RIL AGM: ఈనెల 29న రిలయన్స్ ఏజీఎం.. ఈసారి అంబానీ ప్రకటనలు వీటిపైనేనా?
రిలయెన్స్ వార్షిక సాధారణ సమావేశం ప్రతేడాది జరుగుంది. 2016లో జియో లాంచ్ తర్వాత నుంచి ప్రతి ఏజీఎంలో కొత్త ప్రకటనలపై ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది కూడా రిలయన్స్ 47వ వార్షిక సాధారణ సమావేశం ఆగస్ట్ 29న మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. ఈ ఈవెంట్‌ను యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. సుమారు 35 లక్షల మంది షేర్ హోల్డర్లను ఉద్ధేశించి ముకేష్ అంబానీ ప్రసంగించనున్నారు. ఈ ఏడాది ఏజీఎంలో ముకేశ్ అంబానీ వివిధ వ్యాపారాల ప్రగతి, భవిష్యత్ ప్రణాళికలను తెలియజేయనున్నారు.
వారసత్వ ప్రణాళికలపై ప్రకటనలు వెలువడే అవకాశం
రిలయన్స్ జియో, రిటైల్ వంటి విభాగాలు ఇటీవల కాలంలో మెరుగైన ప్రదర్శనతో ముందుకెళ్తున్నాయి. ఈ వ్యాపారాల లిస్టింగ్ గురించి ముకేశ్ 2019లోనే ప్రస్తావించారు, కానీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటనలు చేయలేదు. ఈసారి వాటిపై కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ముకేశ్ అంబానీ తన పిల్లలైన ఈశా, ఆకాశ్, అనంత్‌లకు వ్యాపార బాధ్యతలను అప్పగించారు. ఈ నేపథ్యంలో వారసత్వ ప్రణాళికలపై కూడా ప్రకటనలు వెలువడే అవకాశాలున్నాయి. రిలయన్స్ న్యూ ఎనర్జీ బిజినెస్‌లో చేస్తున్న ప్రగతి, జామ్‌నగర్‌లో ఏర్పాటు చేస్తున్న మెగా గ్రీన్ ఎనర్జీ కాంప్లెక్స్ గురించి అప్‌డేట్లు ఉండొచ్చని ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు.
కొత్త ప్రకటనలపై ఆసక్తి
గత ఏజీఎంలలో రిలయన్స్ కొన్ని కీలకమైన ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. 2016లో జియో టెలికాం సేవలను ప్రారంభించారు. తర్వాత 2017లో జియో ఫోన్‌తో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చారు. 2019లో జియో ఫైబర్‌ను లాంచ్ చేయగా, 2021లో న్యూ ఎనర్జీ బిజినెస్ ప్రకటించారు. 2022లో 5జీపై రూ.2లక్షల కోట్ల పెట్టుబడులను ప్రకటించారు. 2023లో జియో ఎయిర్‌ఫైబర్ గురించి కూడా వివరించారు. ఈ ఏడాది కూడా కొత్తగా ఏం ప్రకటిస్తారో వేచి చూడాలి.