విధానం, వాటిని ఖాతాదారులకు వెల్లడించే ప్రక్రియలో మార్పులు తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 5 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే ఈ మార్పుల వల్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు వెంటనే పెరుగుతాయో, తగ్గుతాయో అనుకోవాల్సిన అవసరం లేదు. కొత్త నిబంధనల ప్రధాన ఉద్దేశం బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకత పెంచడంతో పాటు, ఒకే బ్యాంకుకు చెందిన అన్ని శాఖల్లో ఒకే రకమైన డిపాజిట్‌పై ఒకే వడ్డీ రేటు అమలు చేయడం.
వివరాలు
రిటైల్ FD పెట్టుబడిదారులకు ఏమి మారనుంది?
ఈ మార్గదర్శకాలు ప్రభుత్వ, ప్రైవేట్ వాణిజ్య బ్యాంకులతో పాటు చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRBs), స్థానిక ప్రాంత బ్యాంకులు,పేమెంట్ బ్యాంకులు, పట్టణ సహకార బ్యాంకులకు కూడా వర్తిస్తాయి.
అంటే దేశంలోని దాదాపు అన్ని బ్యాంకింగ్ సంస్థలు ఈ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది.
కొత్త నిబంధనల ప్రకారం ఒకే రోజున,ఒకే రకమైన ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన ఖాతాదారులకు అదే బ్యాంకు అన్ని శాఖల్లో ఒకే వడ్డీ రేటు వర్తించాలి.
ఉదాహరణకు హైదరాబాద్‌లోని ఒక శాఖలో రెండేళ్ల కాలపరిమితి గల FDపై 6.75 శాతం వడ్డీ ప్రకటిస్తే, అదే రోజున విజయవాడ, విశాఖపట్నం లేదా ఇతర శాఖల్లో కూడా అదే రకమైన FDకు 6.75 శాతం వడ్డీనే ఇవ్వాలి.
వివరాలు
వెబ్‌సైట్‌లో ముందుగానే వడ్డీ రేట్లు ప్రకటించాలి
ఇప్పటి వరకు కొన్ని సందర్భాల్లో శాఖల వారీగా లేదా ప్రత్యేక ఆఫర్ల పేరుతో వడ్డీరేట్లలో స్వల్ప తేడాలు ఉండే అవకాశం ఉండేది.
కొత్త నిబంధనల అమలుతో అలాంటి వ్యత్యాసాలకు చెక్ పడనుంది.దీంతో అన్ని ఖాతాదారులకు సమానమైన వడ్డీ రేట్లు అందేలా వ్యవస్థ మరింత పారదర్శకంగా మారనుంది.
కొత్త మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు తమ డిపాజిట్ వడ్డీరేట్లను అధికారిక వెబ్‌సైట్లలో ముందుగానే తప్పనిసరిగా ప్రచురించాలి.
వినియోగదారులకు చెల్లించే వడ్డీరేట్లు కూడా అదే పట్టికకు అనుగుణంగా ఉండాలి.
ప్రకటించిన రేట్లకు భిన్నంగా వ్యవహరించే అవకాశం ఉండదు.
దీంతో ఖాతాదారులు బ్యాంకు శాఖలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వివిధ బ్యాంకుల FD వడ్డీ రేట్లను ఆన్‌లైన్‌లో పోల్చి చూసి,తమకు అనుకూలమైన బ్యాంకును ఎంపిక చేసుకునే వీలు కలుగుతుంది.
వివరాలు
ఇలా ఉంటే ఇక గందరగోళం ఉండదు
ఉదాహరణకు అక్టోబర్ 5న ఒకే బ్యాంకులో రూ.5 లక్షలతో ఏడాది కాలానికి ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకుంటే, హైదరాబాద్ శాఖలో 6.75 శాతం, విజయవాడలో 6.50 శాతం,విశాఖపట్నంలో 6.90 శాతం వడ్డీ ఇస్తే ఖాతాదారుల్లో గందరగోళం ఏర్పడుతుంది.
అయితే కొత్త RBI నిబంధనల ప్రకారం ఇకపై ఒకే బ్యాంకులో, ఒకే తేదీన, ఒకే రకమైన FDపై అన్ని శాఖల్లో ఒకే వడ్డీ రేటు మాత్రమే అమల్లో ఉండాలి.
అంతేకాదు, ఆ వడ్డీ రేటును బ్యాంకు ముందుగానే తన వెబ్‌సైట్‌లో ప్రకటించాలి.
దీంతో ఏ శాఖలో డిపాజిట్ చేసినా ఒకే వడ్డీ రేటు వర్తిస్తుంది. అయితే అక్టోబర్ 5 నుంచి అన్ని బ్యాంకులు FD వడ్డీ రేట్లను పెంచుతాయో లేదా తగ్గిస్తాయో అనుకోవడం సరైంది కాదు.
వివరాలు
బల్క్ డిపాజిట్లకు ప్రత్యేక వెసులుబాటు
మార్కెట్ పరిస్థితులు, నిధుల అవసరం, RBI ద్రవ్య విధానం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వడ్డీ రేట్లను నిర్ణయించే అధికారం యథాతథంగా బ్యాంకులకే ఉంటుంది.
సాధారణ రిటైల్ ఖాతాదారులతో పోలిస్తే ఈ మార్పులు పెద్ద మొత్తంలో డిపాజిట్లు చేసే సంస్థలు, కంపెనీలు, కార్పొరేట్ ఖాతాదారులకు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
బల్క్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను నిర్ణయించే విషయంలో RBI బ్యాంకులకు కొంత వెసులుబాటు కల్పించింది.
లిక్విడిటీ కవరేజ్ రేషియో (LCR) నిబంధనలను పరిగణనలోకి తీసుకుని బల్క్ డిపాజిట్లకు వేర్వేరు వడ్డీ రేట్లు నిర్ణయించే అవకాశం ఉంటుంది.
వివరాలు
బల్క్ డిపాజిట్లకు ప్రత్యేక వెసులుబాటు
ఇదే సౌలభ్యాన్ని ప్రవాస భారతీయుల (NRI) రూపాయి డిపాజిట్లకు కూడా వర్తింపజేశారు.
దీంతో బ్యాంకులు తమ నిధుల అవసరాలు, మార్కెట్ పరిస్థితులను బట్టి బల్క్ డిపాజిట్లపై అనువైన వడ్డీ రేట్లను నిర్ణయించుకోవచ్చు.
అలాగే బల్క్ డిపాజిట్లకు సంబంధించిన వడ్డీ రేట్లను ప్రతి పనిదినం ఉదయం 10 గంటలలోపు బ్యాంకులు తమ వెబ్‌సైట్లలో తప్పనిసరిగా ప్రకటించాలి.
అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే గరిష్టంగా ఉదయం 10:10 గంటల వరకు సమయం ఉంటుంది.
దీంతో పెద్ద పెట్టుబడిదారులు కూడా తాజా వడ్డీ రేట్లను సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
వివరాలు
అక్టోబర్ 5 నుంచే FD వడ్డీ రేట్లు మారతాయా?
చాలా మంది పెట్టుబడిదారుల్లో ఉన్న ప్రధాన సందేహం ఇదే. దీనికి సమాధానం 'కాదు'.
కొత్త నిబంధనల కారణంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఆటోమేటిక్‌గా పెరగవు లేదా తగ్గవు.
ఇప్పటిలాగే బ్యాంకులు తమ నిధుల అవసరాలు, మార్కెట్ పరిస్థితులు, RBI ద్రవ్య విధానం, నిధుల సమీకరణ వ్యయం వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి.
అంటే ఈ మార్పులు వడ్డీ రేట్లను మార్చడం కోసం కాకుండా, వాటి ప్రకటనలో పారదర్శకత తీసుకురావడం, అన్ని శాఖల్లో సమానంగా అమలు చేయడం కోసం తీసుకొచ్చినవే.
వివరాలు
డిపాజిటర్లకు కలిగే ప్రయోజనాలు
కొత్త RBI నిబంధనలతో ఫిక్స్‌డ్ డిపాజిట్ పెట్టుబడిదారులకు మరింత స్పష్టత లభించనుంది.
ఒకే బ్యాంకులో వేర్వేరు శాఖల్లో వడ్డీ రేట్లు మారే పరిస్థితికి చెక్ పడుతుంది.
అదే సమయంలో బ్యాంకులు ముందుగానే తమ వెబ్‌సైట్లలో వడ్డీ రేట్లను ప్రకటించాల్సి ఉండటంతో, పెట్టుబడిదారులు వివిధ బ్యాంకుల FDరేట్లను సులభంగా పోల్చి చూసి తమకు అనువైన పథకాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది.
మొత్తంగా చూస్తే అక్టోబర్ 5 నుంచి అమల్లోకి వచ్చే ఈ కొత్త నిబంధనలు FD వడ్డీ రేట్లలో తక్షణ మార్పులు తీసుకురావు.
అయితే బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకతను పెంచడం,అన్ని శాఖల్లో సమానమైన విధానాన్ని అమలు చేయడం,డిపాజిటర్లకు స్పష్టమైన సమాచారం అందుబాటులో ఉంచడం వంటి అంశాల్లో ఇవి కీలక మార్పులకు దారి తీస్తాయని భావిస్తున్నారు.