Page Loader
Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 1400 పాయింట్లు పతనం
భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 1400 పాయింట్లు పతనం

Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 1400 పాయింట్లు పతనం

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 01, 2025
04:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి.అమెరికా ప్రతీకార సుంకాల భయాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో సూచీలు గణనీయంగా క్షీణించాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 1400 పాయింట్లకు పైగా క్షీణించగా,నిఫ్టీ 23,200 మార్క్‌ దిగువకు చేరింది. బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు రూ.3.5 లక్షల కోట్లు క్షీణించి రూ.409 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్‌ ఉదయం 76,882.58 పాయింట్ల వద్ద (మునుపటి ముగింపు 77,414.92) నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే కదలాడింది.ఇంట్రాడేలో 75,912.18 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ చివరికి 1390.41 పాయింట్ల నష్టంతో 76,024.51 వద్ద ముగిసింది.

వివరాలు 

అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 75.12 డాలర్లు 

నిఫ్టీ 353.65 పాయింట్ల నష్టంతో 23,165 వద్ద స్థిరపడింది.సెన్సెక్స్‌ 30 సూచీలో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, జొమాటో మినహా మిగిలిన అన్ని షేర్లు నష్టాల్లో ముగిశాయి. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 75.12 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ఔన్సు 3160 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

వివరాలు 

మార్కెట్ల పతనానికి కారణాలు ఇవే:

ప్రతీకార టారిఫ్‌లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఏప్రిల్‌ 2న తుది నిర్ణయాన్ని ప్రకటించనున్న నేపథ్యంలో సూచీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దేశీయ ఐటీ కంపెనీలకు అమెరికా నుంచే ప్రధానంగా ఆదాయం వస్తుంది. అలాంటిది, అమెరికాలో ఐటీకి ఆశించిన డిమాండ్‌ ఉండకపోవచ్చని అంచనాలతో ఐటీ స్టాక్స్‌లో అమ్మకాలు పెరిగాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్‌, ఎల్‌అండ్‌టీ, హెచ్‌సీఎల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 75 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, భారత్‌ చమురును ప్రధానంగా దిగుమతి చేసుకొనే దేశం కావడంతో, ఈ అంశం మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది.

వివరాలు 

వొడాఫోన్‌ ఐడియా షేర్లు 20 శాతం పెరిగాయి

ఇటీవల దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలైన సెన్సెక్స్‌,నిఫ్టీ వరుసగా 8సెషన్లలో దాదాపు 5శాతం పెరిగాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం కూడా మరో కారణమని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌,ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్ షేర్లలో అమ్మకాలు సూచీలను పడేశాయి. వొడాఫోన్‌ ఐడియా వాటాను పెంచేందుకు ప్రభుత్వం అనుమతించడంతో,ఆ టెలికాం కంపెనీ షేర్లు నేడు 20 శాతం మేర పెరిగాయి. స్పెక్ట్రమ్‌ కోసం వొడాఫోన్‌ ఐడియా చెల్లించాల్సిన మొత్తానికి సంబంధించి తాజాగా ఈక్విటీ షేర్లను ప్రభుత్వానికి కేటాయిస్తున్నట్లు సంస్థ తెలిపింది. వొడాఫోన్‌ ఐడియాలో ప్రభుత్వానికి 22.6% వాటా ఉండగా,అది తాజాగా 49 శాతానికి పెరిగింది. ఈ నేపథ్యంలో వొడాఫోన్‌ ఐడియా షేర్లు ఎన్‌ఎస్‌ఈలో రూ.1.37 శాతం లాభంతో 8.17 వద్ద ముగిశాయి.