Boeing 737: బోయింగ్ విమానాల్లో కీలకమైన రడ్డర్ వ్యవస్థలు మోరాయిస్తున్నాయి: డీజీసీఏ హెచ్చరికలు
భారత్‌లోని కొన్ని ఎయిర్‌లైన్స్ ఉపయోగిస్తున్న బోయింగ్ 737 మోడల్ విమానాల్లో రడ్డర్ వ్యవస్థ (వెనక భాగంలో ఉన్న నియంత్రణ పరికరం) పనిచేయడంలో లోపాలు ఉన్నాయని డీజీసీఏ హెచ్చరించింది. ఈ సమస్య అన్ని 737 మోడల్స్‌కు వర్తిస్తుందని డీజీసీఏ పేర్కొంది. భారత్‌లో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, స్పైస్ జెట్, ఆకాశా ఎయిర్ వంటి ఎయిర్‌లైన్స్ ఈ సిరీస్ విమానాలను ఉపయోగిస్తున్నాయి. ముఖ్యంగా, ప్రభుత్వ వీఐపీలు కూడా ఈ విమానాలను ఉపయోగించడం ఆందోళనకరంగా మారింది. విమాన సంస్థలు తక్షణం సేఫ్టీ రిస్క్ పరీక్షలు నిర్వహించాలని డీజీసీఏ సూచించింది. రడ్డర్ కంట్రోల్ వ్యవస్థ జామ్ అవుతున్న విషయాన్ని అన్ని విమాన సిబ్బందికి సర్క్యూలర్ ద్వారా తెలియజేయాలని, అవసరమైన చర్యలను ప్రకటించాలని పేర్కొంది.
అమెరికా హెచ్చరికలు
రడ్డర్ వ్యవస్థ విమానాలను గాల్లో స్థిరంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది, ఇది విమానాల తోక భాగంలో నిలువుగా ఉంటుంది. భారత వాయుసేన కూడా 737 శ్రేణి విమానాలను వినియోగిస్తోంది. వీటిలో వీఐపీ స్క్వాడ్రన్ కూడా ఉంది, ప్రధానమంత్రి వినియోగించే విమానం కూడా 737 రకం కావడం గమనార్హం. దాదాపు వారం క్రితమే, అమెరికా నేషనల్ ట్రాన్స్‌పోర్టు సేఫ్టీ బోర్డు (NTSB) కూడా ఈ సమస్యపై హెచ్చరికలు జారీ చేసింది. 40 పైగా విదేశీ విమాన సంస్థలు ఉపయోగిస్తున్న 737 విమానాల్లో రడ్డర్ వ్యవస్థ ముప్పుగా మారే అవకాశం ఉందని NTSB వెల్లడించింది.
అలస్కా ఎయిర్‌లైన్స్‌లో నాలుగు కీలకమైన బోల్టులు లేవు
2019లో రెండు విదేశీ విమాన సంస్థలు ఈ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొన్నాయని తెలిపింది. కొత్తగా వాడుతున్న గైడెన్స్ ఆక్చ్యుయేటర్ల వల్ల ఈ సమస్య తలెత్తుతోందని, చాలా కంపెనీలకు ఇది తెలియకపోవచ్చని NTSB పేర్కొంది. 2024 జనవరిలో అలస్కా ఎయిర్‌లైన్స్‌లో నాలుగు కీలకమైన బోల్టులు లేకపోవడంతో మొదటిసారి ఈ సమస్య వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరిలో 161 మంది ప్రయాణిస్తున్న యునైటెడ్ 737 మ్యాక్స్ విమానంలో రడ్డర్ పెడల్స్ పనిచేయకపోవడం పెద్ద సంచలనం రేపింది.