Robert Kiyosaki Warns: స్టాక్ మార్కెట్ పతనం తప్పదా? రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి స్టాక్ మార్కెట్‌పై ఆందోళనకర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే భారీ మార్కెట్ పతనం సంభవించే అవకాశముందని ఆయన హెచ్చరించారు. ఫిబ్రవరి 17న ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన, "ఒక పెద్ద ఆర్థిక సంక్షోభం దరిచేరుతోంది. దీనికి ముందే సిద్ధంగా ఉన్నవారికి ఇది ఊహించని స్థాయిలో సంపదను సృష్టించే అవకాశం అవుతుంది. కానీ సిద్ధం కాకపోతే, అదే పరిస్థితి భయంకరమైన అనుభవంగా మారుతుంది" అని పేర్కొన్నారు. గత ఏడాది మొత్తం కియోసాకి పలు సందర్భాల్లో మార్కెట్ కుప్పకూలే ప్రమాదంపై హెచ్చరికలు జారీ చేస్తూ వచ్చారు.
వివరాలు
సరైన ప్రణాళికతో ముందుకెళ్తే అది గొప్ప అవకాశం..
ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అసలైన విలువలపై కాకుండా, నకిలీ కరెన్సీ, అధిక అప్పులు, బలహీనమైన పెన్షన్ వ్యవస్థలపై ఆధారపడి ఉన్న పెద్ద బుడగలా తయారైందని ఆయన అభిప్రాయపడ్డారు. మార్కెట్ పతనం తప్పనిసరిగా చెడు విషయమే కాదని, సరైన ప్రణాళికతో ముందుకెళ్తే అది గొప్ప అవకాశంగా మారుతుందని చెప్పారు. పెట్టుబడిదారులు వాస్తవ విలువ కలిగిన ఆస్తులపై దృష్టి పెట్టాలని కియోసాకి సూచించారు. తాను వ్యక్తిగతంగా బంగారం, వెండి, బిట్‌కాయిన్‌లలో పెట్టుబడులు పెట్టినట్టు వెల్లడించారు. బిట్‌కాయిన్‌కు కేవలం 21 మిలియన్ నాణేల పరిమితి ఉండటంతో అది కొరత ఉన్న ఆస్తిగా మారిందని, మార్కెట్‌లో ఉన్న అస్థిరతకు ఎదురుగాలిగా పనిచేస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
వివరాలు
బిట్‌కాయిన్ కొనుగోలు
భయంతో ప్రజలు అమ్మకాలకు దిగిన సమయంలో తాను మరింత బిట్‌కాయిన్ కొనుగోలు చేస్తానని స్పష్టం చేశారు. మార్కెట్ క్రాష్‌లు అంటే నిజానికి విలువైన ఆస్తులు తక్కువ ధరలకు లభించే సందర్భాలేనని కియోసాకి వ్యాఖ్యానించారు. ఆర్థిక మాంద్యం రావడం అనివార్యమే అయినా, దానిని సరిగా ఉపయోగించుకున్నవారికి అది అరుదైన సంపద సృష్టి అవకాశంగా మారుతుందని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు.